దసరా దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని సాదించే దిశగా దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ ని ఈ మూవీ కలెక్ట్ చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాని ఎస్ఎల్స్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక నిర్మాతగా అతని కెరియర్ లో ఇప్పటి వరకు అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే నిర్మిస్తూ వచ్చాయి. అయితే వరుసగా అన్ని కూడా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. కమర్షియల్ గా పెట్టిన పెట్టుబడిని ఒక్క సినిమా కూడా తీసుకురాలేదు.

బ్రేక్ ఎవెన్ టార్గెట్ ని కూడా ఆయా సినిమాలు అందుకోలేదని చెప్పాలి. వరుసగా డబల్ హ్యాట్రిక్ డిజాస్టర్ చిత్రాలు తీసిన నిర్మాతగా సుధాకర్ చెరుకూరి మారిపోయాడు. ఆ డిజాస్టర్స్ పరంపరకి దసరా మూవీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ సినిమా మీద భారీ బడ్జెట్ పెట్టిన కూడా అంతకు మించి అనేలా ప్రాజెక్ట్ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ హిందీలో కూడా మెల్లగా పుంజుకుంటుంది. ఇతర భాషలలో కూడా పర్వాలేదనే టాక్ తోనే నడుస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ నిరంతకి మంచి లాభాలు తెచ్చేలానే కనిపిస్తుంది. దీంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదేలకి 80 లక్షల విలువ చేసే బిఎండబ్యూ కారుని బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం.

అలాగే సినిమా కోసం పని చేసిన కొంతమందికి బంగారు నాణేలు కానుకగా ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇన్ని సినిమాల తర్వాత వచ్చిన సూపర్ సక్సెస్ ని నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. రిలీజ్ కి ముందు టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చిన దసరా మూవీ నిర్మాతకి ఏ స్థాయిలో లాభాలు తెచ్చిపెడుతుంది అనేది చూడాలి