మరీ ఇంత అసహనమా? 

YS Jagan Supreme Court
 ప్రభుత్వ న్యాయవాది, డిఫెన్స్ న్యాయవాది భయంకరంగా వాదనలు వినిపిస్తుంటారు.  వేళ్ళు చూపించుకుంటారు…పెద్ద గొంతుతో అరుస్తుంటారు…ఒక్కోసారి కోపంలో కాగితాలు విసిరేస్తుంటారు…కానీ   న్యాయపీఠం మీద ఆశీనులైన న్యాయమూర్తి ఎలాంటి ఆవేశానికి లోను కారు.  నిశ్శబ్దంగా వారి వాదనలు వింటారు.  అవసరమైతే మధ్యమధ్యలో ప్రశ్నలు వేస్తుంటారు.  అంతే తప్ప ఆయన మాత్రం స్వరం పెంచడం సాధారణంగా జరగదు.  కానీ, మొన్న హైకోర్టులో ధర్మాసనాన్ని అధిష్టించిన గౌరవ న్యాయమూర్తులు తమ సహనం కోల్పోయి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలను చెయ్యడం చూపరులను దిగ్భ్రాంతికి గురి చేసింది.  

First Time Supreme Court Warns Ap High Court Big Good News To Ys Jagan

 
పార్లమెంట్ ను వెళ్లి కోర్టును మూసెయ్యమని చెప్పండి
రూల్ అఫ్ లా అమలులో ఉన్నదా? 
ఇతర అధికారాలను ఉపయోగించాల్సివస్తుంది 
న్యాయస్థానాలను కించపరిస్తే సివిల్ వార్ వస్తుంది 
 
అంటూ చేసిన కటువైన వ్యాఖ్యలు గౌరవ న్యాయస్థానము చెయ్యాల్సినవేనా?   ఎందుకంత అసహనం?  నిజం చెప్పాలంటే న్యాయవ్యవస్థ అనేది రాజ్యాంగంలోని ఒక విభాగమే తప్ప సుప్రీమ్ కాదు.  పాలనకు అవసరమైన మూడు స్తంభాల్లో ఒకటే తప్ప అదే మూలస్థంభం కాదు.  న్యాయవస్థకు శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు న్యాయవ్యవస్థకు సబార్డినేట్స్ కావు.  ఎవరి అధికారాలు వారికి ఉంటాయి.  

ఇతర వ్యవస్థలను కించపరచడం దేనికి?

ఇక్కడ న్యాయవ్యవస్థ ప్రధాన అభియోగం లేదా న్యాయమూర్తులను బాధించిన అంశం ఏమిటంటే సోషల్ మీడియాలో తమ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ప్రభుత్వం శిక్షించలేదనేది.  నిజమే…న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరక వ్యాఖ్యలు, దూషణలు చెయ్యడం సహించరానిదే.  న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడాల్సిందే.  అయితే ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రికి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతో కష్టపడి, రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా విద్యను ఆర్జించి, దేశస్థాయిలో ర్యాంకులు తెచ్చుకుని సివిల్ సర్వీసుల్లో చేరే ఉద్యోగులకు గౌరవం ఉండదా?  వారి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం లేదా?  వారిమీద న్యాయస్థానాలు అనుచిత వ్యాఖ్యలు చేయవచ్చునా?  

అభిప్రాయాలు తెలపడం కూడా నేరమేనా? 

అసలిక్కడ రూల్ అఫ్ లా అమలు జరగడం లేదని న్యాయస్థానం ఏ అంశాల ప్రాతిపదికగా నిర్ణయించిందో తెలియదు.  ఈదేశంలో రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, ముఖ్యమంత్రులు అందరినీ విమర్శించే హక్కు ప్రజాస్వామ్యం ప్రతి పౌరుడికీ ఇచ్చింది.  వారు తప్పులు చేస్తున్నప్పుడు ఎత్తిచూపే స్వతంత్రం, అవసరమైతే ప్రభుత్వాలను మార్చుకునే హక్కు కూడా దేశప్రజలకు రాజ్యాంగం కల్పించింది.  కానీ, న్యాయమూర్తులను విమర్శించరాదని, వారు ఎలాంటి తీర్పులు ఇచ్చినా నోళ్లు మూసుకోవాల్సిందే అని రాజ్యంగంలో  నిబంధన ఉన్నదేమో నాకు అవగాహన లేదు.  పదేళ్ల క్రితం వరకు సమాచారం తెలియాలంటే కేవలం పత్రికలు, ఛానెల్స్ మాత్రమే దిక్కు.  సామాన్యపౌరుల వాక్కుకు వాటిలో స్థానం దొరకదు.  అందువలన న్యాయవ్యవస్థ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రపంచానికి తెలియదు.  ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కారణంగా  బాధ్యత కలిగిన పౌరులు న్యాయవ్యవస్థ మీద ఒకటి రెండు వాక్యాలలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.  అలా అభిప్రాయాలను వ్యక్తం చెయ్యడం నేరం అయితే కొన్ని కోట్లమందిని జైల్లో పడేయాల్సివస్తుంది.  అది సాధ్యం అవుతుందా?  తమ పనితీరు పట్ల ప్రజలు అలా అభిప్రాయపడుతున్నారేమో అనుకుని తమవైపు లోపాలు సవరించుకుంటే తప్పేంటి?  న్యాయవ్యవస్థకు చెల్లించే వేతనాలు, అందిస్తున్న సౌకర్యాలు అన్నీ ప్రజలు కట్టే పన్నుల్లోనించి ఇస్తున్నవే.  అలాంటపుడు ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పడం దోషమా?  అది దోషమైతే ఇటీవల చైనా యాప్స్ ను నిషేధించినట్లు  సోషల్ మీడియాను కూడా  నిషేధిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.  

