సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో ఆంథాలజీ సినిమాగా తెరకెక్కిన సినిమా ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ ‘శ్రీరంగనీతులు’ సినిమాను మూడు కథలతో ఆంథాలజీ జానర్ లో తెరకెక్కించారు. ఓ కథలో.. శివ(సుహాస్) హైదరాబాద్ లోని ఓ బస్తి కుర్రాడు. సామ్ సంగ్ లో టెక్నిషియన్ గా వర్క్ చేస్తుంటాడు. బస్తీలో కుర్రాళ్ళ మధ్య గొప్పగా ఉండాలని ఆ ఏరియా రాజకీయ నాయకుడితో ఫొటో దిగి బతుకమ్మకు గ్రౌండ్ లో పెద్ద ఫ్లెక్సీ వేయిస్తాడు. తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీ ఉండదు. అది బస్తీలో తన ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు చించేశారని తెలుస్తుంది. మరో కథలో.. ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్) ప్రేమికులు. ఇందుకు తాను ప్రగ్నెంట్ అని అనుమానం వస్తుంది. అదే సమయంలో ఇంట్లో పెళ్లి సంబంధం ఓకే చేస్తారు. ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పడానికి భయపడుతుంది. మరో వైపు కార్తీక్(కార్తీక్ రత్నం) లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని మందు, సిగరెట్, గంజాయికి అలవాటు పడతాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతాడు. అనుకోకుండా కార్తీక్ తమ్ముడు మొక్కలతో ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందులో ఉన్న గంజాయి మొక్కలు పోలీసులకు కనపడి ఇంటికి వెళ్తే కార్తీక్ ఆ గంజాయి మొక్కలతో పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. మరి శివ మళ్ళీ ఫ్లెక్సీ వేయించాడా?శివ తన ఫ్లెక్సీ చింపేసిన ఆపోజిట్ గ్యాంగ్ ని ఏం చేసాడు? ఇందు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందా? తన ప్రగ్నెన్సీ కంఫర్మ్ అయిందా లేదా? కార్తీక్ పోలీసులకు దొరికాడా? కార్తీక్ మాములు మనిషిగా మళ్ళీ మారాడా లేదా అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ.. ఈ సినిమాలో మూడు కథలను ఒకేసారి చూపిస్తూ ఉంటారు. మనిషి ఉన్న దాంట్లో బతక్కుండా గొప్పలకు పోతాడని, లైఫ్ లో ధైర్యం ఉండాలనే కాన్సెప్ట్ ని చక్కగా చూపించారు. ఆంథాలజీ జానర్ లో ఈ సినిమాలో మూడు కథలు ఉన్నా ఏ కథకి సంబంధం ఉండదు. కానీ తనికెళ్ళ భరణి గుళ్లో జీవిత కథలు చెప్తూ అవి ఇవేనేమో అని భ్రమ కలిగించేలా రాసుకున్నారు కథాంశం. స్క్రీన్ ప్లే ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా రాసుకున్నారు. సినిమాలో కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. చివర్లో కొంచెం ఎమోషన్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
నటీనటులు.. వరుస హిట్స్ తో నటుడు సుహాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బస్తీ కుర్రాడిగా చాలా బాగా నటించాడు సుహాస్. రుహాణి శర్మ ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలంటే భయపడే సాధారణ అమ్మాయిలా మెప్పించింది. లవర్ బాయ్ లా విరాజ్ మరోసారి ఓకే అనిపించాడు. వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తిగా కార్తీక్ రత్నం కూడా మెప్పించాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు. వాళ్ల పాత్రలకు ఉన్న పరిధులు మేరకు చక్కటి నటనను కనబరిచి మంచి మార్కుల్ని కొట్టేశారు.
సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ మూడు కథలకు తగ్గట్టు చాలా చక్కగా చూపించారు. పాటలు ఫ ర్వాలేదనిపించింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా సెట్ అయింది. ఒక మంచి పాయింట్ తో మూడు కథలను ఎక్కడా కన్ఫ్యూజ్ రాకుండా తెరకెక్కించడంతో దర్శకుడు ప్రవీణ్ కుమార్ సక్సెస్ అయ్యాడు. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. చివరగా చెప్పాలంటే సినిమా చూస్తున్నంత సేపూ మూడు కథలతో ముచ్చటైన విహారం చేయొచ్చు!
రేటింగ్: 3