మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సునీతా రెడ్డి పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన శుక్రవారం సునీత పిటిషన్ పై విచారించిన సీజేఐ ధర్మాసనం.. అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, విచారణను సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టే వరకు అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… తాజాగా డాక్టర్ సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ ఉత్కంఠ నెలకొంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం వుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో విచారణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎవ్వరూ ఊహించని విధంగా కీలక ప్రకటన చేశారు. “సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు నంబర్-1లో విచారణ జరగాల్సి ఉంది.. అయితే ఐదుగురు జడ్జిలు కరోనాబారిన పడ్డారు.. దీంతో విచారణ నిర్వహించే పరిస్థితి లేదు” అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలిపారు. కావున డాక్టర్ సునీత పిటిషన్ పై విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసినట్టు చీఫ్ జస్టిస్ తెలిపారు.
ఫలితంగా… వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పై స్టే అంత వరకూ కొనసాగనుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో డాక్టర్ సునీత తీవ్ర నిరాశకు లోనయ్యారని తెలుస్తుంది.
ఇదిలా వుండగా సుప్రీంకోర్టులో కరోనా ఆంక్షలు విధించారు. దీంతో… కరోనా బారిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పడడంతో విచారణ ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు.