బెజవాడ ఏబీవీ ఓటమికి కారణాలు ఇవే..?

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విజయవాడ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. అయితే, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేవలం 12,642 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం వెనుక వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంక్ అనుకున్న స్థాయిలో పడకపోవడమే ప్రధాన కారణమనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

మేయర్ రేసులో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన ఏబీవీకి కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ, సిపిఎం వంటి వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. విజయవాడ నగరంలో కార్మిక వర్గాలు, పాత తరం ఓటర్లలో కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు కొంత సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. అయితే, ఈ ఓట్లు ఏబీవీ గుర్తుకు పడటంలో క్షేత్రస్థాయిలో తీవ్ర వైఫల్యం కనిపించింది. డివిజన్లలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ అభ్యర్థులు పెద్దగా పోటీలో లేకపోవడం, ఎక్కడైనా ఉన్నా మేయర్ స్థానానికి వచ్చేసరికి ఓటర్లు స్వతంత్ర అభ్యర్థి కంటే.. ప్రధాన పార్టీల వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కేవలం నేతల ప్రకటనలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఆ ఓట్లను ఏబీవీ వైపు తిప్పలేకపోయిందని స్పష్టమవుతోంది.

విజయవాడ రాజకీయాల్లో ఎప్పటి నుంచో సామాజికవర్గాల సమీకరణాలు కీలకంగా ఉంటూ వస్తున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏబీవీ బరిలో ఉండటం, జనసేన-టీడీపీ కూటమి నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధా పోటీ చేయడం వల్ల కమ్మ ఓటర్లు ఏబీవీ వైపు మొగ్గు చూపుతారని కొందరు అంచనా వేశారు. కానీ, ఫలితాలు చూస్తే కమ్మ సామాజికవర్గ ఓటర్లు కులం వైపు కాకుండా.. ‘కూటమి ధర్మం’ వైపు నిలబడ్డారని స్పష్టమైంది. టీడీపీ సానుభూతిపరులైన ఓటర్లు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అభ్యర్థి అయిన వంగవీటి రాధాకే ఏకపక్షంగా ఓటేశారు.

విజయవాడలో సాధారణంగా విద్యావంతులు, ఉద్యోగస్తుల ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. 2021 మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే (62.87%), ఈసారి 2026 ఎన్నికలలో కేవలం 54.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే దాదాపు 8 శాతం పోలింగ్ తగ్గింది. విద్యావంతులు, తటస్థ ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం ఏబీవీకి గట్టి దెబ్బ కొట్టింది. ఏబీవీ ప్రచారం ఎక్కువగా విద్యావంతులను, చైతన్యవంతమైన ఓటర్లను ఉద్దేశించి సాగింది, కానీ వారు పోలింగ్ కేంద్రాలకు రాకపోవడంతో ఆ ప్రభావం ఓట్ల రూపంలో కనిపించలేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థుల కంటే ఎక్కువగా పార్టీల గుర్తులను చూసి ఓటు వేస్తుంటారు. వంగవీటి రాధాకు జనసేన గుర్తు, వైసీపీ అభ్యర్థికి గుర్తు ఉండటం వల్ల ఓటర్లలో స్పష్టత ఉంది. కానీ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఏబీవీ గుర్తును సామాన్య ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లడంలో మద్దతు ఇచ్చిన పార్టీలు విఫలమయ్యాయి. 22ఏ భూముల వివాదం వంటి ప్రజా సమస్యలపై ఆయన పోరాడినప్పటికీ, కార్పొరేషన్ స్థాయి ఎన్నికల్లో ఆ అంశాలు ఓట్లుగా మారలేకపోయాయి.