AP Ration Cards: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సులు.. ఎప్పటి నుంచి అంటే..!

బుధవారం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రివర్గం చర్చించి ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆమోదం తెలిపింది.

అలాగే, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం కీలకంగా స్పందించింది. పేదలకు న్యాయం చేసే ఉద్దేశంతో ఆగస్టు 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చ జరిగిందని సమాచారం. సమయావేశంలో కొత్త బార్ పాలసీ, టూరిజం హాస్టళ్ల ప్రైవేటీకరణ, విద్యుత్ సబ్సిడీలు, మావోయిస్టు కార్యకలాపాలపై నిషేధం వంటి అనేక అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ప్రత్యేకంగా నాయీ బ్రాహ్మణలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం సామాజిక న్యాయం పరంగా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అదే విధంగా, టూరిజం అభివృద్ధి పేరుతో 22 హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక తిరుపతిలో ఓబరాయ్ హోటల్ కోసం కేటాయించిన టీటీడీ భూమిని వెనక్కి తీసుకునే నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకున్నారు. ఈ భూమిపై గతంలో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు, రూ.7,500 కోట్ల రుణానికి ఏపీఐఐసీకి అనుమతి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం రూ.900 కోట్లకు బ్యాంక్ గ్యారంటీలు, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతులు వంటి అంశాలపై కూడా అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. మావోయిస్టు పార్టీ, ఆర్‌డీఎఫ్ కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధం కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం కూడా భద్రతాపరంగా కీలకంగా నిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వరుస నిర్ణయాలు ఎన్నికల హామీల అమలుపై ఎంతగానో దృష్టి పెట్టిందన్న సంకేతాలను ఇస్తున్నాయి. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే విధంగా తీసుకున్న చర్యలు, రాజకీయంగా కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.