తెలంగాణలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ రివర్స్-ఆకర్ష్’

(లక్ష్మణ్ విజయ్)

టిఆర్ ఎస్ లో వచ్చిన లుకలుకలను వినియోగించుకునేందుకు కాంగ్రె స్ పార్టీ పెద్ద ఎత్తు వేసింది. టిఆర్ ఎస్ లో దాదాపు ప్రతినియోజకవర్గంలో అసమ్మతి బయలు దేరిందిపుడు. టికె ట్లు రాని వాళ్లు, టిఆర్ ఎస్ లో గుర్తింపు రాని వాళ్లు, టిఆర్ ఎస్ లో  అవమానం పాలయిన వాళ్లు.. ఈ సంఖ్య  పెరిగింది. మొన్న ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితా ప్రకటించాక వీరంతా ఒకరొకరే బయటపడుతున్నారు. ఈ అసమ్మతిని వాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఏవిదంగా నయితే, కాంగ్రెస్ నాయకులను ఎన్నికల ముందు కేసులో సతాయించాలనుకుంటున్నారు, అదే విధంగా కాంగ్రెస్ కూడ టిఆర్ ఎస్ మీద సైకలాజికల్ అసాల్ట్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిని పార్టీ నేతలు ‘అపరేషన్ రివర్స్ ఆకర్ష్’ అని పిలుచుకుంటున్నారు.  ఇలాంటి వ్యవహారాలలో రాటుదేలిన ఎఐసిసి అధినేత గులామ్ నబీ ఆజాద్ ఈ   కార్య క్రమాన్ని పర్యవేక్షించేందుకే ప్రత్యేకంగా వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

టిఆర్ఎస్ లో చేరి, అక్కడ గుర్తింపు లేకపోవడమేకాదు,  అవమానాలు ఎదుర్కొంటున్నామని చెబుతున్న రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండాసురేఖ, ఆమె భర్త కొండా మురళి, మాజీ టిడిపి ఎంపి రమేశ్ రాధోడ్, చెవేళ్ల మాజీ  ఎమ్మెల్యే కెస్ రత్నం, ఆకుల రాజేందర్ , నందీశ్వర్ గౌడ్ తదితరులనాయకులంతా ఆపరేషర్ రివర్స్ – ఆకర్ష్ కింద కాంగ్రెస్ లో చేరబోతున్నారు.

మరొక ఆసక్తి కరమయిన విషయమేమిటంటే, సంగరెడ్డి జిల్లా టిఆర్ ఎస్ అధ్యక్షుడు  మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ కూడా కాంగ్రెస్ లో చేరవచ్చని చెబుతున్నారు.సత్యనారాయణ టిఆర్ ఎస్ లో ఘోరంగా అవమానం పాలయ్యారు. ఆయనను మచ్చికచేసుకునేందుకు కాంగ్రెస్ నాయకుడొకరు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే, మాజీ ఎమ్మెల్సీ అయినా ఆయనకు ముఖ్యమంత్రి దర్శనమీయడం లేదు. సత్యనారాయణ నిన్న విలేకరుల సమావేశం పెట్టి ఈ విషయం వెల్లడించారు. ఆయన ఏకంగా పార్టీ అంతరంగిక వ్యవహారమయిన విషయాన్ని ఇలా బయటపెట్టడంతో ముఖ్యమంత్రి ఆగ్రహిస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణ చాలా డిప్లొమేటిక్ గా తన గోడు వెల్లబోసుసుకున్నారు. తాను పార్టీలో నే ఉంటానని, టిఆర్ ఎస్ తోనే ఉంటానని చెబుతూనే, తనకు జరగుతున్న అన్యాయాన్ని ఆయన వెల్లడించారు.

నిజానికి ఆయన చాలా అన్యాయం జరిగింది. 2007లో కెసిఆర్ పిలుపుతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో దిగారు. పదవి త్యాగం చేశాడు కాబట్టి  వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికె ట్ గ్యారంటీ అనుకున్నాడు. అలా జరగలేదు. 2014 ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అంతేకాదు, గజ్వేల్ వెళ్లి కెసిఆర్ గెలిపించేందుకు ప్రచారం కూడా చేశారు. దీనికి గుర్తింపుగా 2019  ఎన్నికల్లో టికెట్ వస్తుందనుకున్నారు. ఇపుడు కూడా  మొండిచేయి చూపించారు. దీనికంటే పరాభవం, సత్యనారాయణను కలుసుకునేందుకు ముఖ్యమంత్రి తిరస్కరించడం.  ఉద్యమం కోసం పదవిని వదలుకున్న నాయకుడు, పార్టీ కి జిల్లా అద్యక్షుడూ అయినా కెసిఆర్ ఆయనకు అప్పాయంట్ మెంట్ ఇవ్వడం లేదు. ఇది అవమానంగా భావిస్తున్నారు.

ఇలాంటి వ్యవహారమే కెఎస్ రత్నం ది కూడా. రత్నం 2014 ఎన్నికల్లో ఆయన  చేవెళ్ల(ఎస్ సి) నియోజకవర్గం నుంచి టిఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో ఓడిపోయాడు. తర్వాత యాదయ్య పార్టీ ఫిరాయించి టిఆర్ ఎస్ జంప్ చేశాడు. ఇపుడు టిఆర్ ఎస్ కాలేయాదయ్యకు టికెట్ ఖరారు చేసి రత్నానికి  చేయిచ్చింది. దీనితో రత్నం కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్నారు.

ఇలాగే కెసిఆర్ ను కలవాలనుకుని అపాయంట్ మెంటు కూడా దక్కని మరొక టిఆర్ ఎస్ లీడర్ నల్లాల వోదెలు. ఆయన చెన్నూర్ టిఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే  కేసీఆర్ ప్రకటించిన టికెట్ల జాబితాలో ఆయనన పేరు లేదు.  ఈ సీటును  ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించారు. దీంతో మనస్థాపం చెందని ఓదేలు కేసీఆర్ ను కలిసి ఒక విజ్జప్తి చేయాలనుకున్నారు, అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. పార్టీలో ఉంటే ఉండవచ్చు,  లేకపోతే లేదనే ధోరణితో సమాధానం వచ్చిందని చెబుతున్నారు. వోదెలు కూడా ఇపుడు భవిష్యత్తు కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నారు. వీళ్లంతా అత్మాభిమానం దెబ్బతినందని భావిస్తున్నారట. 

ఇలాంటి వారందరిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఆపరేషర్ రివర్స్ ఆకర్స్ మొదలుపెడుతున్నారు. కాంగ్రెస్, టిడిపి కలిసే అవకాశాలుండటంతో పార్టీ గెలుపు మీద చాలా మంది ధీమా వచ్చింది. దానితో  టిఆర్ ఎస్ అసమ్మతి వాదులు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పార్టీ పెద్దలు చెబుతున్నారు.

ఈ కొత్త పొలిటికల్ ప్రాజక్టు ను అమలుచేయడంలో కాంగ్రెస్  ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్టయిన కెసిఆర్ ఏ మేరకు చిత్తు చేయగలదో చూడాలి.