విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మంత్రి కొడాలి నాని నాయకత్వం వహిస్తారట. అయితే, అందుకాయన ఓ షరతు విధించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కీ. ఆ ఇద్దరూ తన వెంట వస్తే, స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి మంత్రిగారు నాయకత్వం వహిస్తారన్నదే ఆ షరతు. ఇదెక్కడి షరతు.? చంద్రబాబునీ, పవన్ కళ్యాణ్‌నీ మంత్రి కొడాలి నాని విమర్శించడం కొత్తేమీ కాదు. అలా విమర్శించడం వల్ల ఇటు టీడీపీకి, అటు జనసేనకు వచ్చే నష్టమేమీ వుండదు. కానీ, మంత్రి కొడాలి నాని తీరుతో అధికార వైసీపీకే చెడ్డపేరు వస్తోంది. దానిక్కారణం, మంత్రి కొడాలి విమర్శల్లో బూతులు ఎక్కువగా వుంటాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడటంలో దిట్ట ఆయన. అదేదో ఘనత అన్నట్టుగా మంత్రి కొడాలి భావిస్తుంటారేమో. నిజానికి, విశాఖ ఉక్కు వ్యవహారం.. రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించినది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికే ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వైసీపీకి చెందిన ముఖ్య నేతలు విశాఖ వేదికగా ఉద్యమిస్తున్నారు.
నిజానికి, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు విశాఖకు మద్దతుగా నిలవాల్సిన సందర్భమిది. కానీ, ‘అది విశాఖ కదా.? మాకేంటి సంబంధం.?’ అన్నట్టు వైసీపీకి చెందిన ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు భావిస్తున్నట్టుగా వుంది. లేకపోతే, కొడాలి నాని.. ఎవరో తన వెంట నడిస్తే, తాను ఉద్యమానికి నాయకత్వం వహిస్తాననడమేంటి.? మంత్రి కాబట్టి, ఆయన స్వయంగా.. తనంతట తానుగా ఉద్యమంలోకి వెళ్ళగలగాలి. కేంద్రాన్ని నిలదీయగలగాలి. కానీ, ఆ సాహసం కొడాలి నాని చెయ్యరుగాక చెయ్యరు. రాజకీయాల సంగతి పక్కన పెడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళారు, స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ సబబు కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి రిప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ విషయంలో వైసీపీ, జనసేనను అభినందించి వుండాలి. రాజకీయాల్లో ఇలాంటి చాణక్యమే అవసరం. అక్కడ విశాఖ వేదికగా, వైసీపీ నేతలు కొందరు రాజకీయాల్ని పక్కన పెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్నారు. ఈ విషయాన్ని కొడాలి మర్చిపోతే ఎలా.? రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోవచ్చు.. కానీ, కేంద్రాన్ని నిలదీయాల్సి వస్తే.. అన్ని పార్టీలూ ఒక్కతాటిపైకి రావాలి.