కథాకథనంలో లోపించిన బలం… రొటీన్‌గా సాగిన ‘ఆదికేశవ్‌’ ప్రయాణం!

ఉప్పున సినిమాతో హిట్‌ అందుకున్న వైష్ణవ్‌ తేజ్‌ తర్వాత సినిమాలన్నీ పెద్దగా హిట్‌ అందుకోలేదు. తాజాగా ఇప్పుడు ఆదికేశవ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలు (వైష్ణవ్‌ తేజ్‌) అల్లరి చిల్లరిగా తిరిగే ఒక మంచి యువకుడు, అతనికి చిన్నపిల్లల విూద అత్యాచారాలు ఎవరైనా చేసినా, ఆడపిల్లలని ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఊరుకునే మనస్తత్వం కాదు. అతని తల్లిదండ్రులు (రాధిక శరత్‌ కుమార్‌, జయప్రకాశ్‌) అతన్ని వుద్యోగం చెయ్యమని బతిమాలుతూ వుంటారు, వాళ్ళ కోరిక కాదనలేక ఒక కాస్మొటిక్స్‌ కంపెనీ కి అప్లై చేస్తాడు. ఆ కంపెనీ సీఈవో చిత్ర (శ్రీ లీల) బాలుని ఇంటర్వ్యూకి చేసి అతను బెస్ట్‌ అని సెలెక్ట్‌ చేస్తుంది.

తరువాత బాలు వ్యక్తిత్వం చిత్రకు నచ్చి, ఇద్దరూ ప్రేమలో పడతారు. చిత్ర పుట్టినరోజు నాడు, ఆమె తండ్రి అదే కంపెనీ లోనే పనిచేస్తున్న ఇంకొక యువకుడికి చిత్రని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రకటన చేసేస్తాడు. అదే వేడుకలో బాలుకు వార్నింగ్‌ ఇవ్వడానికి కొంతమంది రౌడీలను కూడా పిలిపిస్తాడు. అదే సమయంలో రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే మహా కాళేశ్వర్‌ రెడ్డి (సుమన్‌) అన్నయ్య (తనికెళ్ళ భరణి) వచ్చి బాలుని అత్యవసరంగా రాయలసీమ తీసుకొని వెళతాడు. ఇదిలా ఉండగా బ్రహ్మపురంలో చెంగారెడ్డి (జోజు జార్జి) అనే అతను అక్రమంగా మైనింగ్‌ చేయిస్తూ పిల్లలచేత పనులు చేయిస్తూ ఉంటాడు. అతన్ని అడ్డుకునేవాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు.

హైదరాబాదులో కాస్మొటిక్‌ కంపెనీలో పనిచేసే బాలుకి రాయలసీమకి ఏంటి సంబంధం? బాలు పేరు రుద్రా కాళేశ్వర్‌ రెడ్డి గా ఎందుకు మారింది? చెంగారెడ్డి, బాలు ఎలా కలుసుకున్నారు, అసలు బాలు నేపధ్యం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ’ఆదికేశవ’ సినిమా చూడాల్సిందే. దర్శకుడు శ్రీకాంత్‌ రెడ్డి తన మొదటి సినిమా వ్యాపారాత్మకమైన విలువలతో కూడిన కథని ఎంచుకున్నాడు.

ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తేనే అది అర్థం అవుతుంది. అతను ప్రచార చిత్రంలో చెప్పినట్టుగానే ఈ సినిమా కథ మొదటి నుండీ కేవలం కథానాయకుడిని ఒక మాస్‌ అవతార్‌ లో చూపించడానికి అన్నట్టుగా సాగుతుంది. అంబులెన్స్‌ కి దారివ్వకుండా ఒక రౌడీ రోడ్డు మధ్యలో పుట్టినరోజు కేక్‌ కట్‌ చెయ్యాలనుకోవటం, కథానాయకుడు అతన్ని కొట్టి అంబులెన్స్‌ కి దారి చూపించటంతో అతని మాస్‌ మొదలవుతుంది. బాగానే వుంది కానీ, దర్శకుడు కథ విూద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ఎందుకంటే సినిమా సన్నివేశాలు ఏమి జరగబోతాయి అనేవి చాలా సులువుగా ప్రేక్షకులకి అర్థం అయిపోతూ ఉంటాయి. కథానాయకుడు సినిమా కథానాయకురాలి వెనకాల ’మేడం మేడం’ అంటూ తిరగటం మనం ఎక్కడో విన్నట్టుంది కదా. అలాగే మొదటి సగం అంతా వినోదాత్మకమైన సన్నివేశాలతో సాగదీసాడు దర్శకుడు. ఇక రెండో సగం అంతా రాయలసీమకి షిఫ్ట్‌ అవుతుంది. ఇక్కడ కూడా దర్శకుడు కథ విూద కాకుండా కొన్ని సన్నివేశాలు సాగదీసేసాడు.

భావోద్వేగాలు అంతగా పండలేదు. అదే పోరాట సన్నివేశాలు, అదే రొటీన్‌ కథ అయిపోవడంతో ఈ సినిమాలో కొత్తదనం లేదు. పోరాట సన్నివేశాలు మరీ ఎక్కువయిపోయాయి, సినిమాలో భావోద్వేగాలు బాగా మిస్‌ అయ్యాయి. జీవీ ప్రకాష్‌ కుమార్‌ పాటలు జనరంజకంగా వున్నాయి, ముందు వరుసల్లో కూర్చున్న వాళ్ళకి బాగా ఎక్కుతాయి. నేపథ్య సంగీతం మరీ లౌడ్‌ గా వుంది అనిపించింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే వైష్ణవ్‌ తేజ్‌ ఒక కమర్షియల్‌ సినిమాలో కథానాయకుడు ఎలా ఉండాలో ఆలా చేసి చూపించాడు. మొదటి సగంలో సినిమా కథానాయకురాలి చుట్టూ తిరుగుతూ సరదాగా సాగె పాత్ర, రెండో సగం అంతా యాక్షన్‌. పరవాలేదు బాగానే చేసాడు అనిపించింది. ఇక శ్రీలీల చాలా అందంగా, క్యూట్‌ గా, చలాకీగా వుంది. ’ఆదికేశవ’ ఒక రొటీన్‌ కథతో కేవలం వ్యాపారాత్మక విలువలతో తీసిన సినిమా. చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది డబ్బు, పరపతి కోసం చిన్నపిల్లల్ని తమ మైనింగ్‌ వ్యాపారంలో పావులుగా చేస్తూ వాళ్ళని ఎలా వాడుకుంటున్నారు అనే ఇతివృత్తం బాగుంది, కానీ ఆ విషయం తక్కువై, మిగతా విషయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు దర్శకుడు.