ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ ఆ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తాను ఇకపై తన మిత్రుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని వీడటానికి గల కారణాలను ఓవీ రమణ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రస్తుత టీడీపీ నాయకత్వ శైలి, పార్టీలోని ఒంటెద్దు పోకడలు తనకు నచ్చలేదని, అందుకే తీవ్ర అసంతృప్తితో పార్టీకి గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో తన మిత్రుడు విజయసాయి రెడ్డికి పూర్తి అండగా నిలవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి నవంబర్ 11న నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో తాను చేరుతున్నట్లు ఓవీ రమణ స్పష్టం చేశారు.
గత నెలలో విజయసాయి రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఓవీ రమణ ఆయనతో కలిసి ఉన్నారు. ఆ సమయంలోనే తామిద్దరం గతంలో నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, విజయసాయి రెడ్డి తనను కొత్త పార్టీలోకి ఆహ్వానించారని, ఆ ఆహ్వానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని రమణ వెల్లడించారు. తిరుపతి రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న ఓవీ రమణ గతంలో బీజేపీలోనూ పనిచేశారు. ఆ తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చి యాక్టివ్‌గా ఉన్న ఆయన, ఇప్పుడు హఠాత్తుగా సైకిల్ దిగి విజయసాయి రెడ్డి కొత్త పార్టీ వైపు అడుగులు వేయడం తిరుపతితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.