తెలంగాణలో టీఆర్ఎస్ అన్ని అంశాల్లోనూ ఇతర పార్టీల కంటే చాలా ముందు ఉందనేది నిర్వివాదాంశం. ఏ ఎన్నికలు తీసుకున్నా ఆ పార్టీదే పైచేయి. కేసీఆర్ చరీష్మా ముందు ఎవ్వరూ నిలబడలేకున్నారు. తండ్రికి కేటీఆర్ దూకుడు తోడవడంతో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేకుండా పోయింది. అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్ ఇలా అన్ని ఎన్నికల్లో తెరాస పార్టీదే హవా. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ మీద పైచేయి సాదించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా అవుతూనే వచ్చాయి.
అయినా ప్రత్యర్థులు పట్టు వీడటం లేదు. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీకి గిఫ్ట్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. పరిస్థితులు కూడ వారికి కొంచెం అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కేసీఆర్ సైతం ఇదే విషయమై కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి సన్నద్దత మరింత పకడ్బందీగా ఉండాలని ఆదేశించారట.
కాంగ్రెస్, బీజేపీలకు మంచి కాలం :
మొదటిసారి కేసీఆర్ సర్కార్ కొలువుదీరినప్పుడు కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో మరీ దారుణమైన స్థితిలో ఉన్నాయి. అందుకే ఏ దశలోనూ కేసీఆర్ ముందు నిలబడలేకపోయారు. అధికారం చెజెక్కించుకున్న ఉత్సాహంలోనే తెరాస బల్దియా ఎన్నికల్లోకి దిగింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 99 కార్పొరేషన్ స్థానాలను తెరాస సొంతం చేసుకోగా ఎంఏఐఎం 44 సీట్లతో ప్రాభవం చాటుకుంది. ఇక అంతకు ముందు 52 సీట్లు కలిగి ఉన్న కాంగ్రెస్ కేవలం 2, 45 స్థానాలు ఉన్న టీడీపీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోగా బీజేపీ అప్పుడూ ఇప్పుడూ 4 సీట్లకే పరిమితమైంది. ఇలా మొదటి ప్రయత్నంలోనే ప్రత్యర్థులను చిత్తు చిత్తు చేసింది గులాబీ పార్టీ.
కానీ ఈసారి అలాంటి సిట్యుయేషన్ లేదు. హైదరాబాద్లో పరిస్థితులు తెరాసకు పూర్తి అనుకూలంగా లేవు. కరోనాను ఎదుర్కోవడంలో కేసీఆర్ అలసత్వం చూపారనే భావన గ్రేటర్ ప్రజల్లో ఉంది. ఇప్పటికీ హైకోర్టుకు సరైన సమాధానాలు ఇవ్వకుండా, ఎక్కువ టెస్టులు చేయకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టలేకపోవడం లాంటి అంశాల్లో ప్రజలు డిస్టర్బ్ అయ్యున్నారు. బహిరంగంగానే ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కరోనాను అదుపుచేయడంలో కేసీఆర్ వైఫల్యం చెందారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేద్ద ప్రచారం చేశాయి. జనంలో కూడా ప్రభుత్వం ముందుగానే కళ్లు తెరిచి ఉంటే బాగుండేదని అంటున్నారు. వెరసి నగరంలో గులాబీ పార్టీకి గత దఫాలో ఉన్నంత క్రేజ్ అయితే లేదు. దీన్ని క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి.
తొక్కేయడమే అంటున్న కేటీఆర్ :
ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంంనే సంగతి కేసీఆర్ కు తెలుసు. ఆయన కూడ ప్రమాదాన్ని పసిగట్టారు. అందుకే ఈసారి ఎన్నికల బాద్యతను కేటీఆర్ చేతిలోనే పెట్టారు. కేటీఆర్ క్రితంసారి 99 స్థానాలు గెలిస్తే ఈసారి 100 స్థానాలు కైవసం చేసుకుని సెంచరీ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే ఎన్నికలకు ఖచ్చితమైన, నిర్మొహమాటమైన వ్యూహం అమలుచేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సీట్ల కేటాయింపులో పార్టీ గెలుపును డిసైడ్ చేయాలని అనుకుంటున్నారు.
ముందుగా సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో ఎవరి మీదైనా వ్యతిరేకత ఉందా, ఎవరెవరి పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది అంచనా వేయడానికి ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసుకున్నారట. వీరు సిటీంగ్ల పనితీరు, గుడ్ విల్, కొత్తగా టికెట్ ఆశిస్తున్న వారెవరు వారి బలాబలాలు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు కొందరు అవినీతికి పాల్పడ్డారని, స్థానిక బిల్డర్లు, వ్యాపారుల వద్ద వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి.
అలాంటి వారందరికీ నిర్మొహమాటంగా ఈసారి టికెట్ ఇచ్చేది లేదని, ఆరోపణలు వచ్చినవారు సీనియర్లు అయినా రెండు మూడు సార్లు గెలిచి ఉన్నా ఉపేక్షించేది లేదని అంటున్నారట. దీంతో సిట్టింగ్ కార్పొరేటర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. మరోవైపు ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను తగ్గించడం కోసం కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. కాళ్ళకు బలపం కట్టుకుని నగరం మొత్తం తిరుగుతూ రకాల రకాల అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేస్తున్నారు. మొత్తం మీద 100 కొట్టడానికి కేటీఆర్ మంచి యాక్షన్ ప్లాన్ తయారుచేశారట.