జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఒంటరి పోరుకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బీజేపీ ఆయనకు దూరమవబోతోందిట. తెలుగుదేశం పార్టీ ఆయనకు దగ్గరయ్యే అవకాశాలూ సన్నగిల్లుతున్నాయి. ఎందుకీ పరిస్థితి.?
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేయడం వైపే మొగ్గు చూపక తప్పేలా లేదని తెలుస్తోంది. 85 నుంచి 90 శాతం జనసైనికులు, జనసేన మద్దతుదారులు, తమ పార్టీ పొత్తుల్లేకుండానే ఎన్నికల బరిలోకి దిగాలని కోరుకుంటున్నారు.
రీమేక్ సినిమా – ఒరిజినల్ సినిమా పోలికనీ, జనసేన మద్దతుదారులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. రీమేక్ సినిమాతో హిట్టు కొట్టి ఏం లాభం.? అదే, ఒరిజినల్ సినిమాతో ఫ్లాప్ చవిచూడాల్సి వచ్చినా.. ఇబ్బందేమీ లేదు.. అన్నది అభిమానుల వాదన. చిత్రమేంటంటే, జనసేన మద్దతుదారులుగా మారుతున్న, సాధారణ ఓటర్లదీ ఇదే సూచనగా కనిపిస్తోంది.
ఎటూ, బీజేపీ – టీడీపీ జత కట్టే అవకాశాలున్నాయ్.. ఆ రెండూ కలిసి జనసేనను డంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో జనసేనాని కాస్తంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే, 2024 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టడానికి అవకాశం వుంది. బంపర్ విక్టరీ అంటే.. అధికారం దక్కుతుందని కాదు.. ప్రతిపక్షంలో కూర్చునేందుకు మార్గం సుగమం అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
చాలాకాలంగా వైసీపీ, జనసేన మీద సెటైర్లేస్తున్నది కూడా, టీడీపీతో జనసేన అంట కాగుతుండడం వల్లనే. అదే, టీడీపీకి జనసేన దూరంగా వుంటే, వైసీపీ నుంచి జనసేన మీదకు మరీ అంతగా విమర్శల తీవ్రత వుండకపోవచ్చు. ఏమో, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎలాగైనా మారిపోవచ్చు. అదే రాజకీయమంటే.!