చంద్రబాబు సొంత జిల్లా అంతే సంగతులా?

 
 
(వి. శంకరయ్య )
 
 
ఎన్టీఆర్ జీవించి వుండగా 1994 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగుర వేసిన దరిమిలా 1999 నుండి 2014 ఎన్నికల వరకు మెజారిటీ స్థానాలు దక్కించు కోలేదు. ఆ మాట కొచ్చితే ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గం చంద్రగిరి లో1999 నుండి ఇప్పటి వరకు టిడిపి అభ్యర్థి గెలుపొందలేదు.
 
1999 లో 15 స్థానాలకు గాను   ఆరు    స్థానాలు   2004 లో 15 స్థానాలకు గానుఅయిదు స్థానాలు 2009లో 14 స్థానాలకు ఆరు స్థానాలు 2014 లో కేవలంఆరుస్థానాలలోనే టిడిపి గెలుపొందింది. 2019 లో కూడా ఇంతకు మించి ఫలితాలు వుండ వేమో. . రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రెండేసి రోజుల గడిపి సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా ఊసు ఇంత వరకు ఎత్తుకోలేదు. రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినా పెద్దగా ఫలితం దక్కే సూచనలు లేవు. ఈ దఫా చంద్రగిరి డోలాయ మానంలో వుంది. కాంగ్రెస్ అభ్యర్థి గా మూడు దఫాలు వరసగా చంద్రగిరిలో గెలుపొందిన అరుణ కుమారి 2014 లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తన ఓటమికి టిడిపి నేతలే కారణ మని ముఖ్యమంత్రికి నివేదించినా ఫలితం దక్కక పోవడంతో ఈ దఫా పోటికి తిరస్కరించి నట్లు ప్రచారం లో వుంది. . తనకు అపకారం చేసిన వారిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరితే వారిపై చర్య తీసుకుంటే పార్టీనుండి పంపి వేస్తే వచ్చే ఎన్నికలకు ఎట్లా అని ముఖ్యమంత్రి వేసిన ఎదురు ప్రశ్న జీర్ణించుకోలేక అసలు పోటీ నుండే తప్పు కున్నారని ఆమె అంతరంగికులు చెబుతున్నారు. పైగా ప్రస్తుత అభ్యర్థి నాని నియోజకవర్గానికి కొత్త. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య సమన్వయం అంతంత మాత్రమే. పైగా వైసిపి ఎమ్మెల్యే గెలిచి నప్పటి నుండి ప్రజల మధ్య వుండగా టిడిపి అభ్యర్థి ప్రస్తుతం నియోజకవర్గంలో తిరుగు తున్నారు. టిడిపికి ఇదొక ప్రయోగం మాత్రమే.
 
అదే విధంగా పీలేరులో టిడిపికి ఎదురు గాలులు మొదలైనవి. కొత్త నీరు వచ్చి పాత నీరును తుడిచి పెడుతోంది. పలువురు పార్టీ వదలి వెళ్లారు. ముద్దు కృష్ణమ నాయుడు ఏ లోకంలో వున్నారో ఏమో గాని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రస్తుత పీలేరు టిడిపి అభ్యర్థి పై చేసిన ఆరోపణలు ప్రజల మది
నుండి ఇంకా తొలగి పోలేదు. రాజకీయాలలో నీతి నియమాలు వుండ వనేందుకు ఇది చక్కటి ఉదాహరణ.ఇదిలా వుండగా కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని బట్టి కాస్త మెరుగైన ఫలితాలు వుంటాయేమో. . అంతేకాకుండా వైసిపి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పై పెద్దగా ఆరోపణలు లేవు. చంద్రగిరి లాగే పీలేరు కూడా టిడిపికి మరో ప్రయోగం మాత్రమే.
 
జిల్లా పశ్చిమ నియోజకవర్గాలైన తంబళ పల్లి టిడిపి ఎమ్మెల్యే పై ప్రజల విషయం అటుంచగా టిడిపి కేడర్ లోనే సదభిప్రాయం లేదు. పైగా కొత్తగా అనువైన అభ్యర్థి లేరు. ప్రతి పక్షం సంగతి అటుంచగా స్వ పక్షంలోనే పూడ్చ లేని బలహీనతలు వున్నాయి. ప్రజలకు అందుబాటులో లేరనే అభియోగముంది. 
 
