ఎన్నికల్లో చేతులెత్తేసిన టిడిపి

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ చేతులెత్తేసింది. అందరూ అనుకున్నట్లే శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. మార్చిలో ఖాళీలవ్వబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాల్లో పోటీకి వెనక్కు తగ్గింది. అంటే ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన ఐదు ఎంఎల్సీ స్ధానాలను మాత్రమే తీసుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. ఐదు ఎంఎల్సీ స్ధానాల్లో నాలుగు టిడిపికి వస్తాయి.

ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల కోటాలో భర్తీ కావాల్సిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎంఎల్సీ స్ధానాల్లో ఒకవైపు వైసిపి రెడీ అవుతోంది. అదే సమయంలో టిడిపికి పోటీకి సై అనాల్సిందే. కానీ  మూడు స్ధానాల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించటమే అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయగరం, శ్రీకాకుళం జిల్లాల కోటాలో ఉపాధ్యాయ ఎంఎల్సీ స్ధానం భర్తీ కావాల్సింది. అదే సమయంలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కోటాలో రెండు పట్టభద్రుల ఎంఎల్సీ స్ధానాలు భర్తీ కావాలి.

షెడ్యూల్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో ప్రత్యక్ష ఓటింగ్ తో భర్తీ కావాల్సిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎంఎల్సీ స్ధానాలు ఒక విధంగా రిహార్సిల్ లాంటివే. ఈ రెండు రకాల కోటాలో ఓట్లు వేయాల్సిన ఓటర్లు ఏడు జిల్లాల్లో ఉంటారు. అంటే మూడు ఎంఎల్సీ స్ధానాల గెలుపు ఓటముల్లో ఏడు జిల్లాల్లోని లక్షలాది ఓటర్లు పాల్గొంటారు. ప్రత్యక్ష ఓటర్లు టిడిపికి ఓటు వేస్తారన్న నమ్మకం లేకే పోటీ నుండి తప్పుకుంటోంది. మూడు స్ధానాల్లో టిడిపి గెలుస్తుందన్న నమ్మకం లేకే పోటీకి వెనకాడుతున్నట్లు అర్ధమైపోతోంది.