తెలంగాణలో “కంటి వెలుగు”

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమం చేపడుతుంది. ఆగష్టు 15 మద్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కంటి వెలుగు పథకంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 3.70 కోట్ల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 799 బృందాలను కంటి వెలుగు పరీక్షలు నిర్వహించడానికి సిద్దం చేశారు. ప్రతి బృందంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఆప్తోమెట్రిస్ట్, ఏఎన్ ఎం తదితరులు ఉంటారు. ఇప్పటికే కావాల్సిన మందులు సిద్దం చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. 35 లక్షల కంటి అద్దాలు సిద్దం చేసి జిల్లాలకు పంపారు. అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆస్పత్రులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు.