ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్… పార్లమెంట్ కొత్త భవనం ప్రత్యేకతలివే!

పార్లమెంట్‌ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ గెజిట్‌ విడుదల చేసింది కేంద్రం. కొత్తగా నిర్మించిన భవనమే ఇక నుంచి ఇండియన్ పార్లమెంట్‌ అని ఆ గెజిట్ లో పేర్కొంది. దీంతో… నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలోనే జరుగుతున్నాయి. ఈ సమయంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!

సెంట్రల్ విస్ట్రా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ కొత్త భవనానికి 2020 డిశెంబర్ 10న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ భవనాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారు. ఇదే సమయంలో భారతీయ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఈ నిర్మాణం సాగింది. ఈ క్రమంలో… ఈ నూతన భవనాన్ని ఈ ఏడాది మే 28న ప్రధాని మోడీ ప్రారంభించారు.

నిర్మాణంలో ప్రత్యేకతలు:

ఈ నూతన పార్లమెంట్ భవనం త్రిభుజాకారంలో ఉంటుంది. ఇందులో నాలుగు అంతస్తులు ఉంటాయి. దీన్ని సుమారు 150 ఏళ్లపాటు మనగలిగేలా తీర్చి దిద్దారు. 1,272 మంది ఒకేసారి కూర్చునేలా ఈ నూతన సమావేశ మందిరం ఉంటుంది. సెంట్రల్ విస్తాలో పార్లమెంట్ ఉభయ సభలతోపాటు ప్రధాని కార్యాలయం, ఆయన నివాసంతోపాటు ఉపరాష్ట్రపతి నివాసం, కేంద్ర సచివాలయం ఉంటాయి.

ఈ నిర్మాణంలో లోక్ సభ ప్రాంగణము జాతీయ పక్షి నెమలి ఆకారంలో కనిపిస్తుండగా.. రాజ్యసభ ప్రాంగణము జాతీయ పుష్పం తామార పువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ నూతన పార్లమెంట్ భవనానికి మూడు ప్రధాన ద్వారాలు ఉంటాయి. దీనికి జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలుగా నామకరణం చేశారు.

ఇలా ఎన్నో ప్రత్యేకతలతో సుమారు 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన భవనానికి 970 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది.

దేశం నలుమూలల నుంచీ…:

ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్ స్పూర్తి పరిడవిల్లేలా దేశంలోని ప్రతీ రాష్ట్రం నుంచి ఏదో ఒక రూపంలో స్థానం కల్పించేలా వస్తువులు తెప్పించారు. ఇందులో భాగంగా యూపీలోని మీర్జాపూర్ నుంచి ప్రత్యేక తివాచీలు, త్రిపుర వెదురుతో చేసిన గచ్చు, రాజస్థాన్ లో రూపుదిద్దుకున్న శిలాకృతులు, మహారాష్ట్ర నుంచి తెచ్చిన టేకు తెప్పించారు.

ఇదే సమయంలో… రాజస్థాన్ లోని సర్ మధుర నుంచి తెచ్చిన ఎర్ర చలువ రాయిని ఇందులో పొందుపరిచారు. ఇదే రాష్ట్రం నుంచి తెల్ల చలువ రాయి, ఉదయ పూర్ నుంచి కేసరియా ఆకుపచ్చ రాయి, అజ్ మేర్ సమీపంలోని లఖా నుంచి ఎర్ర గ్రానైట్, ముంబై నుంచి ఫర్నిచర్ ను రప్పించారు.

ప్రత్యేక ఆకర్షణగా బంగారు రాజదండం:

ఈ నూతన పార్లమెంట్ భవనంలో ఎన్నో ప్రత్యేకతలుండగా… వాటన్నింటిలోనూ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది సెంగోల్ రాజదండం. నూతన పార్లమెంట్ భవనంలో లోక్ సభలోని సభాపతి కుర్చీపక్కన ఏర్పాటుచేసిన సెంగోల్ అనే ఈ బంగారు రాజదండానికి చరిత్రలో చాలా ప్రత్యేకత ఉంది.

స్వాతంత్రం అనంతరం బ్రిటిష్ వారికి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి ఇది సాఖ్స్యంగా నిలుస్తుంది. బ్రిటీష్ ఇండియా చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్.. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు స్వాతంత్రానికి ముందు దీనిని అప్పగించారు.

నెహ్రూ కోరిక మేరకు మద్రాసులోని స్వర్ణకారుడి చేత ప్రత్యేకంగా ఈ రాజదండాన్ని తయారు చేయించారు. ఐదు అడుగుల పొడవున్న ఈ రాజదండం పై భాగంలో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులోని మఠానికి చెందిన పీఠాధిపతి ఒకరు ఈ రాజదండాన్ని మౌంట్ బాటెన్ కు అందించగా.. తిరిగి తీసుకుని, గంగాజలంతో శుద్ధిచేసి నెహ్రూ దగ్గరకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.

అర్ధరాత్రి స్వతంత్ర ప్రకటనకు 15 నిమిషాల ముందు ఈ రాజదండాన్ని పీఠాధిపతి ఒకరు జవహర్ లాల్ నెహ్రూకు అందజేశారు. ఇలా స్వాతంత్రానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఈ రాజదండం నాటినుంచీ అలహాబాద్ మ్యూజియంలో ఉండేది.

ఈ క్రమంలో నూతన పార్లమెంట్ నిర్మాణం అనంతరం ఈ రాజదండాన్ని లోక్ సభ సభపతి కుర్చీ పక్కన అమర్చారు. ఈ భవనం ప్రారంభోత్సవం రోజున మోడీ ప్రత్యేకంగా పూజలు చేసి దీన్ని అక్కడ ఏర్పాటు చేశారు.

గ్యాలరీలో ప్రత్యేకంగా పౌకాల్డ్ పెండ్యులం:

ఈ నూతన పార్లమెంట్ భవనంలోని గ్యాలరీలో ఏర్పాటు చేసిన పౌకాల్డ్ పెండ్యులం అనే వస్తువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్సెస్ మ్యూజియం ద్వారా పార్లమెంట్ గ్యాలరీలో దీన్ని ఏర్పాటు చేశారు. భూభ్రమణాన్ని సూచించే ఈ పౌకాల్డ్ పెండ్యులంకి ఫ్రెంచ్ శాస్త్రవేత్త లియెన్ పౌకాల్డ్ పేరు మీద 19వ శతాబ్దంలో నామకరణం చేశారు.

లియోన్ పౌకాల్డ్ 1851వ సంవత్సరంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దీంతో… భుభ్రమణం ఎలా ఉంటుంది అని చెప్పేటందుకు చేసిన తొలి ప్రయోగంగా దీన్ని చెబుతారు. దీంతో… విజ్ఞానానికి ప్రతీకగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే దీన్ని పార్లమెంట్ గ్యాలరీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఫౌకాల్ట్ పెండ్యులం అనేది భూభ్రమణాన్ని ప్రదర్శించే ఒక ప్రయోగాత్మక శాస్త్రీయ పరికరం. భూమి యొక్క భ్రమణాన్ని మనం అనుభూతి చెందలేము కాబట్టి పరికరం గంటకు దాదాపు 1,670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నందున ఖగోళ సంఘటన దృశ్యమాన సాక్ష్యాలను అందిస్తుంది.