ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. “స్థానిక ఎన్నికల్లో జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకుంటాం, తగిన ప్రాధాన్యత ఇస్తాం” అని పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో క్యాడర్‌కు భరోసా ఇచ్చినప్పటికీ, వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సీట్ల పంపకాలు, హడావుడి మొత్తం తెలుగుదేశం పార్టీ వన్-మ్యాన్ షోగా సాగుతుండటంతో.. తమను అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా మోసం చేశారంటూ జనసైనికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్థానిక నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ధర్మం ప్రకారం గౌరవప్రదమైన స్థానాలు దక్కుతాయని ఆశించిన జనసేన శ్రేణులకు ఆఖరికి తీవ్ర నిరాశే ఎదురైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కేవలం పాత ఫార్ములా (85:15:5) తరహాలోనే నామమాత్రపు సీట్లతో జనసేనను సరిపెట్టారని, ఎక్కడ చూసినా పచ్చ జెండాల హడావుడి తప్ప జనసేనకు స్పేస్ లేకుండా చేశారని కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు.
మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల విషయంలో పవన్ కళ్యాణ్ కొంతవరకు పట్టుబట్టి సీట్లు తెచ్చుకున్నప్పటికీ, వార్డులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో మాత్రం స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. “గత ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొని పార్టీని కాపాడుకుంది మేం. కూటమి అధికారంలోకి రావడానికి రాత్రింబగళ్లు కష్టపడింది మేం. తీరా స్థానిక సంస్థల్లో పదవులు పంచుకునే సమయానికి మమ్మల్ని పక్కనబెట్టేస్తారా?” అంటూ జనసేన తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. నియోజకవర్గాల వారీగా జరిగిన సీట్ల సర్దుబాటులో జనసేన ప్రతిపాదించిన స్థానాలను కూడా టీడీపీ నేతలు తృణీకరించి, తమ అభ్యర్థులనే బలవంతంగా రుద్దారని, కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చాలంటూ జనసేన నేతలు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు.
సినిమాలు, ప్రభుత్వ బాధ్యతలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటూ గ్రౌండ్‌లో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుతో సఖ్యత కోసం తమ రాజకీయ భవిష్యత్తును, ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని కొందరు సీనియర్ కార్యకర్తలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ తరహా ధోరణి వల్ల పార్టీ కోసం ప్రాణాలు పెట్టే ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్రంగా నష్టపోతోందని, ఇప్పటికైనా అధిష్టానం కళ్లు తెరవకపోతే వచ్చే రోజుల్లో కూటమిలో జనసేన ఉనికి కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుందనే హెచ్చరికలు జనసేన క్యాడర్ నుండి వస్తున్నాయి.