భార్యల మెడమీది పుస్తెలు తీసేయించి.. అవమానించి (వీడియో)

హిందూ సాంప్రదాయంలో తాలిబొట్టుకు ఎనలేని గౌరవం ఉంది. హిందూ సమాజంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అవాంతరాలెన్నొచ్చినా, కష్ట నష్టాలు దరి చేరినా ఆలు మగల బంధం తెగిపోకుండా కాపాడేది పుస్తె. కానీ టిఎస్పిఎస్సీ నిర్వాకమో.. పరీక్ష కేంద్రం అధికారుల ఓవర్ యాక్షనో కానీ మెదక్ జిల్లాలో ఆడబిడ్డల తాళిబొట్లు తొలగిస్తేనే విఆర్ఓ పరీక్ష రాయనిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. 

ఈ ఘటనపై గతంలోనే పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. తాళిబొట్లు తీసేయాలన్న నిబంధన ఏమీ లేదని టిఎస్పిఎస్సీ పెద్దలు సెలవిచ్చారు. కానీ తాజాగా జరిగిన విఆర్ఓ పరీక్షల సందర్భంగా కూడా పుస్తెలు పీకేయించారు మెదక్ జిల్లాలోని ఒక పరీక్ష కేంద్రం నిర్వాహకులు.

నర్సాపూర్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో వీఆర్వో పరీక్షకు మహిళలు హాజరయ్యారు. ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించే సమయంలో సిబ్బంది… అభ్యర్థుల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మహిళలు తాళి బొట్టు,మెట్టెలు తీసివేస్తేనే లోపలికి అనుమతి ఇస్తామని హుకుం జారీ చేశారు. అభ్యర్థులు ఎంతగా ప్రాధేయపడినా సిబ్బంది ఒప్పుకోలేదు. చేసేదేమిలేక తాళిబొట్టు, మెట్టెలు తీసి వేసి పరీక్షకు హాజరయ్యారు. దీంతో పరీక్ష కేంద్రం ఎదుట మహిళా అభ్యర్థుల బంధువులు తాళి బొట్లు పట్టుకుని నిరసనకు దిగారు. విషయాన్ని పోలీసులకు చెప్పడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.హైస్కూల్ సిబ్బందితో మాట్లాడారు. 

అప్పటికే పది మంది మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసి పరీక్షకు హాజరయ్యారు. పోలీసుల జోక్యంతో హైస్కూల్ సిబ్బందిని మిగతావాళ్ళను తాళిబొట్టు,మెట్టెలతో లోనికి పంపించారు. అయితే తమ తప్పును దాటవేసేందుకు స్కూల్ సిబ్బంది యత్నించారు. అధికారులు ఆభరణాలు వేసుకున్న వారిని అనుమతించవద్దంటూ చెప్పడంతో ఇలా చేయాల్సి వచ్చిందని తమ ఓవరాక్షన్ ను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

తెలంగాణ అంతటా ఆదివారం విఆర్ఓ పరీక్షల కోలాహలం నడిచింది. బస్సులు కిక్కిరిరిసోయాయి. 11 లక్షల మంది విఆర్ఓ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. సుదూర ప్రాంతంలో పరీక్ష కేంద్రం కేటాయించడంతో చాలామంది పరీక్ష రాయలేకపోయారు. బస్సుల రద్దీ వల్ల పరీక్ష కేంద్రానికి చేరుకోలేక మరికొందరు రాయలేకపోయారు.

ఇక అధికారుల నిర్వాకంపై బాధిత మహిళా అభ్యర్థుల భర్తలు పరీక్ష సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. తాళి చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు ఎబివిపి విద్యార్థి సంఘం నేతలు మద్దతు పలికారు. వారితోపాటు ఆందోళనలో పాల్గొన్నారు.

ఈ ఘటన మరోసారి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులను ఆగ్రహానికి చేసింది. భర్తల ఆందోళన వీడియో కింద ఉంది చూడొచ్చు.