జగన్, చంద్రబాబులు మాటవరసకైనా రూల్స్ పాటించరా ?

పంచాయతీ ఎన్నికల రగడ రెండు ప్రధాన పార్టీల నడుమ పెద్ద చిచ్చే పెట్టింది.  మేము గెలిచాం అంటే మేము గెలిచామని రెండు పార్టీలు వాదోపవాదనలకు దిగుతున్నాయి.  టీడీపీ ఏమో మేమే ఎక్కువ గెలిచాం, కానీ లెక్కలు మార్చేస్తున్నారని వైసీపీ నాయకుల మీద ఆరోపణలు చేస్తుంటే వైసీపీ ఏమో మేమే క్లీన్ స్వీప్ చేసి పడేశాం.  మాకు తిరుగులేదు.  అమరావతి ప్రాంతంలో కూడ మాదే విజయం అంటున్నారు.  ఇలా మా పార్టీదే గెలుపని తెగ గింజేసుకుంటున ఇరు పార్టీలకు అసలు పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీ గుర్తుల మీద జెండాల మీద జరగవని తెలియదా అనే అనుమానం కలుగుతోంది.  

క్షేత్ర స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందడం కోసం పొలిటికల్ పార్టీల ప్రాభవం లేకుండా వ్యక్తులను ఎన్నుకుని సమిష్టిగా పాటుపడాలనేది పంచాయతీ ఎన్నికల లక్ష్యం.  ఇక్కడ పార్టీల పక్షపాతాలు ఉండకూడదని, గెలిచిన అభ్యర్థులకు ప్రభుత్వం సహకారం ఉండాలనేది స్థానిక ఎన్నికల ఉద్దేశ్యం.  కానీ ఈఎన్నికలు ఏనాడో పొలిటికల్ పార్టీల ఎన్నికలుగా మారిపోయాయి.  బయటకు పార్టీ రహిత ఎన్నికలే అయినా లోపల నడిచేది నడిపించేది పార్టీల నాయకులే.  అభ్యర్థుల ఎంపిక, ఏకగ్రీవాలు, గెలిచినవారికి వలలు వేయడం ఇలా అన్నీ పెద్ద పార్టీల నాయకులే చూసుకుంటుంటారు.  లోపల జరిగేది ఇదే అయినా కనీసమా మాటవరసకైనా పార్టీల పేర్లను ప్రస్తావించకుండా ఇవి పార్టీ రహిత ఎన్నికలేనని అనడం కనీస ధర్మం.  


ఈ కనీస ధర్మాన్ని కూడ వైసీపీ, టీడీపీలు పాటించట్లేదు.  పోటీచేసిన అభ్యర్థులు  సైకిల్, ఫ్యాన్ గుర్తుల మీద, వైసీపీ, టీడీపీ జెండాలో ప్రచారంతో   గెలిచినట్టే చెప్పుకుంటున్నారు.  మావాళ్లు గెలిచారంటే మావాళ్లు గెలిచారని  వాదులాడుకుంటున్నారు.  ఈ కొట్లాట చూస్తే రెండు పార్టీలు నియమ నిబంధనలకు పూర్తిగా తిలోధకాలు వదిలేసినట్టే అనిపిస్తోంది.  అసలు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిగారైతే పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో అంటూ నవ్వులపాలయ్యారు.  చివరకు ఈసీ కలుగజేసుకుని ఈ ఎన్నికల్లో పార్టీలకు సంబంధంలేదనై క్లాస్ తీసుకుని ఆ మేనిఫెస్టోను రద్దుచేయాల్సి వచ్చింది.  ఇక వైసీపీ నేతలు ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నిస్తున్నారో చూస్తూనే ఉన్నాం.  ఇవన్నీ చూస్తే ఎన్నికలనేవి మన ప్రధాన పార్టీలకు ఎంత చులకనయ్యాయో అనిపిస్తోంది.