షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దాఖలైన ఈ పిటిషన్పై కూటమి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ ఏజీ స్పందిస్తూ.. పిటిషనర్ చేసిన ఆరోపణలకు ప్రాథమికంగా ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు.
కేవలం అనుమానాలు, ఊహాగానాల ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేరని స్పష్టం చేశారు. టెండర్ నిబంధనల వల్ల తాము నష్టపోయామని ఏ సరఫరా సంస్థ కూడా ఇప్పటివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని, థర్డ్ పార్టీగా వచ్చి టెండర్ నిబంధనలను ఇన్నేళ్ల తర్వాత సవాల్ చేయడం చట్టప్రకారం చెల్లదని ఏజీ వాదించారు. పిటిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ముందు తన వాదనలు వినిపిస్తూ.. షిర్డీ సాయి సంస్థ నుంచి ఒక్కో ట్రాన్స్ఫార్మర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.40 లక్షలకు కొనుగోలు చేసిందని, కానీ పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం అదే తరహా ట్రాన్స్ఫార్మర్లను వేరే సంస్థ నుంచి రూ.85 వేలకే కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని వాదించారు. అయితే ఈ వాదనను ఏజీ తిప్పికొడుతూ.. ప్రతి రాష్ట్రంలో ఉండే సాంకేతిక అవసరాలు, ప్రమాణాలు, వాడే విడిభాగాల ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయని, వేరే రాష్ట్రాల ధరలతో ఇక్కడి కొనుగోళ్లను నేరుగా పోల్చలేమని వివరించారు. సదరు సంస్థ 2022 నుంచి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని కోర్టుకు తెలిపారు. మరోవైపు షిర్డీ సాయి సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురామ్ వాదనలు వినిపిస్తూ.. తమ సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేస్తోందని, ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేని ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల లీగల్ వాదనలను రికార్డు చేసిన హైకోర్టు ధర్మాసనం, ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.