కోహ్లీ వీక్నెస్ వెతకడం అసాధ్యం.. కివీస్ పేసర్ కీలక కామెంట్స్..!

న్యూజీలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై కివీస్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడమే కాకుండా, నెట్స్‌లో అతనికి పదే పదే బౌలింగ్ చేసిన అనుభవం డఫీకి ఉంది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డఫీ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో అవుట్ చేయడానికి ఎక్స్ప్‌లాయిట్ చేయదగ్గ బలహీనతలు అసలు ఏమాత్రం లేవని ఒప్పుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ, విరాట్ కోహ్లీ ఈడెన్ పార్క్ పిచ్‌పై ఉన్న అదనపు బౌన్స్‌ను ఎంతో అలవోకగా ఎదుర్కొంటూ కివీస్ బౌలింగ్ అటాక్‌ను ఓ ఆట ఆడుకున్నాడు అని డఫీ పేర్కొన్నాడు. “చిన్న టార్గెట్లను చేజ్ చేసేటప్పుడు కోహ్లీ లాంటి ఆటగాడు అంతటి తీవ్రమైన అటాకింగ్ ఇంటెంట్‌తో క్రీజులోకి వస్తే బౌలర్లకు లయ దెబ్బతింటుంది. సాధారణంగా షార్ట్ పిచ్ బంతులు వేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తాం, కానీ కోహ్లీ ఆ బౌన్స్‌ను వాడుకుంటూ హుక్, పుల్ షాట్లతో పాటు మా తలలపై నుండి స్ట్రెయిట్ సిక్సర్లు బాదాడు. బెంగళూరు నెట్స్‌లో నా బౌలింగ్‌లో అతను ఇలాంటి షాట్లు ఎన్నో ఆడాడు, కాబట్టి నాకైతే ఈ బ్యాటింగ్ చూసి ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు” అని డఫీ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఆర్‌సీబీ నెట్స్‌లో కోహ్లీ బ్యాటింగ్‌పై తను కొంత సమాచారం సేకరించినప్పటికీ, అతని ఆటలో తప్పులు వెతకడం ఏ బౌలర్‌కైనా చాలా కష్టమైన పనని డఫీ స్పష్టం చేశాడు. ముఖ్యంగా ఈడెన్ పార్క్ లాంటి చిన్న బౌండరీలు ఉన్న మైదానాల్లో బౌలర్ల వేగాన్ని కోహ్లీ ఉపయోగించుకునే తీరు అమోఘమన్నాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు కేవలం 185 పరుగులకే ఆలౌట్ కావడం వల్లే బౌలర్లపై ఒత్తిడి పెరిగిందని, అయితే మిగిలిన మ్యాచ్‌లలో భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని డఫీ ధీమా వ్యక్తం చేశాడు. మొదటి వన్డేలో కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇండియాకు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.