తెలంగాణ కేబినేట్ లో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలనే దాని పై సీఎం కేసీఆర్ ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సారి కేబినేట్ లో పలువురు మాజీ మంత్రులకు స్థానం లేదని ఆయన వారికి ఇన్ డైరెక్టగా సంకేతాలు పంపుతున్నారు. తాజా మాజీ మంత్రులకు ఉన్నట్టుండి సీఎం కేసీఆర్ భద్రతను తగ్గించాలని ఆదేశించడంతో కేబినేట్ లో మళ్లీ స్థానం రాదేమోనని వారికి భయం పట్టుకుంది.
దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఉన్నట్టుండి సెక్యూరిటిని తగ్గించారు. నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ సారి కూడా తనకు కేబినేట్ లో స్థానం ఖాయమని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయనకు సెక్యూరిటిని తగ్గించాలని ప్రభుత్వం నుండి పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి. దీంతో పోలీసు శాఖ వారు వెంటనే సెక్యూరిటిని తగ్గించారు. ఓ ఎమ్మెల్యేకు ఇచ్చే సాధారణ సెక్యూరిటిని మాత్రమే కల్పించారు. ప్రస్తుతం తాజా మాజీ మంత్రులందరికి కూడా మంత్రి హోదాలో సెక్యూరిటిని అందిస్తున్నారు. కానీ అల్లోలకు రెండు రోజుల క్రిత్రం సెక్యూరిటిని తగ్గించారు. దీంతో ఈ సారి కేబినేట్ లో తనకు స్థానం లేదేమోనని అందుకే సెక్యూరిటిని తగ్గించారని అల్లోల టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.
మరో మాజీ మంత్రి జోగు రామన్న. జోగు రామన్న ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. ప్రస్తుత కేబినేట్ లో కూడా మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి సెక్యూరిటి తగ్గించాలని ఆదేశాలు రావడంతో సాధారణ ఎమ్మెల్యే సెక్యూరిటిని ఆయనకు పోలీసులు కల్పించారు. దీంతో ఈ సారి కేబినేట్ లో స్థానం దక్కదేమోనని ఆయనతో పాటు అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా నేటికి కూడా మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. పని చేసేవారికే మంత్రి పదవులు వస్తాయని కొత్తవారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి పాత వారిలో మార్పు ఉంటుందని సీఎం గతంలోనే స్పష్టం చేశారు. దీంతో ఆ తాజా మాజీలలో ఎవరికి పదవి ఊడుతుందోనని అంతా టెన్షన్ పడుతున్నారు. నేరుగా వారికి తెలియకుండా హింట్ ద్వారా కేసీఆర్ వారికి మంత్రి పదవి లేదనే సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న ల పని తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వారికి ఈ సారి కేబినేట్ స్థానం దక్కకపోవచ్చని తెలుస్తోంది.