అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దారుణంగా దాడి చేసిన కేసులో.. నిందితుడు హేమంత్పై పోలీసులు జరిపిన కాల్పుల ఘటన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. ఈ ఎన్కౌంటర్ ఉదంతంపై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేస్తూ, రాప్తాడు పాఠశాల ఘటనలో అసలేం జరిగింది, నిందితుడిపై కాల్పులు ఎలా జరిగాయి అనే అంశాలపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, జరిగిన సంఘటనపై పూర్తి పారదర్శకత ఉండాలని, అసలు నిజాలు బయటకు రావడానికి సమగ్ర విచారణ అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. చట్ట పరిధిలోనే అన్నీ జరగాలని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, నిందితుడికి అనుకూలంగా పిల్ దాఖలు చేశారంటూ సోషల్ మీడియాలో తనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని పిటిషనర్ తరఫు కౌన్సిల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిల్లు దాఖలు చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని స్పష్టం చేసింది. న్యాయపరమైన ప్రక్రియను ప్రశ్నించే వారిపై ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదని పేర్కొంది. ఇది మైనర్ బాలికకు సంబంధించిన కేసు అయినందున, ఇది పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని కోర్టు గుర్తుచేసింది. అందువల్ల, ఈ కేసు వివరాలను రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా సంస్థలు తప్పనిసరిగా సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. మీడియా తమకు నచ్చినట్లుగా, ఎలా పడితే అలా కథనాలను ప్రసారం చేయడం లేదా రాయడం సముచితం కాదని న్యాయస్థానం హెచ్చరించింది.