తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా రాష్ట్ర రాజధానిని నిర్వీర్యం చేయడంలో ఎవరికి తగిన పాత్రను వారు పోషించారు. ఒకరు ఎక్కువ చేశారని, ఒకరు తక్కువే చేశారని చెప్పడానికి లేదు. అప్పుడు అధికారంలో ఉండగా చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని సొంత పబ్లిసిటీ కోసం వాడుకుంటే ఈనాడు వైఎస్ జగన్ అసెంబ్లీలో ఇచ్చిన మాటను మరచి మూడు రాజధానులంటూ గందరగోళం సృష్టించారు. అయితే ఇందులో మేజర్ పోర్షన్ చంద్రబాబుగారికే దక్కుతుంది. ముఖ్యమంత్రి హోదాలో రాజధాని నిర్మించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఒక యజ్ఞంలా భావించి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ బాబుగారు ఏం చేశారు అరచేతిలో డిజన్లు పట్టుకుని ఆ దేశం ఈ దేశం తిరుగుతూ హడావిడి మాత్రమే చేశారు.
అసలు రాజధానిలో తాత్కాలిక భవనాలు కట్టడం అనే కాన్సెప్ట్ ఇప్పటికీ జనాలకు అర్థం కాలేదు. ఏ ప్రభుత్వ భవనం చూసినా తాత్కాలిక పేరుతో కట్టినదే. వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి తాత్కాలికాలు నిర్మించడం చంద్రబాబుగారికే చెల్లింది. 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని వాడుకునే వీలుంది. కానీ కేసుల భయంతో పెట్టె బేడా సర్దుకుని అమరావతిలో వచ్చి పడ్డారు. సరే వచ్చినవారు కమిట్మెంట్ చూపించారా అంటే లేదు. సింగపూర్, చైనా బృందాలను వెనకేసుకొని తిరిగారు తప్ప రాజధానిని ప్రజలకు దగ్గర చేయలేకపోయారు. విడిపోయిన రాష్ట్రానికి కొత్త రాజధాని వస్తోంది అంటే ఆ రాష్ట్ర ప్రజానీకం ఆ రాజధాని మీద ఎంత సెంటిమెంట్ పెంచుకుని ఉండాలి.
కానీ చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్ చూసిన జనం అమరావతిని లైట్ తీసుకున్నారు. అందుకే ఈనాడు అక్కడి రైతులు నెలలు తరబడి పోరాటం చేస్తున్నా పెద్దగా స్పందించట్లేదు. అసలు చంద్రబాబే గనుక ఐదేళ్ల పదవీ కాలంలో అంకితభావంతో పనిచేసి అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రాజధానికి ఒక రూపం ఇచ్చి ఉంటే ఈనాడు జగన్ దాన్ని కాదని అనగలిగేవారా. ఒకవేళ అంటే జనం మిన్నకుండిపోయేవారా. తన పాలనలో కనీసం నగర సరిహద్దులు ఏంటి, సిటీకి పిన్ కోడ్ ఏర్పాటు చేసుకోవడం, ఖచ్చితమైన గెజిట్స్ రూపొందించడం లాంటి అతి ముఖ్యమైన పనులు కూడ చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం.
తీరా జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అనేసరికి నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఈనాడు తెలుగుదేశం చేస్తున్న గోల చూస్తుంటే జగన్ పూర్తికాబడిన ఒక నగరాన్ని కూలదోస్తున్నారన్నట్టు ఉంది. కానీ అక్కడ నగరం లేదు. అరకొర పనులు చేసి వదిలేసిన కొన్ని నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. కేవలం ఐదేళ్ళలో ఒక నగరాన్ని 50 శాతమైనా నిర్మించడం ఎలా సాధ్యం అనుకోవచ్చు. కానీ సాధ్యమే. రాష్ట్ర యంత్రాగాన్ని సమర్థవంతంగా వాడుకుని ఉంటే అది వీలయ్యేదే. బాబుగారు చేయలేదంతే. కానీ ఈరోజు మాత్రం కలల నగరాన్ని కూలుస్తున్నారని అంటూ అక్కడి పవిత్ర స్థలాల మట్టి మీద పొర్లు దండాలు పెట్టేస్తున్నారు. అయినా ఎన్ని పొర్లు దండాలు పెట్టి ఏం లాభం. కలల్లో తప్ప కళ్ళ ముందు కనబడని రాజధాని రాదు కదా.