ఆంధ్రప్రదేశ్ వెళ్లి చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ భుజాలపై చేతులు వేసి మా బాబును, పవన్ కళ్యాణ్ ను గెలిపించండి అని పిలుపు ఇవ్వొచ్చు. బీహార్ వెళ్లి “మా నితీష్ కుమార్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యండి” అని కన్ను గీటుతూ గొంతెత్తి రావొచ్చు. కానీ, మనకు మిత్రదేశమో, శత్రుదేశమో ఇంతవరకు ఎవరికీ అర్ధం కాని అమెరికా దేశం వెళ్లి “ట్రంప్ ను మళ్ళీ గెలిపించండి” అని అక్కడ బహిరంగంగా పిలుపు ఇస్తే దానిని అవివేకానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. అలాంటి అవివేకాన్ని ప్రదర్శించి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ నవ్వులపాలయ్యారు.
ఏదేశంలో ఎన్నికలు జరిగినా ఆ దేశపౌరులు ఎవరిని గెలిపించుకోవాలో నిర్ణయించుకుంటారు. అంతే కానీ, విదేశాల అధినేతలు వారిదేశంలో కాలూని ఫలానా వారిని గెలిపించండి అని ఎలుగెత్తి పిలుపివ్వడంలో ఏమైనా రాజనీతిజ్ఞత కనిపిస్తున్నదా? ఉదాహరణకు రేపు జో బైడెన్ ఇండియా వచ్చి ఈసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యండి అని బహిరంగంగా పిలుపిస్తే ఎలా ఉంటుంది? మనకు అరికాల్లో మండదూ? అలాంటి ఆత్మగౌరవమే అమెరికన్లకు కూడా ఉంటుందని మన ప్రధానికి ఎందుకు గ్రహింపుకు రాలేదో?
అమెరికా మొదటినుంచి కూడా ఎందుకో భారత్ కు వ్యతిరేకంగానే ఉంటుంది. వారికి పాకిస్తాన్ అంటే చాలా ఇష్టం. ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఎవరైనా ఇక్కడ మనలను పొగిడి ఆ తరువాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళగానే మనల్ని విమర్శిస్తూ ఆ దేశాన్ని పొగుడుతారు. గతంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మనకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమిటి? నిజానికి ఆయన ప్రవేశపెట్టిన వీసాల విధానం, ప్రదర్శించిన జాత్యహంకారం మనవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఉద్యోగాలు వదులుకుని స్వదేశం వెళ్లిపోవాలేమో అని మనవాళ్ళు మొదట్లో చాలా టెన్షన్ పడ్డారు. కరోనా సమయంలోనూ ట్రంప్ భారత్ మీద విషం కక్కారు. మందులు పంపించకపోతే యుద్ధం తప్పదు అన్నంతగా హెచ్చరికలు చేశారు. విదేశాలకు, విదేశీ నాయకులను గౌరవించే సంస్కృతి అమెరికాలో లేనేలేదు. అలాంటప్పుడు అమెరికాలో ట్రంప్ గెలిస్తే ఏమిటి? బైడెన్ గెలిస్తే ఏమిటి? ఎవరు గెలిచినా ఇండియా మీద ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు. అది ఫక్తు వ్యాపార దేశం.
ట్రంప్ గెలిచి మళ్ళీ అధ్యక్షుడు కావాలని భాజపా కార్యకర్తలు పూజలు, హోమాలు, యాగాలు చేశారట. మరి వారి పూజలు ఫలించలేదు. బైడెన్ మంచి ఆధిక్యతతో గెలిచాడు. బైడెన్ పాకిస్తాన్ పక్షపాతి అంటున్నారు. పాకిస్తాన్ కు ఆయన గతంలో 150 కోట్ల డాలర్ల ఆర్ధికసాయాన్ని అందే ఏర్పాటు చేశారట. అలాంటి వ్యక్తి శ్వేతసౌధాధీశుడు కాబోతున్నాడు. తమదేశం వచ్చి తన ప్రత్యర్థి మళ్ళీ అధ్యక్షుడు కావాలని పిలుపు ఇచ్చిన మోడీ పట్ల ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదలాడుతున్నది. గతం మర్చిపోయి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాడా లేక కక్షసాధింపుతో వ్యవహరిస్తాడా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఎపుడో నలభై మూడేళ్ళ క్రితమే నాటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ “మనకు చైనా కన్నా అమెరికాయే బద్ధశత్రువు” అని కుండబద్దలు కొట్టారు. ఆయన మాట ఎంతటి సత్యమో గత నలభై ఏళ్లుగా ఏ ఒక్క అధ్యక్షుడు కూడా భారతదేశ స్నేహితుడుగా వ్యవహరించక పోవడమే రుజువు చేస్తుంది. పైగా వారందరూ పాకిస్తాన్ కు అనుకూలురుగా వ్యవహరించారు.
“నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా” అన్న చీమ కథ గుర్తుంది కదా!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు