చిన్న చిన్న అలలు కాకుంటే అప్పుడప్పుడు పడి లేస్తుండిన కెరటాలతో వుండిన సరోవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే పెద్ద పెద్ద బండ రాళ్లు వేయడంతో వాయు గుండంగా ప్రారంభమై ప్రస్తుతం పెను తుఫానుగా మారింది. ఇది ఏ ప్రాంతంలో ఏ తీరం దాటి ఎవరి కొంపలు కూల్చుతుందో ఇప్పుడే చెప్పలేము. మూడు రాజధానుల ప్రతి పాదన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చి వేసింది. ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అధికారం చేపట్టిన తొమ్మిది నెలలకే పోలీసుల కవాతులు 144 సెక్షన్ లు అమలు చేయవలసిన అత్యవసర పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఇది ఏ అధికార పార్టీకి అంత మంచిది కాదు. ఇదిలా వుండగా మొన్నటి వరకు చే గువేరా తరిమెల నాగిరెడ్డి తనకు ఆదర్శ ప్రాయులుగా చెబుతుండిన పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిమానిగా మారి పోయారు. తుదకు బిజెపి జనసేన పార్టీల మధ్య పొత్తు ఏర్పడింది. భవిష్యత్తులో ఇంకేమైనా కావచ్చు. చంద్రబాబు నాయుడు కూడా తను బిజెపితో తెగతెంపులు చేసుకోవడం తప్పుగా అంగీకరించి బిజెపి జనసేన పొత్తును ఆహ్వానించారు.
భవిష్యత్తులో మరేమైనా సంభవించ వచ్చు నేమో .
మరో ముఖ్య మైన పరిణామమేమంటే మూడు రాజధానుల ప్రతి పాదనను రాష్ట్రంలో వుండే అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు మౌనంగా వుండిన మార్క్సిస్టు పార్టీ కూడా అమరావతిలోనే రాజధాని వుండాలని డిమాండ్ చేసింది. పర్యవసాన మేమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రికి రాజకీయంగా ఒక్క మిత్రుడు లేక పోవడమే. రాజకీయంగా ఇది మంచిది కాదు. తుదకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెలిమి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా మజ్లిస్ పార్టీని వదల పెట్టడం లేదు. అంతేకాదు. కాంగ్రెస్ నేతగా వుండిన రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికల ముందు వామపక్షాలతో చెలిమి చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
రాజకీయ పార్టీలు వైఖరులు ఇలా వుంటే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల నుండి లభ్యమయ్యే సానుభూతి సహకారాల అంశంలో కూడా భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఈ పాటికే ప్రాంతాల మధ్య గల అసమానతలతో అంతరాలు వుండగా మూడు రాజధానుల ప్రతి పాదన మరింత అగ్గి రగలేసింది. మూడు ప్రాంతాల ప్రజలను సంత్రుప్తి పర్చబోయి ప్రజల మధ్య మరింత ద్వేషాలు నెలకొనే ప్రమాద ముంది. చారిత్రక ప్రాధాన్యత గల శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలని సీమ వాసులు చిర కాలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో హైకోర్టు నెల కొల్పాలని ఆందోళనలు జరిగాయి. ప్రస్తుతం మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా సీమకు హైకోర్టు ప్రకటించినా సీమ వాసులు అంతటితో సంత్రుప్తి పడే అవకాశం కన్పించడం లేదు. విశాఖకు రాజధాని అనగానే సీమలో తమకూ రాజధాని కావాలనే వాదన తెరపైకి వచ్చింది. ఒక వర్గం సీమకు సమానావకాశాలు కావాలని కోరు తుంటే మరి కొందరు విశాఖ కన్నా సీమ బాగా వెనుకబడి ప్రాంతం కాబట్టి తమకే రాజధాని అనే వాదన తెర మీదకు తెచ్చారు. . దీనికి తోడు కొత్త శక్తులు రంగ ప్రవేశం చేసి రాజధాని ఇస్తారా? లేక ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా? అనే సవాళ్లు విసురు తున్నారు.
మొన్నటి ఎన్నికల్లో సీమలో 52 శాసన సభ స్థానాలు వుంటే వైసిపికి 48 స్థానాలు దక్కాయి. మరి రాజధాని కావాలని అడగని విశాఖలో రాజధాని పెడితే సీమ ప్రజల్లో తనకున్న ప్రాబల్యం ముఖ్యమంత్రి నిలుపు కోవడం కత్తి మీద సామే.మొన్నటి ఎన్నికల్లో కృష్ణ గుంటూరు జిల్లాలో కూడా ఒక సామాజిక వర్గం బలంగా వున్నా వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. ప్రస్తుతం ఈ జిల్లాలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటు తున్నాయి. రాజధాని మార్పు అంశంలో ఉద్యమం ఈ జిల్లాలోనే సాగుతున్నా విశాఖకు రాజధాని మార్పు జరిగిన తర్వాత దూరంగా వుండే జిల్లాలో కూడా మున్ముందు ప్రజల నుండి వైసిపి వ్యతిరేక ఎదుర్కోవలసి వుంటుంది. తుదకు సీమ ప్రాంతాల్లో కూడా ఇది సమస్యే. దీనికి తోడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం పెను గండమే.
కాకుంటే ఇంత కాలం చంద్రబాబు నాయుడు అనుసరించిన ఏక పక్ష విధానాలు చూపెట్టి ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నం చేయడ మొక్కటే మిగిలి వుంది. అదీ కూడా దీర్ఘకాలికంగా పని చేయదు. ప్రజలు జీవితాలను రూపాయలు పైసల్లో చూస్తారు. దురదృష్టం ఏమంటే ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నగదు బదలీ పథకాల పలుకుబడి కూడా రాజధాని తుఫాన్ లో కొట్టుకు పోతోంది.
ఎందుకంటే భావోద్వేగాల వైరస్ అటువంటిది. ఇదిలా వుండగా విశాఖ రాజధాని చేయడం వలన ఉత్తరాంధ్రలో కూడా భిన్నాభిప్రాయాలు వున్నాయి. అయినా ఆ ప్రాంతంలో పొందే రాజకీయ ప్రయోజనాలకన్నా సీమలో రోజు రోజుకూ మారుతున్న మార్పులు కోస్తా జిల్లాల్లోని ఎదురు గాలులు దృష్టిలో పెట్టుకొంటే మొన్నటి ఎన్నికల్లో లభ్యమైన అండదండలు ముఖ్యమంత్రి ఎక్కువ పోగొట్టు కుంటారేమో.. దీనికి తోడు జనసేన బిజెపి సమైక్య పోరాటం వైసిపికి సంకటమే. . వాస్తవంలో మొన్న లభ్యమైన బలాన్ని అన్ని ప్రాంతాల్లో సుస్థిరం చేసుకోవలసినది పోయి ప్రాంతాల విభజన ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో కొంత నష్టం పోయే ప్రమాదం వైసిపి తెచ్చి పెట్టుకొంది. .
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013