జగన్ బలహీనత ఏంటో చెప్పిన విజయమ్మ

వచ్చే ఎన్నికల్లో వైసిపికి రాబోయే సీట్ల గురించి జగన్మోహన్ రెడ్డి  తల్లి విజయమ్మకు స్పష్టమైన అవగాహనే ఉన్నట్లుంది. ఆమె చెప్పిన లెక్క ప్రకారమైతే 120 అసెంబ్లీ సీట్లకు తగ్గకుండా పార్టీ గెలుచుకుంటుంది. చంద్రబాబునాయుడు ఒక్కరుగా వచ్చిన సరే లేకపోతే అందరితోను కలిసి వచ్చినా సరే అంటూ చంద్రబాబుకు విజయమ్మ సవాలు విసిరారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీనే అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబుకు నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ లు మద్దతుగా నిలవబట్టే చంద్రబాబు గెలిచారని లేకపోతే గెలిచే అవకాశమే లేదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఇఫుడు ఉన్నట్లే పోయిన ఎన్నికల సమయంలో కూడా వాతావరణం ఉన్నదని అందుకే వైసిపేయే అధికారంలోకి వచ్చేస్తుందని అప్పుడు కూడా ఇపుడు జరిగినట్లే ప్రచారం జరిగిందన్నారు. కాకపోతే చివరి నిముషంలో బిజెపి మద్దతుగా నిలవబట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని లేకపోతే అప్పుడే జగన్ సిఎం అయ్యేవారని అన్నారు. అప్పట్లో చంద్రబాబు సిఎం అయ్యారంటే తయన అనుభవాన్ని చూసి జనాలు ఓట్లేయలేదని, అదృష్టంతో మాత్రమే సిఎం అయ్యారని అన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తారన్న నమ్మకం తనకైతే లేదన్నారు.

పోయిన ఎన్నికలతో పోల్చుకుంటే జగన్ విషయంలో జనాల దృక్పదం కూడా మారిందన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన తప్పుడు వాగ్దానాలను జనాలు నమ్మారట. అయితే నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు నిజస్వరూపమేంటో అందరికీ అర్ధమైపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా జనాలు నమ్మే పరిస్ధితైతే లేదన్నారు. చంద్రబాబుకు పోయిన ఎన్నికల్లో అండగా నిలిచిన పార్టీలతో పాటు అదనంగా కాంగ్రెస్ కూడా కలసినా వైసిపికి వచ్చే నష్టమేదీ లేదన్నారు. ప్రస్తుతం జనాలందరూ చంద్రబాబు, జగన్ వ్యక్తిత్వాలను పోల్చి చూసుకుంటున్నారని చెప్పటం విశేషం.

పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. వైఎస్ అయినా జగన్ అయినా మహా మొండోళ్ళంటూ విజయమ్మ సరదాగా వ్యాఖ్యానించారు. నమ్మిన సిద్ధాందాల కోసం, జనాలకు సాయం చేయటం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం ఇద్దరిలో ఉందన్నారు. వాళ్ళిద్దరి బలమూ అదే బలహీనతా అదే అంటూ చమత్కరించారు. విజయమ్మ చెప్పిన పద్దతి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటంపై వైసిపి గట్టి నమ్మకంతోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి జనాలు ఏం చేస్తారో చూడాల్సిందే.