రాయలసీమ కష్టాలు తీరేందుకు ఇకనైనా దీక్ష పూనండి బాబుగారూ ….

(యనమల నాగిరెడ్డి)

 

బీజేపీ నాయకత్వం రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తున్నదని ఆరోపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతూ “ధర్మపోరాటదీక్షలు” రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అలాగే జన్మభూమి ఋణం తీర్చుకోమని దేశ దేశాలలో, గ్రామ, గ్రామాలలో సభలు పెట్టి అందరికీ  (ఎన్.ఆర్.ఐ లను, ఇతర ప్రాంతాలలో ఉన్నవారికి) ఉద్బోధిస్తున్నారు. అయితే రాయలసీమ విషయంలో ఆయన వ్యవహారశైలి “గురివింద” సామెతను గుర్తుచేస్తున్నదని “జన్మభూమి ఋణం తీర్చుకోవాలనే సూత్రానికి ఆయన అతీతుడా? లేక ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఉందా?” అన్న సందేహం సీమ ప్రాంతంలో షికార్లు చేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా ఈ నెల 20న కడపజిల్లాలో ముఖ్యమంత్రి ధర్మపోరాటదీక్ష చేపట్టారు. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు అనేక దశాబ్దాలుగా చేస్తున్న అన్యాయాలకు, వివక్షకు  వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కాని సీమ నాయకులు కానీ దీక్షలు చేపట్టి తమకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 

టీడీపీ బీజేపీ బంధం- సీమకు మోసం

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత  బీజేపీతో జట్టు కట్టిన చంద్రబాబుగారు మోడీతో కలసి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.  ఈ రెండు పార్టీలు రాష్ట్ర విభజనలో తమదైన శైలిలో తమ వంతు పాత్ర పోషించినా, కాంగ్రెస్ అన్యాయంగా, అశాస్త్రీయంగా ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని ఆరోపిస్తూ, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తిరుమల వేంకటేశ్వరుడి సాక్షిగా ప్రకటించి ఓట్లు దండుకున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం కైవసం చేసుకుని పదవులు పంచుకున్న విషయం విదితమే.

.

“రాష్ట్రానికి ఇంతకు మించి సాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేదని బాబుగారు, ఆయన అంతేవాసులు బాజాలు మోగించగా  చంద్రబాబును మించిన ముఖ్యమంత్రి దేశంలోనే లేడని, ఆయన ‘చేసినంత’ ఎవరూ చేయలేరని బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు డప్పు కొట్టి మరీ ప్రకటించారు”. అయితే “బాబుగారు చెప్పింది బీజేపీ పెద్దలు వినలేదో, వారు చెప్పింది వీరు వినలేదో” తెలియదు కానీ రెండు పార్టీల నాయకులు గత 8 నెలలుగా  ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ పతాకస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

 

కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబుగారు ధ్వజమెత్తి ధర్మపోరాటదీక్షలు చేపట్టారు.  మేము సాయం చేస్తామన్నా రాష్ట్రప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఏతావాతా రెండు పార్టీల నేతలు రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి 2019 ఎన్నికలను దృష్ఠిలో ఉంచుకుని “తమ రాజకీయ ప్రయోజనాల కోసం”  ప్రజాజీవితాలతో చెలగాటం మొదలు పెట్టారు. అందులో భాగంగా రాయలసీమను బలిపశువును చేశారు.

 

సీమపై రెండు పార్టీల మొసలి కన్నీరు

 

అయితే  రెండు పార్టీల నాయకులు కూడా 2014 నుండి  రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తూ ఈ ప్రాంతాన్ని మోసం చేస్తూనే ఉన్నారు.  2014లో రాష్ట్ర విభజన తర్వాత (పూర్వపు 1953 నాటి ఆంధ్ర రాష్ట్రం) తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. మద్రాస్ రాష్ట్రము నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడడానికి కారణభూతమైన “శ్రీ భాగ్ ఒప్పందం” ప్రకారం  సీమవాసుల కోరిక మేరకు సీమలో ఏర్పాటు చేయాల్సిన రాజధానిని “ఇరువురు సీమ ముద్దు బిడ్డలు” నేరుగా కోస్తాకు తరలించారు. హైకోర్టు అయినా ఇస్తారనుకుంటే ఆ ఊసే ఎత్తలేదు. రాజధాని విషయంపై కమిటీ వేసి తేల్చవలసిన కేంద్రం, బీజేపీ  మౌన ప్రేక్షక పాత్ర పోషించాయి.

