జగన్ పై దాడిలో వాడిన కోడి కత్తి కథ ఇది

జగన్ పై దాడి జరిగిన ఘటనలో నిందితుడు ఉపయోగించిన ఆయుధంపై తొలుత రకరకాల వాదనలు వినిపించాయి. ఫోర్క్ అని కొందరంటే కోడి పందేలకు ఉపయోగించే కత్తి అని వాదన సాగింది. చివరికి అది కోడి పందేలకు ఉపయోగించే కత్తే అని నిర్ధారణ అయింది. అసలు శ్రీనివాస్ జగన్ ని ఎందుకు పొడిచాడు? అనే ప్రశ్నకి రాజకీయ వర్గాల వారంతా రకరకాల ఆరోపణలు చేసుకుంటున్నారు. 
 
వీరి ఆరోపణలు, విమర్శలు పక్కన పెడితే నిందితుడు శ్రీనివాస్ మాత్రం జగన్ పైన అభిమానంతోనే చేశా అని తేల్చేసాడు. గత ఎన్నికల్లోనే జగన్ సీఎం అవుతాడు అనుకున్నాను. కానీ జరగలేదు. ఈసారైనా జగన్ సీఎం అవ్వాలని కోరుకున్నాను. ఇలా జగన్ పై దాడి చేస్తే సింపతీ పెరిగి సీఎం అవుతాడని భావించి ఆలా చేశాను అంటూ తప్పును ఒప్పుకుని, దాని వెనుక ఉన్న కారణం ఇది అంటూ వివరించాడు.
 
అసలు ఈ విషయాలన్నీ పక్కన పెడితే శ్రీనివాస్ కంటే కూడా అతను ఉపయోగించిన కోడి కత్తి బాగా ఫేమస్ అయిపోయింది. అందరు దీని గురించే చర్చించుకుంటున్నారు. అసలు ఈ కత్తి ఏంటో… ఎక్కడ తయారయ్యిందో… దీని కథ ఏమిటో… మాకు అందిన సమాచారం ప్రకారం మీ కోసం ఒక చిన్న కధనం. 
 
కోడి కత్తులు కట్టడంలో శ్రీనివాసరావుకు, అతని తండ్రి తాతారావుకి మంచి ప్రావీణ్యం ఉందని ఆ చుట్టుపక్కలవారంతా ఎరిగిన సత్యం. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలకు పెట్టింది పేరు ముమ్మిడివరం. ఈ నియోజకవర్గంలో కోడిపందేలు జరిగే సమయంలో తండ్రి కొడుకులు ఇరువురు కోళ్లకు కత్తులు కడుతుంటారు. ఈ విధంగా శ్రీనివాస్ కి కోడి కత్తుల గురించి మంచి అవగాహన పెరిగింది. 
 
దాదాపు కొన్ని నెలల కిందట శ్రీనివాస్ కత్తులు తయారీదారుడిని కలిశాడు. అతని దగ్గర ఒక కోడి కత్తిని కొనుగోలు చేసాడు. కాగా దుకాణదారుడు శ్రీనివాస్ ని ఇప్పుడు కోడి పందేలు లేవు కదా, పైగా నువ్వు కోడి పందేలు ఆడవు, నీకు కోడి కత్తితో పనేంటి అని ప్రశ్నించాడు. నాకు వేరే పని ఉందిలే అని శ్రీనివాస్ దుకాణదారుడితో తెలిపినట్టు స్థానికులు చెబుతున్న మాటలు.