ఆంధ్రలో టిడిపి-కాంగ్రెస్ ల వింత కాపురం చూశారా?

నిన్న విజయవాడలో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో అగ్ర నేత ఉమెన్ చాంది పాల్గొని ఎపిలో టిడిపితో ఎన్నికల పొత్తు వుండదని చేసిన ప్రకటన ఎవరికీ ఆశ్చర్యం కలిగించ లేదు.

ఎందుకంటే తెలంగాణలో రెండు పార్టీలు జట్టు కట్టి ఎన్నికలను ఎదుర్కోని తిన్న చావుదెబ్బతో ఆనాడే ఇద్దరూ కాపురానికి విడాకులు ఇచ్చేశారు. పై స్థాయిలో నేతల అవసరాలతో కలసి కాపురం ప్రారంభించినా 1)ఇది అపవిత్ర పొత్తు కావడం2) కింది స్థాయిలో ఓట్లు బదలీ కాక పోవడంతో ఇద్దరి పరువు పోయింది. నీ పిల్లలు నా పిల్లలు కలసి మన పిల్లల అంతు చూచారనే సామెత టిడిపి కాంగ్రెస్ పార్టీల నేతలకు అవగత మైంది. రాష్ట్ర కాంగ్రెస్ సమావేశంలో ఏదో ఒకటి తేల్చ వలసి వున్నందున ముఖ్యమంత్రి హడావుడిగా వెళ్లి రాహుల్ గాంధీని కలిసి అధికారయుతంగా విడాకులు తీసుకున్నారు. ఆ విషయాన్ని బుధవారం ఉమెన్ చాంది విజయవాడలో బహిరంగ పరిచారు.

ఇందులో మరో ట్విస్ట్ వుంది. ఎపిలో కాంగ్రెస్ టిడిపి విడాకులు తీసుకున్నా సహజీవనం మాత్రం సాగు తుందని ప్రకటించడమే కొసమెరుపు. ఎపిలో రేపు ఎన్నికల్లో ఒకరి కొకరు పోటీ చేసుకుంటారు. కేంద్రంలో పొత్తు ఆలాగే వుంటుంది. విడాకులు ఇచ్చు కొందాం. అయితే సహజీవనం చేదాం. అహా ఎంత బావుందో చూడండి. ఎపిలో రెండు పార్టీలు కలసి పని చేయ లేవు. గాని కేంద్రంలో మాత్రం బిజెపి కి వ్యతిరేకంగా పోరాడతాయట.

అసలు విషయం ఏమంటే నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో ఎవరో ఒకరి అండ చంద్రబాబుకు అవసరమైంది. రాహుల్ గాంధీ ప్రధాని అయిపోయి నట్లు ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేసి నట్లు చంద్రబాబు ప్రజలను నమ్మించాలి. అందుకే కాలికి బలపం కట్టు కొని తిరిగినా క్షేత్ర స్థాయిలో పరిస్థితి వ్యతిరేకంగా వుండటంతో విడాకులు తీసుకొని సహజీవనానికి మాత్ర మే తెర లేపారు.

అందుకే కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ యెడల చంద్రబాబు విమర్శలు తగ్గించి పొత్తుకు సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రతిపాదన ఏ రూపు దాల్చు తుందో ఏమో గాని ఇదే నిజమైతే చంద్రబాబు పవన్ ఇద్దరినీ ఎపి ప్రజలు క్షమించే సమస్యే లేదు. వీరిద్దరు మధ్య వామపక్షాలు ఇరుకున పడక తప్పదు. చంద్రబాబు ఎన్ని ఆశలు చూపెట్టినా పవన్ కల్యాణ్ చిరంజీవి చేసిన తప్పు పైగా 2014 ఎన్నికల్లో పవన్ స్వతహాగా వేసిన తప్పటడుగు తిరిగి చేయరనే భావిదాం.

ఈ పరిణామాల మధ్య అటు చంద్రబాబుకు ఇటు కాంగ్రెస్ కు తీవ్రమైన ఆటుపోటులు తప్పవు. ఎవరి అండో ఒకటి లేకుండా చంద్రబాబు ఆయన పరిభాషలో చెప్పాలంటో ‘ఆలా ముందుకు’ పోలేరు. అదే సమయంలో ఎపిలోని పలువురు కాంగ్రెస్ నేతలు వలస బాట పట్టక తప్పదు. ఇప్పటికే కొందరు గోడ దూకేశారు. మున్ముందు ఈ గో.పీల గోల మరింత ఎక్కువగా వుండ బోతోంది.

బిజెపి ఎపి యెడలనే కాదు. దేశం మొత్తం మీద దురహంకార వైఖరి అవలంభించడం నిజమే. అదే సమయంలో ప్రతి పక్షాలు కూడా అసంబద్ధ వైఖరి చేపడుతున్నాయి. అందుకు ఎపిలో టిడిపి కాంగ్రెస్ పొత్తు. విడాకులు తార్కాణం. పైగా యుపిలో అఖిల లేశ్ మాయావతి జట్టు కట్టి కాంగ్రెస్ ను బిజెపితో సమానంగా తిట్టి పోశారు. తిరిగి కోలకతాల సభలో కాంగ్రెస్ నేతల సరసన అఖిలేశ్ కూర్చున్నారు. అంతెందుకు. ఎపి ముఖ్యమంత్రి కోలకతాలో సభలో పాల్గొన్నారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ కి శాలువ కప్పారు. అయితే సంసారం వద్దు. సహజీవనం ముద్దు అంటున్నారు. మరి వీరిని ప్రజలు ఏలా నమ్మగలరు.

(వి. శంకరయ్య )