ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉంది. జగన్ పై ఒకవర్గం మీడియా చేస్తున్న కుట్రలపై జనాల్లో సానుభూతి. కరోనా వంటి కష్టకాలంలో కూడా సామాన్యుడి కష్టాన్ని అర్ధం చేసుకుంటూ అందించిన సంక్షేమం పట్ల ప్రజల్లో నమ్మకం ఉన్నాయనేది బలంగా వినిపిస్తున్న మాట! కానీ స్ట్రాటజీలో భాగంగా టీడీపీ – వారి అనుకూల మీడియా కలిపి ఆడిన ఆటలో జగన్ బలవుతున్నారు! ఇందులో బలయ్యేటంత సీన్ కి స్కోప్ లేకపోయినా.. జనాల్లోకి అలా పంపే ప్రక్రియలు వేగవంతంగా, వ్యూహాత్మకంగా జరుగుతున్నాయి. ఈ విషయాలు ఐ-పేక్ టీం కి అర్ధం కాకపోయినా – సలహాదారులకు స్పృసించకపోయినా… జగన్ మాత్రం గ్రహించాలి.
“జగన్ కి జనంలో వ్యతిరేకత మొదలైపోయింది”… అంటూ ఒక ప్రచారం మొదలుపెట్టేసింది ఆ వర్గం మీడియా. 151 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు జగన్ కి వెన్నుపోటు పొడిస్తే… మరో ఇద్దరు జగన్ మందలింపుని అపార్థంచేసుకుని వెళ్లిపోతే… రాబోయే ఎన్నికల్లో విజయం మాదే అని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తే… రాష్ట్రం మొత్తం పసుపు పవనాలు వీస్తున్నాయని పాంప్లెట్లు ముద్రించి పంచేస్తున్నారు.
ఇదే పసుపు స్ట్రాటజి… ఇందులో జగన్ & కో ఈజీగా పడిపోతున్నారు. దేవుడిని నమ్ముకున్నాను – ప్రజలను నమ్ముకున్నాను అని నిత్యం చెప్పే జగన్… ఈ ఎన్నికల్లో నేరుగా జనం పాల్గొనడం లేదని మరిస్తే ఎట్లా? ఇక దేవుడినే నమ్ముకున్నాను అని చెప్పే ఆయన… అనధికారిక సొత్తుపై ఆధారపడి 7 సీట్లకూ పోటీచేయడం ఎందుకు? దేవుడిచ్చిన బలం ప్రకారం… 6 సీట్లే కదా వచ్చేవి. ఇక్కడ నిజాయితీపోతే.. ఇంక బాబుతో వ్యత్యాసం ఎక్కడుంటుంది?
ఇదే క్రమంలో… వెన్నుపోటు దారుడితో కలిసి.. వెన్నుపోటు పొడవడానికి రెడీగా ఉన్నవారిలో ఆత్మప్రభోదానుసారం అనే అంశాన్ని వెతకడం ఎందుకు? ఫలితంగా… “జగన్ కు వ్యతిరేక పవనాలు విచేస్తున్నాయి” అనే వార్తకు – “సైకిల్ వేగం పెంచేసుకుని గంటకు వందకిలోమీటర్ల వేగంతో వెళ్లిపోతుందనే డబ్బాకు” ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? వ్యూహాత్మక ఎత్తుగడలు వెయ్యకపోయినా జనం ఓట్లేస్తారు కానీ… వ్యూహాత్మక తప్పిదాలు చేస్తే మాత్రం “జగన్ పనైపోయిందంటూ” పసుపు జనాలు ప్రసంగాలు చేసేస్తారు!
గ్రౌండ్ లెవెల్ లో జగన్ కు బలం ఉందనేది టీడీపీ అనుకూల మీడియా జర్నలిస్టులు సైతం ఆఫ్ ద రికార్డ్ చెప్పే మాట! “పేద – మధ్యతరగతి – దిగువ మధ్యతరగతి జనల్లో జగన్ ఇప్పటికీ హీరోనే సర్” అని వారు ప్రస్థావించిన సందర్భాలెన్నో. అయినా కూడా… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ తప్పు చేశారు! అనవసరమైన దానికి ఆశపడ్డారు – ఫలితంగా బంగబడ్డారు! అయినా ఇప్పటికీ మునిగిపోయిందేమీ లేదు. ఇకనైనా… “ఆత్మవిశ్వాసాన్ని ఆలానే ఉంచుకోవడంతోపాటు.. అత్యాశను అదుపు చేసుకోవడం – అతివిశ్వాసాన్ని తగ్గించుకోవడం చేస్తే సరిపోతుంది”. దానితోపాటు “ఎవరిని నమ్మాలి – ఎవరిని నమ్మకూడదనే విషయంలో కాస్త స్పృహ కలిగి ఉంటే చాలు.. తమబాధలు పైకి చెప్పుకోలేని ఎమ్మెల్యేలకు మరింత అందుబాటులో ఉంటే మరింత మేలు”.
పేర్ని నాని చెప్పినట్లు… “నాయకులు వస్తుంటారు – పోతుంటారు… కార్యకర్తల గుండెల్లో – జనం గుండెల్లో జగన్ పదిలం. జగన్ గుండెల్లో జనాలు – కార్యకర్తలు స్థిరం”… అనే విషయం జగన్ గ్రహించాలి. ఇప్పటికీ ఏమీ కాలేదు.. కాదు కూడా! నమ్మకం సడలకుండా – జనాలను మాత్రం నమ్ముకుంటూ – ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొనని ఎన్నికల ఫలితాల విషయంలో బెంగ వీడి ముందుకు పోవాలని కోరుకుంటూ… మీ అభిమాని!