గాంధీ భవన్ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ కి పొగ బెడుతున్నారా? రేవంత్ కి కాంగ్రెస్ లో పదవి రాకుండా అడ్డుకుంటున్న నాయకుల జాబితాలో ఉత్తమ్ కూడా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ అండ్ బ్యాచ్ తీరుతో రేవంత్ అసహనంగా ఉన్నారా? అంటే…పరిణామాలు చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. ఆదివారం ఉత్తమ్ జరిపిన ఫోన్ ఇన్ కార్యక్రమం ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
గాంధీ భవన్ లో జరిగిన ఫేస్బుక్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఫోన్ కాలర్ ఉత్తమ్ ని రేవంత్ గురించి అడుగగా ఫోన్ కట్ చేశారు ఉత్తమ్. తర్వాత సిగ్నల్స్ ప్రాబ్లెమ్, ఫోన్ పాడయ్యింది రిపేర్ చేయించి రేపు మళ్లీ లైవ్ లో మాట్లాడతాను అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రేవంత్ గురించి అడగ్గానే ఉత్తమ్ ఫోన్ కట్ చేయడం రాజకీయ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆ కార్యక్రమంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా ఉత్తమ్ పలు అంశాలపై ముచ్చటించారు. కేసీఆర్ ని మోసగాడంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పించారు. కెసిఆర్ పాలన అవినీతిమయం అయిందంటూ మండి పడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో కెసిఆర్ ఆసక్తి చూపట్లేదంటూ ఆగ్రహించారు. ఇంకా ఆయన ఏ విషయాలపై మాట్లాడారో పూర్తి వివరాలు కింద చదవవచ్చు.
టిఆర్ ఎస్ ఒక్క హామీ నెరవేర్చలేదు ః ప్రజలను మోసం చేసి కేసిఆర్ గద్దెనెక్కాడు. కేసిఆర్ కుటుంబానికి ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు.
కేటిఆర్ ఒక బచ్చా…అధికారం అడ్డంపెట్టుకొని వేల కోట్లు సంపాదించాడు. కాంగ్రెస్ హామీలను ప్రజలలోకి తీసుకెళ్ళండి. కాంగ్రెస్‌కు కార్యకర్తలే పునాది. త్వరలో ఇంటింటికి కాంగ్రెస్ రాహుల్ పర్యటన అద్బుతం. రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ . 10 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి. పెన్షన్ నగదును రెట్టింపు చేస్తాం. 58 ఏళ్ళకే వృద్దాప్య పించన్. మహిళల అభివృద్దితోనే సమాజాభివృద్ది. వారిని అన్ని విధాల ఆదుకుంటాం. ఎన్నికలు ముందస్తుగా రావొచ్చు…సిద్దంగా ఉండండి. రాఫెల్ విమానాల కుంభకోణం ప్రజలలోకి తీసుకెళ్ళాలి.
2014లో రాజకీయంగా త్యాగాలు చేసి కాంగ్రెస్‌పార్టీ సోనియగాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఇస్తే మోసగాడు కేసిఆర్ అబద్దపు హామీలు, బూటకపు మాటలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడని, అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క హామీ నెరవేర్చలేదని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రెండు రోజుల పాటు డిల్లీలో ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీతో సమావేశమైన ఉత్తమ్ అక్కడ రాఫెల్ విమానాల కుంభకోణాలు, శక్తి ఆప్ పై సమీక్షలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆదివారం నాడు కాంగ్రెస్ కార్యకర్తలతో నేరుగా ఫేస్ బుక్ లైవ్ ద్వారా మాట్లడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాఫెల్ యుద్ద విమానాల కుంభకోణంలో 40 వేల కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడిందని, వైమానిక విమానాల అవినీతిలో ఇదే పెద్ద కుంభకోణమని, అనిల్ అంబానికి ఈ కాంట్రాక్టు ఇవ్వడానికి మోడీ దేశాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్ద ఉద్యమం చేస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయాలను ప్రజలకు చేరవేయాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో టిఆర్ ఎస్ ప్రబుత్వం ప్రజలకు వంచించిందని, ఎన్నికల ముందు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చలేదని, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుప్రతి ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతామన్నారు, కేజీ టు పిజి ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని అన్నారు, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు చొప్పన కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు, అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, ముస్లీంలకు, గిరిజనులకు రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతామని అన్నారు, నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదని ఉత్తమ్ విమర్శించారు.
కాంగ్రెస్‌పార్టీ టిఆర్ ఎస్ లాగా కాదని హామీలు ఇస్తే నెరవేర్చి తీరుతుందని అన్నారు, గతంలో ఉచిత విద్యుత్, బకాయిల రద్దు, రుణ మాఫీ లాంటి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని పక్కాగా అమలు చేశామని అన్నారు. ఇప్పడు కాంగ్రెస్ మరోసారి ఎన్నికల హామీలు ఇస్తున్నానమని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునే సత్తా ఉన్న పార్టీ అని ఆయన అన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ ఏకకాలంలో చేసి తీరుతామని వివరించారు. సామాజిక పెన్షన్లు పొందుతున్న అందరికీ నగదును రెట్టింపు చేస్తామని అన్నారు. వృద్దులు, వితంతవులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడి కార్మికులకు ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల పెన్షన్‌ను, రెండు వేల చేస్తామని, వికలాంగులకు ఇప్పుడున్న 1500 పెన్షన్ 3 వేల రూపాయలు చేస్తామని ఆయన వివరించారు. అలాగే వృద్దాప్య పెన్షన్ వయో పరిమితిని 65 నుంచి 58 ఏళ్ళ వయస్సుకు తగ్గిస్తామని ఆయన వివరించారు. దాదాపు 40 లక్షల మంది పెన్షన్లర్లకు లబ్డి జరిగే ఈ విషయాలను కార్యకర్తలు గ్రామాలలో విరివిగా ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు.
అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ, యువత, విద్యార్థి లోకం తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేశారని వారి పోరాటాల ఫలితమే నేటి తెలంగాణ అని కానీ అధికారంలోకి వచ్చిన కేసిఆర్ యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో మాత్రం ఎలాంటి ఆసక్తి చూపలేదని, నేటికి ఉద్యోగాలు రాకుండా యువత అలాగే నిరాశ, నిస్తౄహలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉద్యోగాలు రాకుండా ఉన్న యువతకు ఉద్యోగాల అన్వేషన కోసం నెలకు 3 వేల రూపాయలు భృతి ఇస్తామని అన్నారు. ఇది సాధ్యం కాదని, కేసిఆర్ అంటున్నారని, మనసుంటే సాధ్యమవతుందని కేసిఆర్‌కు ఆంధ్రా కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వడానికి వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఉన్నాయని, కానీ యువతకు నెలకు 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి లేవని అంటున్నారని ఆయన విమర్శించారు. నెలకు నిఖరంగా 10,500 కోట్ల ఆదాయం ఇప్పడే వస్తుందని,2019నాటికి రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని అప్పడు నెలకు 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎలాంటి సమస్య ఉండదని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందని అన్నారు.
అలాగే రాష్ట్రంలో రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పడుతున్నారని, అప్పలు బాధలతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసిఆర్ కు చలనం లేదని, వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్ళలో ఆనందం చూస్తామని అన్నారు. 17 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధరలు కల్పిస్తామని 5 వేల కోట్ల రూపాయలు మార్కెట్ స్థీరికరణ నిధులను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయం లాభదాయకంగా చేస్తామని, వరి, మొక్కజొన్నలకు క్వింటాళ్‌కు రెండు వేలు, పత్తికి 6 వేలు, మిర్చికి 10 వేల రూపాయలకు తక్కువ కాకుండా చూస్తామని వివరించారు. అలాగే ప్రకృతి వైపరిత్యాలు వచ్చినపుడు రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ఒక అద్బుతమైన వ్యవసాయ భీమా పథకాన్ని అమలు చేస్తామని వివరించారు.
మహిళల విషయంలో కేసిఆర్ ప్రభుత్వం అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని,దాదాపు కోటి 80 లక్షల మంది ఉన్న మహిళలలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, ఎఐసిసి అద్యక్షులు రాహుల్ గాంధీ ఇక్కడ మహిళా సంఘాలతో సమావేశమయ్యారని కానీ కేసిఆర్‌కు మహిళలతో సమావేశం కావడానికి సమయం లేదని అన్నారు. వారికి 3 వేల కోట్ల రూపాయలు బకాయిలున్నారని రాహుల్ గాంధీ వచ్చి సమావేశం పెట్టగానే 970 కోట్ల రూపాయలు విడుదల చేశారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు సంఘానికి లక్ష రూపాయల చొప్పున ఉచితంగా అందజేస్తామని అన్నారు. అలాగే సంఘానికి 10 లక్షల రూపాయలు రుణాలు అందజేస్తామని వాటికి వడ్డీ మాఫీ కూడా ఉంటుందని ఆయన వివరించారు. అభయ హస్తం పెన్షన్లను పునరుద్దరించి వాటిని 500 నుంచి వెయ్యి రూపాయలు చేస్తామని సెర్ప్ వర్కర్లకు ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పరిణమాలను చూస్తుంటే ఉత్తర భారత్‌లోని రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణలో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి కూడా ఇటీవల ఇలాంటి మాటలు అంటున్నట్టు పత్రికలలో కూడా వచ్చిందని, మాకు మొదటి నుంచి ఇలాంటి సమాచారం ఉందని అందువల్ల కార్యకర్తలు, డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశాలున్నట్టుగానే సిద్దంగా కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రాహుల్ గాంధీ ఇటీవల పర్యటన అద్బుతంగా జరిగిందని, కాంంగ్రెస్ కార్యకర్తల కష్టం ఫలించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాది అని వారి కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ ఇంత పటిష్టంగా ఉందని అన్నారు. త్వరలో ప్రజా చైతన్య యాత్రను తిరిగి ప్రారంభించి తొందరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు.
రాష్ట్రంలో కేసిఆర్ ఒక దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని, ప్రజలకు హక్కుల లేకుండా చేశారని ఎవరైనా మాట్లాడితే వారికి బెదిరింపులకు గురి చేస్తున్నారని, జైల్లో పెడుతామని బెదిరిస్తున్నారని ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా చేశారని ఆయన విమర్శించారు. కేసిఆర్, కేటిఆర్‌లకు వారికి పొగరు తలకెక్కిందని, వారి ప్రవర్తన ఒక నియంతలాగా ఉందని, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి ఏళ్ల తరబడి దేశ సమగ్రతను కాపాడుతున్న కాంగ్రెస్‌పైన, తెలంగాణ ఇచ్చిన సొనియాగాంధీపైన వారి మాటలు అహంరానికి పరాకాష్ట అని అన్నారు. కేటిఆర్ అమెరికాలో చదువుకొని వచ్చాడని, పిల్లగాడు సంస్కారం లేదు, తండ్రి అధికారంతో మంత్రి అయ్యాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని, వారికి ప్రజా జీవితంలో బతికే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ సాధించుకున్న లక్ష్యాలను అన్నింటికి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించి తీరుతుందని ఆయన వివరించారు.