విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ నందు అగ్నిప్రమాదం జరిగి పది మంది కోవిడ్ రోగులు చనిపోయిన ఘటన పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హోటల్ నందు క్వారంటైన్ సెంటర్ నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్ యాజమాన్యం పై ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ ను ప్రధాన నిందితుడిగా ప్రభుత్వం కార్నర్ చేసింది. దర్యాప్తు బృందాలు సైతం పరారీలో ఉన్న రమేష్ ఆచూకీ తెలిపితే లక్ష నజరానా ప్రకటించారు. దీంతో విషయం పెద్దదైంది. డాక్టర్ రమేష్ పేరున్న వ్యక్తి కావడం, రాజకీయ నాయకులతో పరిచయాలు కలిగి ఉండటంతో ఆయనకు కూడ మద్దతు పెరిగింది.
అక్కడ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం క్వారంటైన్ సెంటర్ నడపడానికి ముందే ప్రభుత్వం నడిపింది. ఇకవేళ అప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ప్రభుత్వం మీద కేసు పెట్టేవారా, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం తప్పేమీ లేదా, నిర్వహణ బాధ్యత వారిదే కదా అంటూ ప్రభుత్వం, పోలీసుల మీద విమర్శలు వెల్లువెత్తాయి. డాక్టర్ రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేసిన న్యాయస్థానం స్వర్ణ ప్యాలెస్ నందు క్వారంటైన్ సెంటర్ నడపడానికి అనుమతులిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా వైద్యాధికారి కూడా ప్రమాదానికి బాధ్యులే కదా, వారిని కూడ నిందితులుగా చేరుస్తారా అంటూ ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ మీద, విచారణ మీద స్టే ఇచ్చింది.
న్యాయస్థానం అడిగిన ప్రశ్నలో అర్థం ఉంది. భద్రతా ప్రమాణాలు చూడకుండా అనుమతులిచ్చిన అధికారులది కూడ తప్పే కదా అనడం భావ్యమే. కానీ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం మీద తదుపరి విచారణ జరపకూడదని ఆదేశించింది. అంటే అనుమానితులు అందరూ పూర్తిగా గుర్తుంపబడేవరకు అందుబాటులో ఉన్న ఆ కొందరు అనుమానితులను విచారణ చేయకూడదా అనేది ప్రభుత్వం వాదన. అందుకే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. న్యాయంగానే అనిపిస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీం కోర్టులో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.