మలేషియాలో వైసిపి నేతలు

ఎన్నికల వేడిని తగ్గించుకునేందుకు వైసిపి నేతల్లో ఎక్కువమంది మలేషియాకు వెళ్ళిపోయారు. పోలింగ్ కు ముందు దాదాపు రెండు నెలలు అలుపెరగకుండా వైసిపి నేతలు కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసిపికి చావో రేవో అన్న పద్దతిలో తయారవటంతో నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామాన్నీ వదలకుండా తిరిగారు. అలాంటిది పోలింగ్ అయిపోయిన తర్వాత కాస్త సేదతీరుదామన్న ఉద్దేశ్యంతో విదేశాలకు క్యాంపు వేసుకున్నారు.

వైసిపి నేతల్లో ఎక్కువమంది మలేషియాకే వెళ్ళారట. కుంటుంబాలతో కొందరు మిత్రులతో కొందరు ముందుగానే మలేషియాకు టికెట్లు రిజర్వు చేసుకోవటంతో ప్రయాణంలో ఇబ్బంది కలగలేదు. పార్టీ తరపున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్ధులే కాకుండా కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా విదేశాలకు వెళ్ళినట్లు సమాచారం.

చంద్రబాబునాయుడు లాగ జగన్మోహన్ రెడ్డి పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కలు అడగటం లేదు.  నియోజకవర్గాల్లో గెలుపోటములపై వర్క్ షాపు కూడా నిర్వహించలేదు. తనకు అందుబాటులో ఉన్న మార్గాల్లో అన్నీ నియోజకవర్గాలపై తానే సమాచారం తెప్పించుకున్నారు.  కాబట్టే అభ్యర్ధులకు, ద్వితీయ శ్రేణి నేతలకు కావలసినంత వెసులుబాటు దొరికింది.

దానికితోడు జగన్ కూడా కుటుంబంతో కలసి స్విట్జర్లాండ్ వెళ్ళి వచ్చారు కద. అందుకనే ధైర్యంగా చాలామంది నేతలు విదేశాలకు ప్రధానంగా మలేషియాకు వెళ్ళారట. మళ్ళీ రెండు వారాలవ్వగానే కౌంటింగ్ హడావుడి మొదలవుతుంది. దాంతో ముందుగా విదేశీ ప్రయాణాలపైనే అందరూ దృష్టిపెట్టారట. ఏం చేస్తాం ఎంత ప్రజా ప్రతినిధులైనా కాసింత కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలి కదా.