తెరవెనుకాల ‘చిన్నమ్మ’ చక్రం తిప్పుతోందిట.! ఔను, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరీశ్వరి చక్రం తిప్పుతున్నారనీ, తెలుగుదేశం పార్టీకి ఇకముందు జనసేన పార్టీ అవసరమే వుండదనీ, తెలుగు తమ్ముళ్ళు బలంగా నమ్ముతున్నారు.
రాత్రికి రాత్రి పొలిటికల్ ఈక్వేషన్ మారిపోయినట్లే కనిపిస్తోంది.! బీజేపీ – టీడీపీ కలిసి వెళ్ళడం దాదాపు ఖాయమైపోయినట్లే. ఈ విషయమై జనసేన నేతలు ఒకింత గుస్సా అవుతున్నారు. అధినేత ప్రస్తుతానికైతే అందుబాటులో లేరు. దాంతో, ఈ మొత్తం వ్యవహారంపై ఎలా స్పందించాలో వారికి అర్థం కావడంలేదు.
వారాహి విజయ యాత్రతో జనసేన పార్టీకి పొలిటికల్ మైలేజ్ కొంత మేర లభించినా, టీడీపీ వ్యూహాల దెబ్బకి, జనసేన కుదేలయిపోయిందన్నది తెలుగు తమ్ముళ్ళ అంచనా. జనసేన పార్టీ 60కి పైగా సీట్లను పొత్తులో భాగంగా అడుగుతుండడం టీడీపీ అధినేత చంద్రబాబుకీ నచ్చడంలేదట.
మొదట్లో, 75 అడిగినా ఇచ్చేద్దాం.. అన్నట్లు వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఇప్పుడేమో, పాతిక – ముప్ఫయ్.. అంటూ కొత్త బేరాలాడుతున్నారట. దాంతో, జనసేనాని కూడా ఒకింత అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ మార్కు వెన్నుపోటు రాజకీయాల్ని జనసేనాని కాస్త ఆలస్యంగా అయినా గుర్తిస్తారని అనుకోవచ్చా.?
ఇదిలా వుంటే, బీజేపీకి రెండంకెల సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగానే వుందట. బీజేపీ కోరినన్ని ఎంపీ సీట్లనీ ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగానే వున్నారట. వైఎస్ జగన్ మీద చర్యలు కేంద్రం తీసుకునేలా, తమకు సాక్ష్యం చూపించాలని మాత్రమే చంద్రబాబు అడుగుతున్నారట.