ఎన్టీఆర్ కోసం బాబు పోరాటం: నవ్విపోదురుగాక నాకేటి…!

ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సీజన్ నడుస్తుంది. ఇప్పటికే ఏపీలో ఘనంగా నిర్వహించామని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు… ఆ కార్యక్రమానికి అసలు సిసలు వారసుడు జూనియర్ ని పిలవకుండా తప్పుచేశారు! ఫలితంగా ఆ ఉత్సవాల్లో రజనీకాంత్ తో చెప్పించిన డైలాగులు బౌన్స్ బ్యాక్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన కార్యక్రమంలో రజనీ పాత్ర కూడా ఉందనే విషయం తెరపైకి వచ్చింది. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా హైదరబాద్ లో కూడా ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. అయితే ఈ సమయంలో బాబు చేసిన ప్రసంగంపై తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను టీడీపీ బహిరంగ సభలుగా మార్చారనే విమర్శలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్టీఆర్ పేరుచెప్పుకుని ఓట్లు దండుకోవాలని బాబు ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతుంది. అయితే జనాలు ఇంకా పిచ్చివాళ్లే, వెర్రివాళ్లే అని చంద్రబాబు ఆలోచన మాత్రం మారడంలేదనే కామెంట్లు మరోసారి వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ గురించి చెప్పిన కొన్ని విషయాలు.

ఎన్టీఆర్ బతికున్నపుడు ద్రోహంచేసిందెవరు అనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ గుర్తుచేయాల్సిన అవసరంలేదు. ఆయనకు వెన్నుపోటు పొడిచిందెవరు, చావుకు కారణమైందెవరనే విషయాలు ఆల్ మోస్ట్ ప్రతీ తెలుగువాడికీ తెలుసు. ఆ సంగతి వేదికపై ఉన్న కుర్ర హీరోలతో పాటు సీనియర్ అతిధులందరికీ తెలుసు. పైగా అప్పటికంటే ఇప్పుడు మరి ఎక్కువగా తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విషయాలపై లక్ష్మీపార్వతి ద్వారా మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు!

ఈ శతజయంతి ఉత్సవాల కార్యక్రమలో మెయిన్ హైలెట్ పాయింట్ ఏమిటంటే…. ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాటాలు చేస్తూనే ఉంటామని చంద్రబాబు చెప్పడం. ఇది విన్న తర్వాత కూడా ఆగ్రహం రాకపోతే వాళ్లు అన్నగారి నిజమైన అభిమానులు కాదన్నా అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే… చంద్రబాబు తాను అధికారంలో ఉన్న ఏనాడూ ఈ విషయం గురించి ఆలోచించలేదు! కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా ఆ ఆలోచన చేయలేదు. ఇది ప్రపంచం మొత్తం తెలిసిన విషయం! కానీ… వేదికపై ఉన్న వారికి, సభలో ఉన్నవారికీ, టీవీల్లో చూస్తున్నవారికీ ఆ విషయం తెలియదని భావించారో ఏమో కానీ… ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాటాలు చేస్తూనే ఉంటామని చంద్రబాబు ప్రకటించారు.

అసలు ఎన్టీఆర్ కు భారతరత్న కోసం ఇప్పటివరకు తాను చేసిన పోరాటమేమిటో కనీసం తనకైనా తెలుసా? అసలు, ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకున్నదే చంద్రబాబు అని లక్ష్మీపార్వతి చెబుతుంటారు. అలాంటి చంద్రబాబు…. ఎన్టీఆర్ కు భారతరత్న అంశాన్ని ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెరపైకి తీసుకునివచ్చారు! ఫలితంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని కామెంట్లు పెరిగిపోతున్నాయి. పైగా 2019 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకునే ఓట్లు అడిగారు చంద్రబాబు. కానీ ఫలితం 23కే వచ్చింది. కారణం… ఎన్టీఆర్ వేరు, ఇప్పుడున్న టీడీపీ వేరని ప్రజలు స్పష్టంగా గ్రహించారు! అయినా కూడా బాబు మరోసారి ఆ ప్రయత్నం చేస్తె ఫలితాలు దాదాపు మారకపోవచ్చు!