Siddiqui : నటిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నటుడిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో ఎనిమిదేళ్ల జాప్యాన్ని బెయిల్ మంజూరు చేసేందుకు కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది.
సిద్ధిఖీ తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేయాలని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది.
ఈ నివేదిక నేపథ్యంలో నటి రేవతి సంపత్.. నటుడు సిద్ధిఖీపై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఓ సినిమాలో అవకాశం కోసం తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆయన డిమాండ్లను తిరస్కరించడంతో 2016లో తిరువనంతపురంలో ఓ హోటల్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. రేవతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో అరెస్ట్ చేయకుండా సిద్ధిఖీ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు.