ఐటి అధికారులకే షాక్ ఇచ్చిన టిడిపి

తమపై  దాడులకు వచ్చే ఐటి అధికారులకు షాక్ ఇవ్వాలని బహుశా తెలుగుదేశంపార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లున్నారు. ఐటి దాడులకు వచ్చిన వారిని అడ్డుకోవటం పెద్ద నేరం. కానీ ప్రస్తుతం అవేవీ టిడిపి నేతలు పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు. అందుకు తాజా ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 100 మంది అధికారులు హైదరాబాద్, కడప, పోట్లదుర్తిలో సోదాలు జరిపారు.

ఇక్కడే విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంది. పోట్లదుర్తిలో సోదాలకు వచ్చిన అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన తెలపటం విచిత్రంగా ఉంది. రమేష్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరి ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా లకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అధికారులు బయటకు వస్తే దాడులు జరుగుతాయా అనే వాతావరణం సృష్టించారు. దాంతో అధికారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అంతేకాకుండా కమలాపురం మాజీ ఎంఎల్ఏ వీర శివారెడ్డి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి, బిటెక్ రవి తదితరలు రమేష్  ఇంటికి వచ్చి వెళ్ళారు.

అదే సమయంలో ప్రొద్దుటూరు, కడపలో కూడా ఎక్కడికక్కడ టిడిపి శ్రేణులు నిరసనలు తెలపటంతో  కొత్త సంప్రదాయాలు తెరలేచింది. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, సిఎం రమేష్ తదితరుల వాదన ప్రకారం అసలు తమపై ఏ దర్యాప్తు సంస్ధలు కూడా దాడులు చేయకూడదు. తమను ఎవరూ ప్రశ్నించకూడదు. తామేం చేసినా ఎవరూ మాట్లాడకూడదన్నట్లుగా ఉంది వారి ధోరణి. ఎవరైనా ప్రశ్నించినా, ఐటి, ఈడీ దాడులు జరిపినా రాష్ట్రంపైన, ప్రజాస్వామ్యంపైన దాడులుగా ప్రచారం చేయించటమే ఆశ్చర్యంగా ఉంది.

ఒక విషయం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది. 2014కు ముందు అంతంత మాత్రంగా ఉన్న సిఎం రమేష్ సంస్ధల ఆర్ధిక పరిస్ధితి ఒక్కసారిగా పుంజుకుంది. ఇరిగేషన్లో వర్కుల్లో చాలా వరకూ రమేష్ కు నామినేషన్ పైనే దక్కాయట. ప్రతీ వర్కు అంచనా వ్యయాలను పెంచేసుకున్నారు. ఇష్టారాజ్యంగా దోచేసుకున్నట్లు ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నపుడు ఐటి దాడులు జరక్కుండా ఎలా ఉంటుంది.

అదే సమయంలో మరో విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. గతంలో కూడా టిడిపి నేతలపై ఐటి దాడులు జరిగాయి. నెల్లూరులో ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిపైన, గుంటూరులో ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి, చిత్తూరులో ఎంఎల్ఏ సత్యప్రభపైన కూడా దాడులు జరిగాయి. వాళ్ళపై ఐటి దాడులు జరిగినపుడు చంద్రబాబు అండ్ కో ఎవరూ నోరెత్తలేదు. సిఎం రమేష్ పై దాడులు జరగ్గానే ఎందుకు అందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు ?  పైగా ఇళ్ళ వద్దకు జనాలను పంపించి అధికారులకు, మోడి, అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయిస్తున్నారు.