‘2.0’లో అక్షయ్‌లా మారాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి

ఈ వారంలో రిలీజ్ కాబోతున్న రజనీ చిత్రం ‘2.0’ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహించారు. అక్షయ్‌ కుమార్‌ విలన్ పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సినిమాను నిర్మించింది. ముఖ్యంగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గెటప్ గురించే అంతటా చర్చ. చాలా డిఫెరెంట్ లుక్ తో ఆయన ఈ సినిమాలో కనిపిస్తారు. అక్షయ్‌ ఆ గెటప్‌ను ధరించడానికి ఎంత కష్టపడ్డాడో కూడా ఇప్పటికే మేకర్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

అయితే ఆ గెటప్‌లో మనని మనం చూసుకోవటానికి, అక్షయ్‌ పడినంత కష్టం మనం పడనక్కర్లేదు.. అక్షయ్‌ సోషల్‌మీడియాలో షేర్‌చేసిన లింక్‌ను క్లిక్‌ చేస్తే మనం కూడా ఆ గెటప్‌లోకి మారొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ..‘‘ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నేను స్కూల్ కు వెళ్లి నటన నేర్చుకున్నట్లు ఉంది. నా ప్రిన్సిపల్‌ శంకర్‌ సర్‌. గత 28 ఏళ్లుగా నేను ఈ చిత్ర పరిశ్రమలో ఉన్నాను. ఇన్నాళ్లూ నేర్చుకోని ఎన్నో విషయాలు ఈ సినిమా ద్వారా నేర్చుకున్నా. ఈ సినిమాలో, సూపర్‌స్టార్‌ రజనీ సర్‌తో నటించే అవకాశం ఇచ్చిన శంకర్‌కు నా ధన్యవాదాలు. ఈ సినిమా స్క్రిప్టు విన్నప్పుడు రజనీ విలన్‌గా ఆయనతో తన్నులు తినడమే నాకు గొప్ప గౌరవంగా భావించా. ఈ సినిమాను నేనూ ఇంత వరకూ చూడలేదు. మీలాగే నేను ఎదురుచూస్తున్నా’’ అని అక్షయ్‌ అన్నారు.

దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. శాటిలైట్‌, డిజిటల్‌ తదితర హక్కుల ద్వారా ఇప్పటికే ఈ చిత్రం రూ.370 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. నవంబరు 29న ఈ చిత్రం విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు.