రాష్ట్రాన్ని వణికిస్తున్న మొంథా తుఫాన్ దృష్ట్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అలసత్వం చూపకూడదని, ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడా ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి రూ.3,000 నగదు సాయం, 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలన్నారు. అక్కడ ఉండే ప్రజలకు నాణ్యమైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
వైద్య బృందాలు ముందస్తుగా ఏర్పాటై ఉండాలని, అవసరమైతే మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు ప్రత్యేక ఇంఛార్జ్‌లను నియమించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, డ్రైనేజీ వ్యవస్థను సమర్థవంతంగా పర్యవేక్షించాలన్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి విద్యార్థుల భద్రతను నిర్ధారించాలన్నారు. వాలంటీర్లను కూడా రక్షణ చర్యల్లో భాగం చేయాలని సూచించారు. “ప్రజల ప్రాణాలు, ఆస్తి రక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం సహించం. మానవ ప్రయత్నంలో ఒక్క చీలిక కనిపించకూడదు” అని సీఎం తేల్చిచెప్పారు.
జిల్లాల పరిస్థితులపై కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు, నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ అన్ని రక్షణ చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. చెరువులు, కాలువలు ఎక్కడా తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆర్టీజీఎస్ ద్వారా అందుతున్న సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. కొండప్రాంతాలైన విజయవాడ, మంగళగిరి, విశాఖపట్నం ప్రాంతాల్లో కొండచరియలు జారిపడే ప్రమాదం ఉండవచ్చని హెచ్చరించి, ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు.
ప్రజలు తుఫాన్ సమయంలో బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ, తుఫాన్ అనంతరం పునరావాసం, పునర్నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని సూచించారు. “మొంథా తుఫాన్ అనుభవం భవిష్యత్‌లో వచ్చే తుఫాన్లకు ఒక మోడల్‌గా నిలవాలి. ప్రభుత్వ యంత్రాంగం అందరూ ఒకే లక్ష్యంతో పని చేయాలి,” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ పరిస్థితిపై నిత్యమూ పర్యవేక్షణ కొనసాగుతుందని, ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే దిశగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.
