అంచనాలను తలకిందులు చేసిన ‘రత్నం’.. కథాకథనలో కానరాని సీక్వెన్స్! దర్శకుడు హరి సినిమా అనగానే యాక్షన్ ప్రియులు ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ’సింగం’ సినిమాలతో ఆయన చూపించిన ప్రభావం అలాంటిది. విశాల్‌తో ఆయన చేసిన ‘భరణి’, ’పూజ’ సినిమాలు కూడా మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. కొంత విరామం తర్వత ఈ కలయికలో రూపుదిద్దుకున్న చిత్రమే.. ‘రత్నం’. ప్రేక్షకుల్లో మంచి అంచనాల్ని సృష్టించి… ప్రచార చిత్రాలతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా విడుదల అయ్యింది. తమిళనాడు, ఆంధ్ర సరిహద్దుల్లో సాగే కథ ఇది.
లక్ష్యం కోసం హత్యలు చేయడానికైనా వెనకాడని యువకుడు రత్నం (విశాల్). తాను మావయ్య అని పిలుచుకునే ఎమ్మెల్యే పన్నీర్‌స్వామి(సముద్రఖని) అండతో అప్పుడప్పుడూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ పనులు చక్కబెడుతుంటాడు. పోలీసులకి సగం సమస్యల్ని తగ్గిస్తుంటాడు. ఎమ్మెల్యేకి కుడి భుజంలాంటి రత్నం జీవితంలో ఎన్నో కల్లోలాలు. చిన్నప్పుడే తల్లి రంగనాయకి పోలీస్‌స్టేషన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. అతని బాల్యం కొంతకాలం జైల్లో గడుస్తుంది. అలాంటి రత్నం జీవితంలోకి మల్లిక (ప్రియభవానీ శంకర్) వచ్చాక కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. తమిళనాడులోని తిరుత్తణిని అడ్డాగా చేసుకుని ఎన్నెన్నో అరాచకాలకు పాల్పడుతుంటారు లింగం బ్రదర్స్ (మురళీశర్మ, హరీష్ పేరడి). వాళ్లే మల్లికపై హత్యాయత్నం చేయగా, రత్నం కాపాడతాడు. ఇంతకీ మల్లిక ఎవరు?ఆమెని లింగం బ్రదర్స్ చంపాలనుకోవడానికి కారణం ఏమిటి?మల్లికని కాపాడేందుకు రత్నం ఏం చేశాడు? అసలు రత్నం తల్లి రంగనాయకి పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్నదే కథ.
హరి సినిమా అంటేనే ఫక్తు మాస్ కథ, వీరోచితమైన పోరాటాలు, పరుగులు పెట్టే సన్నివేశాలే గుర్తొస్తాయి. ఇక విశాల్‌తో ఆయన జట్టు కట్టారంటే ఆ కథ, కథనాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు ముందే ఓ అంచనాకొస్తారు. ఆ ఇద్దరి కలయికలో ఇదివరకు వచ్చిన సినిమాలు అలాంటివి. అదే టెంప్లేట్‌తో సాగే కథతోనే… మాస్, యాక్షన్, సెంటిమెంట్ అంశాల్ని ఇంకాస్త అప్‌గ్రేడ్ చేస్తూ ఈ సినిమాని మలిచారు దర్శకుడు హరి. 90వ దశకంతో కథని మొదలుపెడుతూ, ఆరంభ సన్నివేశాలతో పాత్రల్ని పరిచయం చేశారు. ఆ పని పూర్తయ్యాక అసలు సిసలు హరి మార్క్ సన్నివేశాలు షురూ అవుతాయి. ఛేజింగ్‌లు, యాక్షన్ ఘట్టాలతో సన్నివేశాలు పరుగులు పెడతాయి. మల్లిక పాత్ర పరిచయం, ఆమెపై హత్యాయత్నంతో కథలో మలుపులు చోటు చేసుకుంటాయి.
లింగం బ్రదర్స్ అరాచకాలు, మెడికల్ కాలేజీ వ్యవహారమంతా సాదాసీదాగా పాత సినిమాల్నే గుర్తు చేసినా, విరామం తర్వాత కథలో చోటు చేసుకునే మలుపులు సినిమాని ప్రత్యేకంగా మార్చాయి. అయితే అవేవీ వాస్తవానికి దగ్గరగా అనిపించవు. సినిమాలో ఓ చోట కథానాయకుడితో సముద్రఖని ’కలలో కూడా ఊహించలేనివి నీ జీవితంలో జరిగాయి’ అంటాడు. ఆ మాటకి తగ్గట్టుగానే ఈ కథ ఎక్కడా సహజంగా అనిపించదు. ఏ పాత్రతోనూ సగటు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని పరిస్థితి. కథలో మలుపుల పేరిట బలవంతంగా సన్నివేశాలు రాసినట్టు అనిపిస్తుందే తప్ప, వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించదు. కథ ముగుస్తుందనుకున్న ప్రతిసారీ మరో అంకం మొదలవుతుంది. ఇదంతా సాగదీత వ్యవహారమే.
హీరో, హీరోయిన్ మధ్య బంధాన్ని ఆవిష్కరించిన తీరు కొత్తగానే ఉన్నా అవి ప్రేక్షకుడికి ఆమోదయోగ్యం అనిపించదు. ద్వితీయార్ధంలో హీరో తల్లి నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్, ఓ బ్రాహ్మణ కుటుంబంతో ముడిపెట్టిన విధానం సెంటిమెంట్ పరంగా ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కాలం చెల్లిన కథకి, బలవంతంగా కొన్ని మలుపుల్ని జోడించి తీసిన సినిమా ఇది. అసలు కథ కంటే యాక్షన్ హంగామానే ఎక్కువ.