 

నిర్మాణంలో ఉన్న అన్నినీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని అప్పటి కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీని గురించి   బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. “పోలవరం- సోమవారం”అంటూ పోలవరంపై అపరిమిత శ్రద్ద చూపుతున్న ముఖ్యమంత్రి, పోలవరానికే  వరాలిస్తున్న కేంద్రం అందులో పాతిక వంతు శ్రద్ద కూడా సీమ ప్రాజెక్టులపై చూపలేదన్నది నిర్వివాదాంశం. రెండు పార్టీలు ఈ విషయంలో కూడా నోరువిప్పడం లేదు.   

విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, విభజన సమయంలో అప్పటి ప్రధాని ప్రకటన ద్వారా ఇచ్చిన హామీలు  రాయలసీమ విషయంలో “ఎండమావులుగానే మిగిలాయి. ‘కడప ఉక్కు’ హామీ ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికే పనికివస్తున్నది తప్పా ఆచరణ సూన్యం. ఒకవేళ ఇపుడు ఒకరిపై ఒకరు పోటీ పడి శంఖుస్థాపన చేసినా ఆ ప్రాజెక్టు మరో మన్నవరం అవుతుంది తప్పా ఫలితం సూన్యమే.

 

ప్రత్యేక హోదా– ప్రత్యేక ప్యాకేజి

 

రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి ప్యాకేజి ప్రకటించడం, బాబు (హోదా సంజీవని కాదని) స్వాగతించడం, ఆతర్వాత వెనక్కి తిరిగి హోదానే కావాలనడం ఎవరికీ తగ్గట్టు వారు ప్రకటనల యుద్ధం చేస్తూ జనం చెవుల్లో పువ్వులు పెట్టడం జరుగుతూనే ఉంది. అదే సమయంలో వెనుకపడిన ప్రాంతాలకు ప్రకటించిన “బందెలఖండ్” తరహా ప్యాకేజీల గురించి ఎవరూ నోరు మెదపక పోగా  ఒక్కో జిల్లాకు ముష్టిగా ఇస్తున్న 50 కోట్లపై రాద్ధాంతం చేస్తూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.

 

బ్రిజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్

 

కృష్టానది నీటి పంపకాలకోసం కేంద్రం ఏర్పాటు చేసిన బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్  ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 1004 టిఎంసిల కృష్ట నీటిలో రాయలసీమలోని రాజోలి బండకు 4 టీఎంసీల నికర జలాలను, తెలుగుగంగకు 25 టీఎంసీల మిగులు జలాలను మాత్రమే కేటాయించారు.  అయితే “ప్రజలకు త్రాగు నీరు, ఒక్క ఆరు తడి పంటకైనా సాగు నీరు ఇస్తే తప్ప” ఈ కరువు ప్రాంతంలో జనం బ్రతకలేరని తెలిసినా “ట్రిబ్యునల్” తన పరిధిలో పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తూ . వేల  కోట్లు ఖర్చు చేసి సీమలో నిర్మిస్తున్న “గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వెలిగొండ” ప్రాజెక్ట్ లకు నీటి కేటాయింపులను గురించి ప్రస్తావించలేదు. ట్రిబ్యునల్ ఆలోచనను పక్కన పెడితే, రాష్ట్ర విభజన తర్వాత,అంతకు ముందు,కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రిబ్యునల్ ముందు రాయలసీమ అవసరాలను గురించి కానీ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన నీటి కేటాయింపుల గురించి కానీ ప్రస్తావించకపోగా, రాయలసీమకు వ్యతిరేకమైన వాదనలు వినిపించడం ఆశ్చర్యకరం.

 

2014 రాష్ట్ర విభజన తర్వాత         

 

రాష్ట్ర విభజన తరువాత  తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల మధ్య కృష్టా నీటిని పంచడానికి ఇదే ట్రిబ్యునల్ ను కేంద్రం నియమించింది. రెండు తెలుగు రాష్ట్రాలు తమ (స్వ) ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ, ఇంతకాలం “తమలో ఒకరిగా ఉన్న రాయలసీమ ప్రయోజనాలను భూస్థాపితం చేస్తున్నారు ”.  పట్టిసీమ, పోలవరం నుండి కృష్ణ బేసిన్ కు నీళ్లు తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మేరకు అవసరమైన జి.ఓ.లు మాత్రం ఇప్పటివరకూ ఇవ్వలేదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తూ సాగదీస్తున్నారు.  ప్రస్తుతానికి 2019 ఎన్నికల దృష్ట్యా కృష్ణ నీళ్లు గండికోటకు తరలించినా, అనంతపురం జిల్లాలో పారించినా, ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చిన తర్వాత రాయలసీమ ప్రజలకు “దుప్పి భోజనమే ఖాయమని” చెప్పక తప్పదు.

