ఈ ఏడాది మేలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు హీరో అల్లు అర్జున్. అనుకున్నంత స్థాయిలో విజయాన్నిసాధించలేకపోయింది ఈ సినిమా. ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయలేదు బన్నీ. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్రమ్ కే కుమార్, సురేందర్ రెడ్డిలతో కలిసి మూడు చిత్రాలకు బన్నీ ఓకే చెప్పినట్టు టాక్ వినిపించింది. అయితే బన్నీ ముందు ఏ దర్శకుడితో సినిమా తీస్తాడో అనే విషయంపై క్లారిటీ లేదు.
తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ విక్రమ్ కే కుమార్ సినిమాలో ముందు నటించటానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నిర్మాతలుగా నల్లమలుపు బుజ్జి, నాగ అశోక్ కుమార్‌లు ఉండనున్నారు. చిత్ర బృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. అఖిల్ తో విక్రమ్ కే కుమార్ ‘హలో’ మూవీకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తెలుగులో అల్లు అర్జున్ టాప్ హీరో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ కనుక హిట్ అయితే విక్రమ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది.