గజిబిజి గందరగోళంగా ‘ఈగల్‌’!?

రవితేజ కథానాయకుడిగా, కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడిగా ‘ఈగల్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ కెరీర్‌లో ఈ సినిమా కూడా పెద్ద బడ్జెట్‌ మూవీ అవుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ ఒక ముఖ్యపాత్రలో కనిపించగా, కావ్య థాపర్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఢిల్లీలోని ఒక జాతీయ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్‌ నళిని రావు (అనుపమ పరమేశ్వరన్‌) అనుకోకుండా ఒక చేనేత వస్త్రాన్ని చూస్తుంది, ఆసక్తిగా అది ఎక్కడనుండి వచ్చింది, అది తయారు చేసే వ్యక్తి గురించి ఆరా తీసి ఒక చిన్న వార్తగా పత్రికలో రాస్తుంది.

ఆ వార్త చూసిన ఇంటిలిజెన్స్‌, రా డిపార్టుమెంట్స్‌ రంగంలోకి దిగి ఆ పేపర్‌ ఒకరోజు ప్రింట్‌ అవకుండా అడ్డుకొని, ఆ వార్త ఎలా వచ్చింది, ఎవరు రాసారు అని ఆరా తీస్తారు. పత్రిక యాజమాన్యం ఆ వార్త రాసిన నళినిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తారు. అప్పుడు నళినికి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగి మదనపల్లి వచ్చి అక్కడ తన పరిశోధన ప్రారంభిస్తుంది. అక్కడ వున్న పోలీసు అధికారి చెంగల్‌ రెడ్డి (మిర్చి కిరణ్‌), ఎంఎల్‌ఏ (అజయ్‌ ఘోష్‌) అతని పిఏ (శ్రీనివాస్‌ రెడ్డి) వీళ్లందరినీ అడిగితే అతని పేరు సహదేవ్‌ వర్మ (రవితేజ) అని తెలుస్తుంది. అతను అక్కడ పత్తిని పండించి చేనేత కార్మికులకు అండగా వున్నాడు అని తెలుస్తోంది. అతని గురించి చాలా లోతుగా పరిశోధన మొదలుపెట్టిన నళినికి సహదేవ్‌ వర్మ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి. భారతదేశంతో పాటు విదేశీ ప్రభుత్వాలు కూడా ఈ సహదేవ్‌ వర్మ గురించి వెదుకుతున్నారని, ఎక్కడో యూరప్‌లో మారణాయుధాలు ‘ఈగల్‌’ పేరుపై దొంగతనంగా సప్లై చేసే అతను.. ఇక్కడ సహదేవ్‌ వర్మగా ఎందుకున్నాడు? అతని భార్య రచన (కావ్య థాపర్‌)కి ఏమైంది? అన్నదే కథ. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తీసిన ఈ ‘ఈగల్‌’ కూడా ‘కెజిఎఫ్‌’ కోవలోకి వస్తుంది.

అనుపమ పరమేశ్వరన్‌ కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. అక్కడనుండి ఆమె పరిశోధనకు మదనప్లలె వస్తుంది, ఇక అక్కడనుండి రవితేజ పాత్ర కోసం బిల్డప్‌ మొదలవుతుంది. కథ ఏమీ లేకుండా వూరికే అందరూ రవితేజ పాత్ర కోసం బిల్డప్‌ ఇచ్చుకుంటూ వెళతారు. సినిమా మొదలైన 45 నిముషాల వరకు రవి తేజ పాత్ర అసలు తెరవిూదకి రాదు. టూకీగా చెప్పాలంటే మారణాయుధాలని దొంగ రవాణా చేసి యూరప్‌ దేశాల్లో ‘ఈగల్‌’ గా పేరొంది తుపాకీ అద్భుతంగా పేల్చగల వ్యక్తి.. అదే మారణాయుధాలని అక్కడ దొంగ రవాణా అవుతున్నా పట్టుకొని తనదగ్గర ఉంచుకుంటాడు, ఎందుకు? దాని వెనకాల వుండే నేపధ్యం ఏమిటి అనేది కథ. వినటానికి చాలా బాగుంది, ఇది బాగా చెప్పొచ్చు కూడా.

కానీ దర్శకుడు ఈ కథనే చిలవలు పలవలుగా చేసి, అటు ఇటు తిప్పి, ఎంతసేపూ ఒక్కో సన్నివేశం విూదే దృష్టి పెట్టాడు కానీ, కథ, కథనం విూద సరిగ్గా దృష్టి పెట్టలేదు. రెండో సగంలో రవితేజ, కావ్య థాపర్‌ మధ్య నడిచే సన్నివేశాలు కథానాయకుడికి తుపాకీ పేల్చడంలో ఎంత ప్రవేశం వుందో చెప్పటం కోసం అన్నట్టుగా తుపాకీతో సమాధానాలు చెప్పించాడు. అలాగే సహదేవ్‌ వర్మ వుండే ఇంటి దగ్గర ఏమి జరిగింది అనేది చిన్న పిల్లాడితో ప్లాష్‌ బ్యాక్‌ చెప్పించాడు, అతను గ్రనేడ్స్‌, గన్స్‌, పోలీసులు, మిలిటరీ వీటన్నిటి గురించి చెప్పేస్తూ ఉంటాడు.

ఇలాంటివి విచిత్రాలు చాలా వున్నాయి సినిమాలో. రా చీఫ్‌ మధుబాల, డిఫెన్స్‌ మినిస్టర్‌, మిగతా ఇంటిలిజెన్స్‌ సభ్యులు అందరూ ఢిల్లీలో ఒక గదిలో మదనపల్లిలో జరిగే విధ్వంసాన్ని సీసీ కెమెరాల్లో చూస్తూ ఉలిక్కిపడుతూ వుంటారు. అలాగే కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ నవ్వు తెప్పిస్తాయి. అనుపమ మదనపల్లిలో ఉంటుంది, ఏదో తెలుసుకోవాలంటే అజయ్‌ (నవదీప్‌)ని అడగాలి అంటారు, వెంటనే పోలాండ్‌ రాజధాని వార్సాలో నవదీప్‌ తో మాట్లాడుతూ కనిపిస్తుంది. దర్శకుడు కథని వెనక్కి, ప్రస్తుతానికి.. మళ్ళీ వెనక్కి ఇలా సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపిస్తుంది. కథను నేరుగా వెండితెర పైన అర్థం అయేటట్టు చూపిస్తే బాగుందేమో అనిపిస్తుంది.దర్శకుడు సరైన విధంగా చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు అనిపిస్తుంది.