 

ఉద్యొగాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడం కోసం కేంద్రం ఆరు సూత్రాల పధకం పెట్టింది.  రాజధానిని ఒక జోన్ గా, మిగిలిన ప్రాంతాలను 5 జోన్ లుగా విభజించి దామాషా పద్ధతిన అన్ని ప్రాంతాల వారికి ఉద్యొగాలివ్వాలని నిర్ణయించారు.  రాష్ట్ర విభజన తర్వాత ఈ సూత్రాలు కనిపించడం లేదు. రాజధాని ప్రాంతంలో సీమ వాసులెవ్వరూ (ఉద్యొగాలలో) కనిపించడంలేదు.

 

అభివృద్ధి కేంద్రీకరణ

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులందరూ  హైదరాబాద్ ను, కోస్తా ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ మిగిలిన రాయలసీమ, ఉత్తరాంధ్ర  ప్రాంతాలను పట్టించుకోలేదు. ఆంధ్రప్రాంతం వాళ్ళు, తమ నీళ్లు, నిధులు, ఉద్యొగాలు దోచుకెళుతున్నారని , తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన తెలంగాణా వాదులు  రాష్ట్రం సాధించుకున్నారు.

రాష్ట్ర విభజన తరువాత ఈ  ప్రాంతానికే చెందిన పాలక, ప్రతిపక్ష నేతలు తమ విశాలహృదయాన్ని మరోమారు చూపిస్తూ  అభివృద్ధి మొత్తం కోస్తాలోనే కేంద్రీకరించారు. ఇపుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ పేరుకే భాగమని, రాయలసీమను అన్ని రకాలుగా నిర్లక్ష్యం చేస్తూ, పరిశ్రమలు, ఐ.టి. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఇంకా అనేక సంస్థలు అమరావతిలోనే ఏర్పాటు చేస్తూ ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు వాపోతున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు సీమ బిడ్డడే !      

 

రాయలసీమలో పుట్టి పెరిగి, ఇక్కడే చదువుకొని, 1978 నుండి (83-89 మినహా) ఇక్కడ నుండే శాసనసభ్యుడుగా గెలుస్తూ, రాష్ట్ర చరిత్రలో అధిక కాలం ముఖ్యమంత్రిగా( 1996నుండి 2004 వరకు, 2014 నుండి ఇప్పటి వరకూ) పని చేసిన ఘనత చంద్రబాబుదే.  రాయలసీమ వాసి కాకపోయినా ఎన్.టి.రామారావు సీమపై చూపిన ప్రేమ కానీ, సీమవాసిగా వై. యస్ రాజశేఖర్ రెడ్డి చూపిన శ్రద్ద కానీ చంద్రబాబు ఈ ప్రాంతంపై చూపలేదనే అపప్రధ మూట కట్టుకున్నారు.

ఇప్పుడు కూడా ఆయన రాయలసీమ కడగండ్లు  పట్టించుకోవడం లేదని, నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడానికి శ్రద్ద చూపడంలేదని, కేటాయించిన నీళ్లు సరఫరా చేయాడానికి చర్యలు తీసుకోవడంలేదని, ఆయన “మానసపుత్రికగా ఉన్నకోస్తా ప్రాంతంలోనే” అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని  సీమవాసులు వాపోతున్నారు.

ఇక్కడ బ్రతుకు భారమై జీవన పోరాటానికి వలసలు వెళుతున్న రాయలసీమ వాసుల పట్ల ముఖ్యమంత్రి తీరని వివక్ష చూపుతున్నారనే  ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధిని వికేంద్రీకరించాలని, రాయలసీమను మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు, నీళ్లు, విద్యాసంస్థలు కేటాయించాలని కోరుతూ రాయలసీమ ముద్దుబిడ్డ చంద్రబాబు స్వయంగా ఉద్యమిస్తే తప్ప తమ కడగండ్లు తీరవని సీమవాసులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తన జన్మభూమి ఋణం తీర్చుకుంటారని వారు ఆశిస్తున్నారు.