ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నగరమైన విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. 2014లో విజయమ్మ ఓటమి, 2019 జగన్ వేవ్‌లోనూ నగర పరిధిలోని సీట్లను కోల్పోవడం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పరాభవం.. తాజాగా నిన్న వెలువడిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 13 వార్డులకే పరిమితం కావడం ఆ పార్టీ వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. విశాఖను ‘పరిపాలనా రాజధాని’గా మారుస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతగా నినదించినా, ఇక్కడి చైతన్యవంతమైన ఓటర్లు వైసీపీని పూర్తిగా తిరస్కరించడానికి దారితీసిన 5 ప్రధాన కారణాలు ఒక లుక్ వేద్దాం.
‘రాజధాని’ నినాదంలో ప్రాసెస్ లోపించడం – కేవలం పొలిటికల్ స్టంట్ గా భావించడం:
విశాఖను రాజధాని చేస్తామని వైసీపీ కేవలం ప్రకటనలకే పరిమితం చేసింది కానీ, దానికి తగ్గట్టుగా నగరంలో ఒక్క శాశ్వత మౌలిక సదుపాయాల ప్రాజెక్టును కూడా చేపట్టలేదు. అభివృద్ధి అంటే కేవలం బోర్డులు మార్చడం, కార్యాలయాల తరలింపు హడావుడి చేయడం కాదు అని భావించే విశాఖపట్నం ఐటీ, పారిశ్రామిక మరియు ఉద్యోగ వర్గాలు.. వైసీపీ వ్యూహాన్ని కేవలం అమరావతిని దెబ్బతీసేందుకు పన్నిన ఒక రాజకీయ ఎత్తుగడగానే చూశాయి తప్ప నగర శ్రేయస్సు కోసం కాదని గట్టిగా నమ్మాయి.
రుషికొండ విధ్వంసం – విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌కు గండి:
ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం నగరంలో రుషికొండను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి, అక్కడ అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించడం స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని తెప్పించింది. పర్యావరణ ప్రేమికులు, మేధావులు, సాధారణ పౌరులు సైతం ఈ రుషికొండ విధ్వంసాన్ని విశాఖపట్నం సహజ సౌందర్యంపై జరిగిన దాడిగా భావించారు. ఈ అంశం ఎన్నికల్లో వైసీపీకి పెద్ద మైనస్‌గా మారింది.
భూకబ్జాలు, దౌర్జన్య రాజకీయాలు – శాంతిభద్రతలపై ఆందోళన:
విశాఖపట్నం ప్రజలు సహజంగానే ప్రశాంత వాతావరణాన్ని, వివాద రహిత జీవనాన్ని కోరుకుంటారు. కానీ గత ఐదేళ్ల వైసీపీ హయాంలో నగరంలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, స్థానిక నేతల దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయనే ఆరోపణలు వచ్చాయి. దసపల్లా భూములు, హయగ్రీవ భూములతో పాటు అనేక ప్రైవేట్ స్థలాలపై జరిగిన వివాదాలు, బెదిరింపుల పర్వం నగరవాసులను భయభ్రాంతులకు గురిచేసింది. దీనితో నగర భద్రతకు కూటమి ప్రభుత్వమే కరెక్ట్ అని ప్రజలు ఫిక్స్ అయ్యారు.
ఐటీ, పారిశ్రామిక రంగాల పతనం – ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం:
చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖపట్నాన్ని ఒక ఐటీ, స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలను రప్పించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రశాంతత లోపించడంతో పాటు, ప్రభుత్వ విధానాల వల్ల అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు విశాఖను వీడి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. నూతన పెట్టుబడులు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడంతో నగరంలోని యువత, విద్యావంతులు వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు.
స్థానిక నాయకత్వ లోపం మరియు అంతర్గత కుమ్ములాటలు:
విశాఖపట్నం జిల్లాలో వైసీపీని నడిపించే బలమైన, ప్రజల్లో ఆదరణ ఉన్న స్థానిక నాయకత్వం కరువైంది. ఉత్తరాంధ్ర బాధ్యతలను స్థానికేతరులకు అప్పగించడం, పార్టీ సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విబేధాలు ముఠా రాజకీయాలకు దారితీశాయి. స్థానిక ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో ఘోరంగా విఫలమైన నాయకత్వం వల్లే, ఓటర్లతో కనెక్ట్ కాలేక వైసీపీ ఇక్కడ పూర్తిగా అట్టడుగుకు పడిపోయింది.
విశాఖపట్నం అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ ఎప్పుడూ కార్పొరేట్ మరియు డెవలప్మెంట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. కేవలం ఉచితాలు, రాజధాని సెంటిమెంట్ల పేరుతో మోసం చేయాలని చూస్తే ఇక్కడి జనం ఒప్పుకోరని 2014 నుండి తాజాగా నిన్నటి జీవీఎంసీ ఎన్నికల ఫలితాల వరకు స్పష్టమైంది. వైసీపీ తన తప్పులను సరిదిద్దుకుని, దౌర్జన్య రాజకీయాలను వీడితే తప్ప భవిష్యత్తులోనూ విశాఖపట్నంలో ఆ పార్టీ అడుగుపెట్టడం అసాధ్యమనే చెప్పాలి.