శిష్యుడు కు బంగారు నందిని అందించిన విక్టరీ

శిష్యుడు కు బంగారు నందిని అందించిన విక్టరీ

వీరమాచినేని మధుసూదనరావు గారికి తెలుగు సినిమా రంగంలో ఘనమైన చరిత్ర వుంది . ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు . ఆయన్ని విక్టరీ మధుసూదన రావు అని పిలిచేవారు . 1959 నుంచి 1989 వరకు 30 సంవత్సరాలపాటు ఆయన ముద్ర తెలుగు సినిమా మీద వుంది . ఆయన హస్తవాసి మంచిది అనే పేరు కూడా తెలుగు సినిమా రంగంలో వుంది . అలాగే మధుసూదన రావు గారికి దుర్వాసుడు అనే పేరు కొద్ద వుంది . ఆయన సెట్లో వున్నప్పుడు ఏర్పాట్లలో ఏదైనా తేడా వచ్చిందంటే చాలు ఎదురుగా ఏది ఉంటే అది ముక్కలైపోవలసిందే . దర్శకత్వంలో రాజీపడటం అనేది మధుసూదన్ రావు గారికి తెలియదు .

మధుసూదన రావు గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో , సతి తులసి , పదండి ముందుకు, టాక్సీ రాముడు ,రక్త సంబంధం , ఆరాధన , లక్షాధికారి ,ఆత్మ బలం , గుడి గంటలు , జమీందారు , అంతస్తులు , మంచి కుటుంబం , ఆస్తిపరులు , వీరాభిమన్యు, అదృష్టవంతులు,ఆత్మీయులు,మనుషులు మారాలి,అమాయకురాలు , కల్యాణ మండపం , ప్రజా నాయకుడు , మంచి రోజులు వచ్చాయి , భక్త తుకారాం , కృష్ణవేణి, ప్రేమలు పెళ్లిళ్లు , చక్రధారి , ఎదురీత , మల్లెపూవు మొదలైన సినిమాలు ఆయన సృజనాత్మక ప్రతిభను చాటుతాయి.

ప్రజా నాట్యమండలి నుంచి వచ్చిన మధుసూదన రావులో అభ్యుదయ భావాలు ఉండేవి .”పదండి ముందుకు ” ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఓ చిన్న పాత్రలో మొదటిసారి తెరపై కనిపించారు . “మనుషులు మారాలి” , “కల్యాణ మండపం” , “ప్రజా నాయకుడు” ,”మంచి రోజులు వచ్చాయి” , “ప్రేమలు పెళ్లిళ్లు” , “అంగడి బొమ్మ” “ఆత్మకథ”.చిత్రాలను పేర్కొనవచ్చు .

వీరమాచనేని మధుసూదన రావు గారు 1959లో “సతి తులసి” సినిమాతో దర్శకులయ్యారు . 1960లో జగపతి రాజేంద్ర ప్రసాద్ మొదటి సినిమా “అన్నపూర్ణ “కు దర్శకత్వం వహించింది మధుసూదనరావు గారే . 1986లో నాగార్జునను “విక్రమ్ “సినిమాతో ,1987లో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబును “సమ్రాట్ ” చిత్రంతో , 1989లో జగపతి బాబును “సింహ స్వప్నం ” సినిమాతో సినిమా రంగానికి పరిచయం చేశారు .1989లో వచ్చిన ” కృష్ణగారి అబ్బాయి ” చివరి సినిమా .

1978లో నేను మధుసూదన రావు గారిని మొదటిసారి అన్నపురం స్టూడియోస్ లో “విచిత్ర జీవితం “సెట్లో చూశాను . జర్నలిస్టుగా వారితో నా పరిచయం .అప్పుడే జరిగింది . ఆ తరువాత 1997లో మధుసూదన రావు గారు నంది అవార్డుల కమిటీలో చైర్మన్ గా వున్నప్పుడు ఆ కమిటీలో సభ్యుడుగా వుండే అవకాశం , అదృష్టం కలిగింది . వారప్పుడు జూబిలీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవారు . నేను కూడా కాలనీలోనే ఉండేవాడిని కాబట్టి ఇద్దరం ఒకే కారులో వెళ్ళేవాళ్ళం . మధుసూదనరావు గారు ఎంతో ప్రతిభకల దర్శకులు , అయినా చాలా సామాన్యంగా ఉండేవారు . స్నేహభావంతో మెలిగేవారు .ఆ సంవత్సరం నాగార్జున నటించిన “అన్నమయ్య “సినిమా ఉత్తమ సినిమాగా ఎన్నికై బంగారు నంది అవార్డు గెలుసుకుంది .
1983లో హైద్రాబాద్ లోని యూసఫ్ గూడలో మధు ఫిలిం ఇన్ స్టిట్యూట్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో ప్రారంభించారు. ఈ సంస్థలో నటీనటులు దర్శకులు , సాంకేతికనిపుణులు శిక్షణ ఇచ్చేవారు . అదే ప్రాంగణంలో “ఆత్మ కథ” సినిమాను 25 జులై 1987న మొదలుపెట్టారు . ఈ సినిమాలో జయసుధ, శరత్ బాబు , మోహన్ నటించారు . ప్రారంభం అనంతరం మధుసూదన రావు గారి కార్యాలయంలో వారితో పాటు దర్శకులు తాతినేని ప్రకాశం రావు , నిర్మాత , సారధి స్టూడియోస్ డైరెక్టర్ శశిభూషణ్ , డిస్ట్రిబ్యూటర్ సెల్వరాజు , నేను వున్నాము . 32 సంవత్సరాలనాటి మధురమైన సంఘటన ఇది . నిర్మాత ,దర్శకుడు వి బి .రాజేంద్ర ప్రసాద్ గారి జీవిత కథ “దసరా బుల్లోడు ” పుస్తకాన్ని నేను రచించాను. ఆ పుస్తకానికి ముందు మాట వ్రాయడమే కాదు మధుసూదన రావు గారు అనారోగ్యంతో వున్నా స్వయంగా వచ్చి ఆవిష్కరించారు .
విక్టరీ మధుసూదన రావు గారు 14 జూన్ 1923లో కృష్ణా జిల్లాలో జన్మించారు . 11 జనవరి 2012న తన 88వ ఏట హైదరాబాద్ లో మరణించారు .
-భగీరథ