ఔను, ముమ్మాటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రవు పదే పదే చెబుతుంటారు. దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, తెలంగాణ రాష్ట్రం తరఫున సాయమందించేందుకూ కేసీఆర్ ముందుకొస్తుంటారనుకోండి. అది వేరే సంగతి. కానీ, ఇప్పుడు తెలంగాణకే విపత్తు వచ్చిపడింది. కేంద్రం సాయం కోరడం అనేది ఏ రాష్ట్రమైనా చేసే పనే.. చేయాల్సిన పని కూడా. అది ఆయా రాష్ట్రాల హక్కు. కానీ, గ్రేటర్ హైద్రాబాద్ వరదల నేపథ్యంలో సాయం కోసం పారిశ్రామికవేత్తల నుంచీ, ప్రముఖుల నుంచీ విరాళాలు కోరడమేంటి.? ఇప్పుడు ఈ అంశం సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.
ధనిక రాష్ట్రం.. కరోనా కష్టం.!
తెలంగాణ ధనిక రాష్ట్రమే. కానీ, కరోనా నేపథ్యంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడింది. ఆ కరోనా ఎఫెక్ట్ లేకపోయి వుంటే, తెలంగాణ రాష్ట్రం ఇలా విరాళాల కోసం అడగాల్సిన పనే వచ్చేది కాదు. దానికి తోడు, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని హైద్రాబాద్‌కే కష్టమొచ్చిపడింది. చరిత్రలో కనీ వినీ ఎరుగని కష్టం, నష్టం.. ఈ వరదలతో సంభవించింది. అదే అసలు సమస్య. ఎంతమంది చనిపోయారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో మృతుల లెక్క బాహాటంగానే ప్రకటితమవుతుంటుంది. కానీ, ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా వుంది. వరదలు ముంచెత్తి.. బురదలో వాహనాలు కూరుకుపోయాయి. వాహనాల జాడే బురదలో దొరకడంలేదంటే, ఇక.. ప్రాణాలు కోల్పోయినవారి పరిస్థితేంటి.?
పోటెత్తుతున్న విరాళాలు..
సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరాళాల కోసం పిలుపునిచ్చాక విరాళాలు వచ్చిపడకుండా వుంటాయా.? ప్రముఖ కాంట్రాక్టు సంస్థలు పెద్దయెత్తున విరాళాలు ప్రకటిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా భారీయెత్తున విరాళం అందించింది. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలూ సాయం ప్రకటించిన విషయం విదితమే. సినీ ప్రముఖుల విరాళాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రబాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది ఇప్పటికే విరాళాలు ప్రకటించగా, మరికొందరు అదే పనిలో బిజీగా వున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలూ విరాళాల్ని అందిస్తున్నాయి.
ఈ పాపం ఎవరిది.?
గత పాలకుల మీదకు ‘పాపాన్ని’ నెట్టేయడం ఇప్పుడు తగని పని. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళవుతోంది.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆరేళ్ళుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. ఇది ప్రకృతి వైపరీత్యం. అదే సమయంలో మానవ తప్పిదమూ ఇంతటి పెను ఉత్పాతానికి కారణం. బాధితులకు సాయం అందిస్తే సరిపోదు.. ఇలాంటి విపత్తు ఇంకోసారి రాకుండా కఠిన నిర్ణయాలూ తీసుకోవాలి. లక్షలాది ఇళ్ళను తొలగించాల్సి వస్తుందన్నది తెలంగాణలోని కొందరు అధికార పార్టీ నేతలు చెబుతున్న మాట. రాజకీయ ఒత్తిళ్ళు రాకుండా అలాంటి పని అధికారులు చేస్తే.. అభినందించాల్సిందే.