తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బంధువులను కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఆర్ట్స్ చేసి రిమాండ్లో ఉంచిన సంగతి తెలిసిందే. అఖిలప్రియ తరఫున ఆమె న్యాయవాదులు బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అఖిలప్రియ ఆరోగ్య పరిస్థిని కోర్టుకు సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసింది. అయితే అఖిలప్రియ బయటికొస్తే తనకున్న పలుకుబడితో సాక్ష్యాలను తారుమారుచేసే అవకాశం ఉందని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇలా అఖిల ప్రియ రోజురోజుకూ కేసులో కూరుకుపోతున్నా తెలుగుదేశం నుండి ఊహించిన స్థాయి స్పందన రావట్లేదు. ఇంతవరకు ఏపీలో జరిగిన టీడీపీ నేతలైన అచ్చెన్నాయుడు, జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతల అరెస్టుల మీద చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇతర ఐటీడీపీ నేతలు గోల గోల చేశారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కానీ తెలంగాణలో అరెస్ట్ అయిన అఖిల ప్రియ విషయంలో మాత్రం పెద్దగా కలుగజేసుకోవట్లేదు. భూమా కుటుంబం ఈ పరిణామంతో తీవ్ర అసహనానికి గురవుతుండగా వైసీపీ నేతలు అఖిల ప్రియ అరెస్ట్ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు సంగతి పక్కనపెడితే రాయలసీమ నుండి కూడ అఖిల ప్రియకు మద్దతిచ్చే నేతలు కరువయ్యారు.
ఇందుకు అఖిల ప్రియ దూకుడే కారణమని చెబుతున్నా ఇప్పుడామె కష్టాల్లో ఉన్నారు. జైలుపాలయ్యారు. ఇలాంటి సమయంలో ఎవరూ కూడ ముందుకొచ్చి కనీసం మాట సహాయం కూడ చేయకపోవడంతో శ్రేణులు సైతం నిరుత్సాహానికి గురవుతున్నాయి. ఇలాంటి టైంలో ఎట్టకేలకు ఒక్క వ్యక్తి అఖిల ప్రియను వెనకేసుకొచ్చారు. అతనే జేసీ కుటుంబానికి చెందిన యువనేత జేసీ పవన్ రెడ్డి. అఖిల ప్రియ విషయంలో అందరూ వెనకడుగువేస్తే ఆయనొక్కరే మాట్లాడారు. భూమా అఖిల ప్రియ కేసులో ఏపీ ప్రభుత్వం కుట్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఒక మహిళకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏమిటని అన్నారు. కేవలం ఫిర్యాదు ఆధారంగా ఏ1గా కేసు పెట్టి ఎలా అరెస్ట్ చేస్తారని, తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ అరెస్ట్ చేయించి ఉంటుందని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మరి పవన్ రెడ్డి ముందుకొచ్చారు కాబట్టి మిగతా నేతలు ఏమైనా ధైర్యం చేస్తారేమో చూడాలి.