రూల్ అఫ్ లా  అమలు ఒక్కరి బాధ్యతేనా? 

ఇక రూల్ అఫ్ లా అమలు కావడం లేదని గౌరవ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు విస్తుగొలిపేవే.  ఒక భయంకరమైన అవినీతి మీద, కోవిద్ రోగుల మరణానికి కారకుడైన వైద్యుడిమీద, మరొక న్యాయవాది మీద చట్టబద్ధంగా ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే, దాన్ని అడ్డుకోవడం చట్టబద్ధ పాలన అవుతుందా?  దళితుడికి శిరోముండనం చేసిన రాజకీయనాకుడిపై విచారణ వద్దని ఆదేశించడం చట్టబద్ధపాలన అవుతుందా?  ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను నిరోధించడం చట్టబద్ధ పాలన అవుతుందా?   ప్రభుత్వాన్ని తన పని తాను చెయ్యనిచ్చి, ఆ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉండి, నేరం రుజువు కాకపొతే వాటిని కొట్టెయ్యవచ్చు కానీ, అసలు దర్యాప్తే జరగరాదని న్యాయస్థానం ఆదేశించడం ఏ విధంగా చట్టబద్ధపాలన అవుతుందో సామాన్యుడికి అర్ధం కాదు.  ఈ విషయంలో సుప్రీమ్ కోర్ట్ కూడా హైకోర్టును తప్పు పట్టింది కదా?  మరి సుప్రీమ్ కోర్ట్ మీద ఎలాంటి చర్య తీసుకుంటారు?  

ఏమిటీ బెదిరింపులు? 

ఇక తమకు గల ఇతర అధికారాలను ఉపయోగిస్తామని న్యాయస్థానం హెచ్చరించడం  చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది.  ఏమిటా ఇతర అధికారాలు?  ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉందా?  అలా ఉందీ అనుకుంటే మళ్ళీ ఎన్నికలు జరిగి మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే అపుడు ఏమి చేస్తారు?  ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా నిషేధిస్తే మళ్ళీ వచ్చే మరొక ముఖ్యమంత్రి కూడా ఇదేవిధంగా చేస్తే కోర్టు ఏమి చేస్తుంది?  ప్రభుత్వానికి ఇతర అధికారాలు ఏమీ ఉండవా?  ఎమర్జెన్సీ లో న్యాయవ్యవస్థకు సంకెళ్లు వేసినపుడు న్యాయవ్యవస్థ ఏమి చెయ్యగలిగింది?  సీనియర్లను పక్కనబెట్టి జూనియర్ కు ప్రధాన న్యాయమూర్తి పదవి ఇచ్చినపుడు సుప్రీమ్ కోర్ట్ ఏమి చేసింది?  ఇక అంతర్యుద్ధం వస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించడం తీవ్రాతితీవ్రమైన వ్యాఖ్యలు.  అంతర్యుద్ధం ఎలాంటి సమయంలో వస్తుందో గౌరవ న్యాయస్థానానికి తెలియదని అనుకోగలమా?  న్యాయమూర్తులపై దూషణలు చేసినవారిపై చర్యలు తీసుకోవడం ఆలస్యమైతే అంతర్యుద్ధం వస్తుందా?  హైకోర్టుకు తాళం వెయ్యడని అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చెయ్యడం ఆక్షేపణీయం.  హైకోర్టుకు తాళం వేసే అధికారం ప్రభుత్వాలకే ఉంటే అసలీ దేశంలో న్యాయవ్యవస్థ మొత్తం మూతపడి ఉండేది.  అందుకు బదులుగా న్యాయమూర్తులే హైకోర్టుకు తాళం వేసి “మేము ఈ రాష్ట్రంలో పనిచెయ్యము.  న్యాయమూర్తులకు రక్షణ లేదు  ఇక్కడ చట్టబద్ధ పాలన లేదు”  అని సుప్రీమ్ కోర్టుకు, పార్లమెంట్ కు తెలియజేస్తే అప్పుడు ఏమి జరుగుతుందో చూడొచ్చు.    

న్యాయస్థానాలను గౌరవించాల్సిందే 

ఒకటి మాత్రం నిజం.  సామాన్యులకు శాసనవ్యవస్థ, అధికార వ్యవస్థ అన్యాయం చేసినపుడు వారికి న్యాయం అందించేది న్యాయవ్యవస్థ మాత్రమే.  అందువలన న్యాయవ్యవస్థ అందరికన్నా సంయమనంతో వ్యవహరించాలి.   గౌరవ న్యాయస్థానం తమ ఆగ్రహావేశాలను నిగ్రహించుకుని తమను ఆశ్రయించినవారికి న్యాయం చెయ్యాలి.  ప్రభుత్వాలను శిక్షించే బాధ్యతను ప్రజలకు వదిలెయ్యండి.    మూడు రాజ్యాంగ వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి ప్రజల శ్రేయస్సుకోసం పాటుపడాలి.   ప్రభుత్వం  కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి.  న్యాయమూర్తుల వ్యాఖ్యలను గౌరవించాలి.  తప్పులేమైనా తమలో ఉంటే సరిదిద్దుకోవాలి.  కోర్ట్ ఇచ్చిన తీర్పులు సమంజసంగా లేవనుకుంటే సుప్రీం కోర్టు తలుపు తట్టాలి.  అంతే తప్ప న్యాయమూర్తులమీద అనుచిత వ్యాఖ్యలను చెయ్యరాదు.  నాకు తెలిసి ప్రభుత్వానికి సోషల్ మీడియాలో ఎవరో కొందరు చేసే అజ్ఞానుల వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధమూ ఉండదు.  ఇది కొందరి నోటి దురద మాత్రమే.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు