వేర్వేరు భాషలకు చెందిన యంగ్ హీరోలు ఒకరి సినిమాల్ని ఒకరు రీమేక్ చేసుకోవడం మామూలే. తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘ఖుషి’ సినిమాను పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే.. పవన్ చేసిన ‘తమ్ముడు’ చిత్ర రీమేక్‌లో విజయ్ నటించాడు. ఐతే వీళ్లిద్దరూ దగ్గరి వయసున్న హీరోలే కాబట్టి ఇలా రీమేక్ ఎక్స్‌ఛేంజ్ జరగడంలో ఆశ్చర్యం లేదు. కానీ తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, తమిళ యంగ్ హీరో ధనుష్ మధ్య ఇలాంటి ఎక్స్‌ఛేంజ్ నడవడం చిత్రమైన విషయమే.
ఇంతకుముందు వెంకీ నటించిన ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ తమిళ రీమేక్‌లో ధనుష్ హీరోగా నటించడం విశేషం. ధనుష్ అన్న సెల్వరాఘవనే ఈ చిత్ర దర్శకుడు. తమిళంలో సెల్వ శిష్యుడి దర్శకత్వంలో ధనుష్ దీని రీమేక్‌లో నటించాడు. ఐతే నటుడిగా అప్పటికే ధనుస్‌కు చాలా మంచి పేరున్నప్పటికీ వెంకీలా ఆ పాత్రను పండించడంలో ధనుష్ ఫెయిలయ్యాడు. ఆ పాత్రకు అవసరమైన ఒక పెద్దరికాన్ని అతను చూపించలేకపోయాడు.
ఐతే ఇప్పుడు ధనుష్ సినిమాను రీమేక్ చేసే వంతు వెంకీకి వచ్చింది. ఈ మధ్యే తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ధనుష్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో వెంకీ నటించనున్న సంగతి తెలిసిందే. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ వెంకీ చూపించిన మెచ్యూరిటీని ధనుష్ చూపించలేదు. ఐతే ‘అసురన్’లో తన వయసుకు మించిన పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించి మెప్పిస్తే.. ఆ స్థాయి నటనను వెంకీ కనబరచగలడా.. ఆ పాత్రకు తాను ఫిట్ అనిపించగలడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వెంకీ కూడా మేటి నటుడే కానీ.. ‘అసురన్’లో శివసామి పాత్రలో ధనుష్ జీవించినట్లు జీవించడం అంటే సవాలే. తన పాత్రను ధనుష్ చేయలేక ఫెయిల్ అయిన నేపథ్యంలో.. ఇప్పుడు ధనుష్ విసిరిన సవాల్‌ను వెంకీ ఎలా స్వీకరిస్తాడన్నది ఆసక్తికరం.