జనసేనలో “ఆంధ్రా అక్టోపస్” విశ్లేషణ టెన్షన్!

ఏపీ రాజకీయాల్లో టీడీపీ – జనసేన పొత్తు హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో తాజాగా చంద్రబాబు అమిత్ షా తో భేటీ అవ్వడం కూడా ఆసక్తిగా మారింది. దీంతో… పవన్ ఆశిస్తున్నట్లు, బాబు కోరుకుంటున్నట్లు టీడీపీ – జనసేన – బీజేపీ లు కలిసి పోటీ చేయబోతున్నాయా.. లేక, టీడీపీ – జనసేనలు మాత్రమే కలిసి నడవబోతున్నాయా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ సమయంలో తెరపైకి వచ్చారు ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్!

ఏపీలో రానున్న ఎన్నికలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటుగా జనసేనకు కూడా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల తర్వాత ఒక పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అయిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… టీడీపీ – జనసేనలు ఈ ఎన్నికలను మరింత సీరియస్ గా తీసుకున్నాయి. పైగా సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ పవన్ … టీడీపీ, బీజేపీని తిరిగి కలిపేందుకు ప్రతిపాదనలు చేసారు.

అయితే బీజేపీ సంగతి కాసేపు పక్కనపెడితే… ఏపీలో టీడీపీ – జనసేనలు కలిసి పోటీచేయడం మాత్రం కన్ ఫాం! అయితే ఈ సమయంలో ఉమ్మడి ఏపీ మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఒక విశ్లేషణ చేశారు. ఫలితంగా ఒక కీలకమైన పాయింట్ ను తెరపైకి తెచ్చారు. దీంతో… ఇప్పుడు ఉదాహరణలు చూపిస్తూ లగడపాటి చేసిన ఈ కొత్త విశ్లేషణ జనసేనలో కొత్త టెన్షన్ పుట్టిస్తుందని తెలుస్తుంది.

తాజాగా టీడీపీ – జనసేనల పొత్తుపై స్పందించారు లగడపాటి రాజగోపాల్. ఈ సందర్భంగా ఓటు షేరింగ్ గురించి తన అభిప్రాయం స్పష్టం చేసారు. “పొత్తుల సమయంలో సాధారణంగా చిన్న పార్టీలు తమ ఓట్లను పెద్ద పార్టీలకు సులభంగా బదిలీ చేస్తాయని విశ్లేషించిన ఆయన… అదే సమయంలో పెద్ద పార్టీల నుంచి చిన్న పార్టీలకు ఓట్ బదిలీ మాత్రం కష్టం” అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇందుకు ఒక ఉదాహరణ కూడా ఆయన తెరపైకి తెచ్చారు.

గతంలో కాంగ్రెస్ – కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు వ్యవహారంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైందని లగడపాటి రాజగోపాల్ గుర్తు చేస్తున్నారు. అంటే… పొత్తుతో ముందుకు వెళ్తే… జనసేన ఓట్లు మొత్తం టీడీపీకి నిరభ్యంతరంగా పడిపోతాయి, ఫలితంగా టీడీపీ నేతలు ఆల్ మోస్ట్ గెలుస్తారు… కానీ, టీడీపీ ఓట్లు మాత్రం పూర్తిగా జనసేనకు బదిలీ అవుతాయని ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు రాజగోపాల్!

దీంతో కొత్త కొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ఆ దిశగా ఆలోచించినా ఆశ్చర్యం లేదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. అయితే తాజాగా లగడపాటి వ్యాఖ్యలు మాత్రం జనసేన లో కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్నాయని అంటున్నారు. మరి లగడపాటి చెప్పిన ఈ విశ్లేషణ ఏమేరకు కరెక్ట్ అనేది తెలియాలంటే… వచ్చే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ ఆగాల్సిందే!