భోజనం తర్వాత 15 నిమిషాలు ఈ పని చేస్తే.. గుండెపోటు వచ్చే ఛాన్స్ 40% తగ్గుతుందట.. డాక్టర్లు చెబుతున్న సీక్రెట్ ఇదే..!

ప్రస్తుత కాలంలో గుండెజబ్బులు పెద్దవారితో పాటు యువతలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఒత్తిడితో కూడిన జీవితం, వ్యాయామం లేకపోవడం, ఫాస్ట్‌ఫుడ్ అలవాటు, సరైన నిద్ర లేకపోవడం ఇవన్నీ గుండెపై భారం పెంచుతున్నాయి. ఈ సమయంలో వైద్యులు చెబుతున్న ఒక చిన్న మార్పు మన గుండెను రక్షించగలదని చెబుతున్నారు. అదీ భోజనం తర్వాత కేవలం 15 నిమిషాలు నడక. ఈ చిన్న అలవాటు గుండెపోటు ప్రమాదాన్ని 40 శాతం వరకు తగ్గిస్తుందని తాజాగా వెలువడిన వైద్య నివేదికలు చెబుతున్నాయి.

మన శరీరం తిన్న ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చి శక్తిగా ఉపయోగిస్తుంది. కానీ ఈ ప్రక్రియలో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగితే, అది రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. దీని వల్ల రక్తనాళాల్లో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడి, కాలక్రమేణా గుండెపై దుష్ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా చక్కెర కలిగిన ఆహారాలు, తెల్లబియ్యం, బేకరీ పదార్థాలు లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.

భోజనం తర్వాత కేవలం 15 నిమిషాలు నడక ఈ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎందుకంటే నడకతో కండరాలు వెంటనే యాక్టివ్ అవుతాయి. రక్తంలో ఉన్న గ్లూకోజ్ కణాలకి త్వరగా చేరి శక్తిగా మారుతుంది. ఫలితంగా చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రక్తనాళాల్లో వాపు తగ్గుతుంది. శరీరానికి అవసరమైన ఇన్సులిన్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది.

ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, ఊబకాయాన్ని తగ్గిస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వైద్యులు చెబుతున్నట్లు, తిన్న తర్వాత నడక వల్ల హృదయ కండరాలు బలంగా మారుతాయి. దీని వలన గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు 40 శాతం వరకు తగ్గుతుంది. నడకతో శరీరానికి మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. కేలరీలు బర్న్ అవుతాయి. బరువు పెరగకుండా నియంత్రించవచ్చు. రాత్రి నిద్ర నాణ్యత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ కలిపి మన ఆరోగ్యానికి ఒక సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తాయి.

నిపుణులు చెబుతున్నట్లు, భోజనం చేసిన 10 నుండి 15 నిమిషాల తర్వాత మెల్లగా నడక మొదలుపెట్టడం ఉత్తమం. ఇది వేగంగా నడక కాకూడదు. సాంత్వనంగా, ఆహ్లాదకరంగా నడవడం శరీరానికి మేలు చేస్తుంది. వారానికి కనీసం ఐదు రోజులు ఇలా నడవడం గుండెకు బలాన్నిస్తుంది, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.

మొత్తానికి భోజనం తర్వాత కేవలం 15 నిమిషాల నడక, చిన్న అలవాటు కానీ గొప్ప ఫలితాలు. ఇది గుండెను బలంగా ఉంచుతుంది, రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతుంది, జీవితానికి చైతన్యాన్ని ఇస్తుంది. ఇకమీదట భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చోకండి… బయటికి వెళ్లి కొంచెం నడవండి.(గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)