మరో నియోజకవర్గం మదనపల్లె. టిడిపి మూడు చీలికలు ఆరు పేలికలుగా వున్నది.వీరి పంచాయతీ అమరావతి వరకు వెళ్లింది. ప్రత్యర్థి వైసిపి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో వుండ రనే బలహీనతలు వున్నా టిడిపి కి స్వ పక్షంలోనే సమన్వయం లేనపుడు ఫలితం ఏలా వుంటుందో ఊహించ గలం. అయితే ఎమ్మెల్యేను పక్కన బెడితే వైసిపికి పార్టీ పరంగా వున్న బలం టిడిపికి వున్న బలహీనతలు నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశముంది.
 
ఇక పుంగనూరు లో రామచంద్రారెడ్డి దారి రహదారి గా వుంది. ముఖ్యమంత్రి తరచూ చేసే ప్రయోగాల వైఫల్యాలకు ఈ నియోజకవర్గం మరో నిదర్శనం.సునిశితంగా పరిశీలించితే మరదలు పుంగనూరులో బావ అమర నాథ రెడ్డి పలమ నేరులో పోటీ చేయడం టిడిపి కి రెండు చోట్ల మైనస్ గా మిగిలి పోతుందేమో. ఈ రెండు నియోజకవర్గాల్లో పాత నీరు ఎగదన్నితే కొత్త నీటి ప్రవాహానికి అడ్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రామ కృష్ణ రెడ్డి కుటుంబ మంతా ఏదో ఒక చోట కేంద్రీక రించి పనిచేసితే ఫలితం వుంటుందేమో. ఆ కుటుంబంలో కూడా ఐక్యత లేదనే వార్తలు టిడిపి కి పెను సవాలే. నెలలో ముఖ్యమంత్రి నాలుగైదు మార్లు వచ్చే తిరుపతి – టిడిపి కి అతి క్లిష్టంగా వుంది. స్థానిక టిడిపి ఎమ్మెల్యే పై కన్నా గిల్లుడు బాగా ఖరాబు చేయడం పెద్ద మైనస్. పైగా లెక్కకు మించి ముఠాలు. ఇవన్నీ అటుంచి తిరుపతి యే కాదు. ఎచ్చటైనా కులం 2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే నేపథ్యంలో అయితే గియితే వైసిపి లేదా జనసేన మెజారిటీ ఓట్లు గల కులానికి చెందిన నేతను రంగంలోకి దింపితే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అదే కులానికిచెందిన టిడిపి అభ్యర్థి రెండు మూడు స్థానాలకు దిగ జారు తారేమో. 
 
అయితే ఈ నియోజకవర్గంలో మేధావులు చదువు కున్న వారు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా వున్నందున వారి వైఖరితో పాటు వారు బూతుల వద్దకు వచ్చే పరిస్థితి బట్టి జయాపజయాలు వుంటాయి. ఇచ్చట వైసిపి నేత కరుణాకర్ రెడ్డి కి బలమైన అనుచర గణంవుంది. పిలిస్తే వెంటనే స్పందించే తీరు పెద్ద ప్లస్. 
మరో కీలక నియోజకవర్గం నగరి. ఈ నియోజకవర్గంపై ఎక్కువ గా ముఖ్యమంత్రి కేంద్రకరించే అవకాశం వున్నా క్షేత్ర స్థాయి పరిస్థితి బాగా లేదు. ముద్దు కృష్ణమ నాయుడు లేని లోటు ఇచ్చట టిడిపిని కుక్కలు చింపిన విస్తరి చేసింది. ఆయన కుమారులు మధ్య వున్న పోరు తుదకు పలు వర్గాలపోరుకు దారి తీసింది.
 
ఇదిలా వుండగా మాజీ ఎమ్మెల్యే చెంగారెడ్డి ఎప్పుటి నుండో ప్రజల మధ్య వున్నా కాంగ్రెస్ టిడిపి పొత్తు పొడిచిన తర్వాత వాతావరణం మారింది. భాను ప్రకాష్ అంశం జటిలంగా వుండగా మధ్య లో చెంగారెడ్డి ఛాన్స్ కొట్టేసితే పలు వర్గాలు గా చీలిపోయి వున్న టిడిపి నేతల తీరు రోజా ఓటమికి ఉపకరించు తుందా? లేక ఫలితం ఏలా వుంటుందో ప్రస్తుతం వైసిపి లో వున్న చక్ర పాణి రెడ్డి వైఖరి బట్టి కూడా అంచనాకు రాగలం. చెంగారెడ్డి అభ్యర్థి అయి టిడిపి నేతలతో పాటు చక్ర పాణి రెడ్డి ఏకంగా పని చేస్తే రోజా నెట్టుకు రావడం కష్టమే. ఇది ఎంత వరకు సాధ్యమో భవిష్యత్తు తేల్చవలసివుంది. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం మేరకు కాంగ్రెసు టిడిపి పొత్తు వుంటే నగరిలో చెంగారెడ్డి కి కర్నూలు లో యంపి అభ్యర్థి గాసూర్య ప్రకాష్ రెడ్డి కి తిరుపతి యంపి సీటుకు చింతామోహన్ కు కాంగ్రెసు పట్టు పడుతుందట.
అయితే ఫైర్ బ్రాండ్ గావుండే రోజా వైసిపి శ్రేణులను ఏక తాటి పైకి నడిపించాలసి వుంది
ఇక తూర్పు ప్రాంతంలో కాళహస్తి సత్య వేడు నియోజకవర్గాలలో టిడిపి గెలుపు ఓటములు తామ రాకు పై నీటి బొట్టు లాగా వుంది. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైఖరిపై ఆధార పడివుంటుంది. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అనారోగ్యం వయసు పై బడకుంటే శ్రీ కాళహస్తి పరిస్థితి వేరుగా వుండేది. పరిస్థితి ఆయన చేయి దాటి పోయింది. ఆయన వారసుడు సుధీర్ రెడ్డి ఈ నాలుగేళ్ల కాలం సద్వినియోగం చేసుకోలేక పోయారు. . ఫలితంగా ఎస్సీవీ నాయుడు తెర మీదకు వచ్చారు. అంతేకాకుండా ఆయన ప్రభావం సత్య వేడులో కూడా వున్నందున టిడిపి అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి తోడుఎస్సీవీ నాయుడువైఖరి బట్టి ఈ రెండు నియోజకవర్గాలో టిడిపి అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడుతాయి. సత్య వేడు టిడిపి అభ్యర్థి మార్పు తిరుగు లేని నిజం. అదేమో గాని ప్రతి దఫా ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిని మార్చు తోంది. 
 
జిల్లాలో మరొక రెండు రిజర్వుడు నియోజకవర్గాలో కూడా 2014 ఎన్నికల్లో టిడిపి అపజయం పాలైంది. ఇందులో పూతల పట్టు స్థానంలో టిడిపి ఓటమి చెందే పరిస్థితులు లేకున్నా వర్గ పోరులో అభ్యర్థి ఓటమి పాలైనారు. రేపు టిడిపి అభ్యర్థితో పాటు స్థానిక నేతల మధ్య సమన్వయం బట్టి ఫలితాలు వుండ నున్నాయి. ఈ నియోజకవర్గంలో టిడిపి ఓటు బ్యాంకు ఎంత వాస్తవమో దళిత ఓటు బ్యాంకు అంతే వాస్తవం. బాలెన్స్ ఏలా మొగ్గు తుందో పలు అంశాలపై ఆధారపడుతుంది. మరో రిజర్వుడునియోజకవర్గం గంగాధర నెల్లూరు కూడా గత ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో టిడిపి కి చెంది బలమైన ఓసికి చెందిన నేత ఎవరూ లేక పోగా టిడిపి టికెట్ ఆశించే తల్లి కొడుకుల పోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశముంది. వైసిపి ఎమ్మెల్యే నారాయణ స్వామికి వున్న  కేడరు పైగా బలమైన దళిత వాడలు వుండటం టిడిపి కి మైనస్ పాయింట్.
 
జిల్లా కేంద్రం చిత్తూరులో టిడిపికి ఎదురీత తప్పదు. ప్రస్తుతం ఎమ్మెల్యే సత్య ప్రభ ఈ దఫా పోటీ చేసే అవకాశం లేదు. అప్పుడే ఆమె కొడుకు శ్రీ నివాస్ పేరు నలుగు తున్నా మేయర్ దంపతుల హత్య సందర్భంగా టిడిపి నాయకత్వం తీసుకున్న వైఖరితో 2014 లో టిడిపి లభించిన ఓటు బ్యాంకు నేడు చిన్నా భిన్న మైనది. కాగా అదే కులానికి చెంది వైసిపి అభ్యర్థి వుండటం వలన ఎదురీద వలసినదే. దీనికి తోడు సికె బాబు గాని సతీ మణి ఎవరో ఒకరు పోటీలో వుండటంతో తమిళ ఓట్లుతో పాటు రెడ్డి కులం దాని ప్రాబల్యం కింద వుండే ఓటు బ్యాంకు  కలిసి సికె బాబు వ్యక్తి గత ఓట్లు చీలి పోతే టిడిపి ఎక్కుడ వుంటుందో చెప్పలేము. 2014 లో టిడిపి కన్నా ఆదికేశవులు నాయుడు పేరు మీద ఆమె గెలుపొందారు. ఈ దఫా ఆ గాలి లేదు.
 
ఇక మిగిలింది – కుప్పం. ఈ రోజు ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక్కటే  జిల్లాలో టిడిపి గెలుపొందే స్థానంగా వుంది. అయితే స్థానిక నేతలు స్వార్థంతో చేసిన ఖరాబు అంతా ఇంతాకాదు. ఫలితంగా ముఖ్యమంత్రి అమలు చేసిన పథకాలు ఆయన ప్రతిష్ట ద్వితీయ తృతీయ శ్రేణులు నీరు కాల్చాయి.ఫలితంగా ఓట్లు గుద్ది వేసుకుంటే తప్ప ముఖ్యమంత్రి ఆశించే మెజారిటీ రావడం కష్టం. చిత్తూరు పార్లమెంటు స్థానం భవితవ్యం ఇంత వరకు కుప్పం మెజారిటీ నిర్దేశించించేది. రేపు ఏమౌతుందో చూడాలి. దురదృష్టం ఏమంటే ఈ నాలుగు ఏళ్ల కాలం జిల్లాకు చుక్క నీటి బొట్టు సాగుకు ఇవ్వలేక పోవడం పని చేస్తున్న చక్కెర కర్మాగారాలు శాశ్వతంగా మూతపడటం టిడిపి కి  నాలుగైదు నియోజకవర్గాలో తీవ్ర మైన ప్రభావం చూపనున్నది. ఎన్ని సెల్‌ఫోన్ల కంపెనీలు పెట్టినా వీటి ముందు దిగ దుడుపే. ఇక చిత్తూరు విజయ డెయిరీ విషాద గాధ తెలుగు దేశం పార్టీని నీడ లాగా వెన్నాడుతూనే వుంది.ఇది ఈ నాటి కథ కాదు. ఇవన్నీ అటుంచి పరిశ్రమలపేర జిల్లా అధికారులు సాగించిన భూసేకరణ టిడిపి కి యమ పాశంగా తయారైంది. మరో వైపు భూసేకరణలో వాస్తవ లబ్ది దారులు ఘోరంగా దెబ్బ తినగా మధ్యలో టిడిపి నేతలు కోట్లు జేబులు నింపు కున్నారు. ఒక్క శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 30 వేల ఎకరాలు సేకరించారు. పేదలు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి చిన్న సన్నకారు రైతుల కడుపు కొట్టారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అధికారులు బుల్ డోజర్ పద్దతి చేపట్టారు. రేపు ముఖ్యమంత్రి ముడ్డి కిందకే అధికారుల దుందుడుకు చర్యలు దారి తీయ నున్నాయి. అభివృద్ధి వేరు. అధికారుల బెదిరింపు వేరు. టిడిపి నేతలకు నోరు విప్పే ధైర్యం లేదు గాని భూసేకరణ విధానం యమ గండంగా మిగల నున్నది.
 
ప్రస్తుతం జిల్లా తూర్పు ప్రాంతంలో రైతులు కువ కువ లాడి పోతున్నారు. ఈ ఏడు కృష్ణ నది జలాలు సోమ శిలకు 50 టియంసిలు తరలించారు. మంచిదేనని ఈ ప్రాంత రైతులు ఆశించారు. కానీ తెలుగు గంగ లో భాగంగా శ్రీ కాళహస్తి సత్య వేడు నియోజకవర్గాలో రైతులకు చుక్క నీరు ఇవ్వలేదు. మరీ బాధాకరమైన అంశమేమంటే పెట్టిన పంటలు ఎండి పోతుంటే ఒక్క టిడిపి నేత నోరు విప్పిన పాపాన పోలేదు. పెట్టిన పంటలను పశువులచే మేపించే ఫోటోలు మీడియాలో వస్తున్నాయి. రేపు ఏ ముఖం పెట్టుకుని టిడిపి నేతలు ఓట్లు ఈ ప్రాంతంరైతులను అడగు తారో చూడాలి. అన్న క్యాంటిన్ లు ప్రతి మహిళకు సెల్‌ఫోన్లు ఇచ్చిఎంత వరకు ఓటర్లను  సంతృప్తి పరుచు తారోకూడా చూడాలి. లేదా ఓటుకు వేయి రెండు వేలు ఇస్తారేమో. 
 
 నెలకు నాలుగైదు మార్లు ముఖ్యమంత్రి తిరుపతి కి రావడం ఏదో ఒక కంపెనీకి పునాది రాయి వేసి ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పే మాటలు ఏ మేరకు ఓట్లు రాబడు తాయోకూడా చూద్దాం.
 
(రచయిత శంకరయ్య, రాజకీయ వ్యాఖ్యాత ఫోన్, 9848394013 )